Department of Corruption
-
ఈఎస్ఐకి నవ‘గ్రహణం’
సాక్షి, అమరావతి: చంద్రబాబు జమానాలో జరిగిన ఈఎస్ఐ స్కామ్‌లో కీలక కోణాన్ని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుర్తించింది. ఈఎస్ఐలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 988.77 కోట్లు ఖర్చు చేయగా, వాటిలో అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి రూ.150 కోట్లకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ► 19 మంది ప్రమేయం ఉన్న ఈ కేసులో కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు 8 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. మరో 11 మంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ► ఈ భారీ స్కామ్‌లో తొమ్మిది అంశాలను గుర్తించారు. తప్పుడు కొటేషన్లు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు, మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటెమ్స్, ఫర్నిచర్, బయో మెట్రిక్ పరికరాల కొనుగోళ్లలో, టోల్ ఫ్రీ–ఈసీజీ సర్వీసులు, సీవరేజ్ ట్రీట్మెంట్ వంటి 9 అంశాల్లో అవినీతిని గుర్తించారు. ► ఈ–టెండర్ల బదులు నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయలను దారి మళ్లించారు. లేని కంపెనీలు ఉన్నట్టు నకిలీ లెటర్ ప్యాడ్లు, కొటేషన్లు, ఓచర్లు, బిల్లులు సృష్టించి సొమ్ము కాజేసినట్లు గుర్తించారు. ► ఈఎస్ఐ ఉద్యోగులు కొందరు తమ కుటుంబ సభ్యుల పేరుతో బినామీ మందుల కంపెనీలు పెట్టి అక్రమంగా మందుల కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకున్నారు. ► మందులు, సర్జికల్ ఐటెమ్స్ విషయంలో మార్కెట్ ధర కంటే 50 నుంచి 136 శాతం అదనంగా అక్రమ చెల్లింపులకు పాల్పడ్డారు. ► మందుల కొనుగోళ్లలో రూ.51.2 కోట్లు, ల్యాబ్ కిట్ల కొనుగోళ్లలో రూ.85.32 కోట్లు, సర్జికల్ ఐటెమ్స్‌కు రూ.10.43 కోట్లు, ఫర్నిచర్లో రూ.4.63 కోట్లు ఇలా మొత్తం రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ► రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మా సంస్థల నుంచి కొనుగోళ్లు, ఇన్వాయిస్లను సోదాలు చేస్తే రూ.5.70కోట్లు వ్యత్యాసం కనిపించింది. ► ఈఎస్ఐ ఫార్మసిస్ట్‌గా ఉన్న కె.ధనలక్ష్మి కోడలు రావిళ్ల రవి తేజస్వి పేరుతో ఏర్పాటు చేసిన జెర్కాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు రూ.9.50కోట్ల మందుల ఆర్డర్లు ఇచ్చారు. ఇవన్నీ రమేశ్‌కుమార్, విజయకుమార్‌లు డైరెక్టర్లుగా ఉన్నప్పుడే జరిగాయి. ► జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లలోనూ అవకతవకలున్నాయి. ప్రొడిజి సంస్థ నుంచి ఒక్కొక్కటి రూ.17వేల ఖరీదు చేసే బయో మెట్రిక్ మెషీన్లను రూ. 70 వేలు చొప్పున వంద మెషీన్లు కొన్నారు. -
అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే కాంట్రాక్ట్‌లు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే టెలీ హెల్త్‌కు కాంట్రాక్ట్‌లు ఇచ్చారని.. ఈఎస్ఐలో రూ.150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు. విజయవాడలోని ఏసీబీ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవసరం లేకపోయినా మందులు, నాణ్యత లేని పరికరాలు కొనుగోలు చేశారని చెప్పారు. అప్పట్లో కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు లేఖల ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని ఈఎస్ఐ అధికారులను ఆదేశించినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే అచ్చెన్నాయుడిని విచారణకు రావాలని కోరలేదని పేర్కొన్నారు. తగిన ఆధారాలు సేకరించి.. అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఆయనను అరెస్ట్ చేశామని వివరించారు. రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి జాయింట్ డైరెక్టర్ వెల్లడించిన మరిన్ని వివరాలివీ. ► ఈఎస్ఐలో 2014 నుంచి 2019 వరకు రూ.988.77 కోట్లతో మందులు, పరికరాల కొనుగోలు చేశారు. ఇందులో రూ.150 కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగినట్టు గుర్తించాం. ► ల్యాబ్ కిట్లు, సర్జికల్ మెటీరియల్, ఆఫీస్ ఫర్నిచర్, ఈసీజీ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు గుర్తించాం. ► ఈ కుంభకోణంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి, టెక్కలి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతోపాటు మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించాం. ఇప్పటివరకు ఏడుగుర్ని అరెస్ట్ చేశాం. ► టెలీ మెడిసిన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిపై రెండు కేసులు నమోదు చేశాం. ఒక కేసు టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడంపై, మరో కేసు మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై నమోదు చేశాం. ► ఒక కేసులో చింతల కృష్ణప్ప రమేష్‌కుమార్ ఏ–1 గాను, అచ్చెన్నాయుడు ఏ–2 గాను ఉన్నారు. ► మరో కేసులో ఈటగాడి విజయకుమార్, విప్పర్తి జనార్దన్, ఇవన రమేష్‌బాబు, ఎంకేపీ చక్రవర్తి, గోరో వెంకట సుబ్బారావు నిందితులు. వీరందరికీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించాం. ► అచ్చెన్నాయుడి ఆరోగ్య సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శస్త్ర చికిత్స చేయించుకున్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో రిమాండ్ అనంతరం ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ► ఈ కుంభకోణానికి సంబంధించి అనేక మందిని విచారణ చేయాల్సి ఉంది. అనేక రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉంది. ► అచ్చెన్నాయుడు, రమేష్‌కుమార్ తరపున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు వేశారు. హైకోర్టు నుంచి నోటీసులు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి ఏసీబీ సమాధానం ఇస్తుంది. ► ఈ కుంభకోణానికి తెలంగాణాలోను లింకులున్నాయి. ఇందులో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించాం. ► ఈ కుంభకోణం వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఎక్కువ ఉంది. అవినీతి వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరినీ బయటకు లాగుతాం. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ కొరడా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం మెరుపుదాడులు చేసింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో 13 జిల్లాల్లో ఎంపిక చేసుకున్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సోదాల్లో అనధికార డాక్యుమెంట్ రైటర్లను గుర్తించడంతోపాటు కార్యాలయాల్లో లెక్కల్లో చూపని అక్రమ సొమ్ము రూ.10,34,256 స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు ఏసీబీ డీజీ తెలిపారు. బట్టబయలైన అక్రమాలు.. - ఆస్తుల క్రయవిక్రయాలు చేసిన వారు రిజిస్ట్రేషన్ కోసం వస్తే డబ్బులు వసూళ్లు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన ఆస్తిని బట్టి రేటు పెట్టి మామూళ్లు దండుకుంటున్నారు. - ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అనధికార డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తులను గుర్తించారు. - రిజిస్ట్రార్, సిబ్బంది వద్ద ఉన్న పుస్తకాలు, డాక్యుమెంట్లు, టేబుల్ సొరుగుల్లో లెక్కల్లో చూపని అక్రమ సొమ్మును గుర్తించారు. - రిజిస్ట్రార్లకు ఇచ్చేందుకు అనధికార డాక్యుమెంట్ రైటర్లు తెచ్చిన మొత్తాలను స్వాధీనం చేసుకున్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఫలితం రాష్ట్రంలో అవినీతి ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన స్పందన 14400 టోల్ ఫ్రీ నంబర్ ఫలితాలిస్తోంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు 14400కు వస్తున్న ఫిర్యాదులను సమీక్షించారు. అత్యధిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న ప్రభుత్వ శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పట్టిన అవినీతి మకిలిని వదిలించేందుకు ఏసీబీ డీజీ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏకకాలంలో అన్ని జిల్లాల్లోను సోదాలు నిర్వహించారు. -
‘లెజెండ్’ శ్రీహరికి బినామీనే..
సాక్షి, హైదరాబాద్: ‘వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు’అన్న సామెత ఈఎస్ఐ మందుల గోల్‌మాల్‌లో అక్రమాలకు చక్కగా సరిపోతుంది. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో మందుల కోనుగోళ్ల గోల్‌మాల్‌కు సంబంధించి ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కీలక సాక్ష్యాలు సేకరించింది. ఐఎంఎస్‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులను తన గుప్పిట పెట్టుకున్న శ్రీహరి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టినట్లు గుర్తించింది. తన కంపెనీకి అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టించుకున్నదే కాకుండా.. తన బినామీ కంపెనీలకూ నకిలీ అర్హత పత్రాలతో కాంట్రాక్టులు ఇప్పించుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. బినామీ కంపెనీకి ఐఎంఎస్ చెల్లించిన డబ్బును తర్వాత తన ఖాతాలోకి ఎలా మళ్లించుకున్నాడో ఆధారాలూ సంపాదించింది. నకిలీ చిరునామా, కంపెనీ, సర్టిఫికెట్లు ఐఎంఎస్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనేక కాంట్రాక్టులు పొందిన శ్రీహరిబాబు 2017–18లో ఏకంగా లెజెండ్ ఎంటర్ప్రైజెస్ పేరిట ఓ డొల్ల కంపెనీని సృష్టించాడు. దానికి కృపాసాగర్‌రెడ్డి అనే వ్యక్తిని యజమానిగా పెట్టాడు. దానికి డ్రగ్ కంట్రోల్ అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో కూకట్పల్లి, రాజీవ్‌గాంధీనగర్ చిరునామాగా పేర్కొన్నాడు. అసలు ఈ చిరునామాలో ఎలాంటి కంపెనీ లేదు. మరోవైపు స్వీడన్‌కు చెందిన హోమోక్యూ అనే కంపెనీ తెల్ల రక్తకణాలను పరీక్షించే కిట్ల (డబ్ల్యూబీసీ)ను భారత్‌లో సరఫరా చేస్తోంది. వీటిని సరఫరా చేసే అనుమతులు ఓమ్నీకి ఉన్నాయి. ఇక్కడే శ్రీహరి తన తెలివితేటలు చూపించాడు. తాను హోమోక్యూ కంపెనీ నుంచి డబ్ల్యూబీసీ కిట్లను ఒక్కోటి రూ.11,800లకు కొన్నాడు. వీటిని లెజెండ్ కంపెనీ ద్వారా రూ.36,800లకు ఐఎంఎస్‌కు విక్రయించాడు. రెండు కంపెనీల ఇన్వాయిస్లను పరిశీలించగా.. 2017 ఆగస్టు 11న ఈ కిట్లు ఓమ్నీ కంపెనీకి హోమోక్యూ సరఫరా చేయగా.. లెజెండ్ కంపెనీ 12న ఐఎంఎస్‌కు సరఫరా చేసింది. దీనివల్ల రూ.54 కోట్లు ఐఎంఎస్ ద్వారా లెజెండ్ కంపెనీ ఖాతాలోకి వెళ్లాయి. ఈ తతంగానికి హోమో క్యూ కంపెనీ ఏపీ–తెలంగాణ రీజినల్ మేనేజర్ వెంకటేశ్ పూర్తిగా సహకరించాడు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.11.07 కోట్లు నష్టం వాటిల్లింది. విషయం తెలిసిన హోమోక్యూ కంపెనీ తమకూ లెజెండ్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. రెండు కంపెనీల కిట్లకు ఒకటే బ్యాచ్ నంబర్.. వాస్తవానికి లెజెండ్ కంపెనీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ద్వారా రిజిస్టరైనా.. దానికి ఈ కిట్లను సరఫరా చేయాలంటే హోమోక్యూ నుంచి డిస్ట్రిబ్యూటరై ఉండాలి. కానీ, లెజెండ్ హోమోక్యూ డిస్ట్రిబ్యూటర్ అంటూ శ్రీహరి ఓ నకిలీ సర్టిఫికెట్‌ను కూడా సృష్టించాడు. ఇక శ్రీహరి చెప్పిన రేటును ఆమోదిస్తూ అప్పటి డైరెక్టర్ దేవికారాణి, డిప్యూటీ డైరెక్టర్ కలకుంట్ల పద్మలు సంతకాలు చేసి బిల్లులు చెల్లించారు. అలా లెజెండ్ కంపెనీకి చెల్లించిన రూ.54 కోట్లను తిరిగి శ్రీహరి తన ఓమ్నీ ఫార్మా ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ మేరకు ఏసీబీ లెజెండ్ బ్యాంకు ఖాతా లావాదేవీల ప్రతులను సేకరించింది. శ్రీహరి లెజెండ్ కంపెనీ కోసం సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లు కూడా సంపాదించింది. అంతేకాకుండా ఓమ్నీ కంపెనీని హోమోక్యూ సరఫరా చేసిన డబ్ల్యూబీసీ కిట్ల బ్యాచ్ నంబర్లు, లెజెండ్ సరఫరా చేసిన బ్యాచ్ నంబర్లు ఒకటే కావడం గమనార్హం. దీంతో ఈ రెండు కంపెనీల వెనక ఉన్నది శ్రీహరిబాబే ఉన్నట్లు తేటతెల్లమైందని అధికారులు వ్యాఖ్యానించారు. ఇటీవల ఫార్మా కంపెనీ ఎండీ శ్రీహరి బాబుతో పాటు, హోమోక్యూ రీజినల్ మేనేజర్ టంకశాల వెంకటేశ్‌లు అరెస్టయిన విషయం తెలిసిందే. -
అవినీతి సొమ్ముతో ఆభరణాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో వెలుగుచూసిన మందుల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దేవికారాణికి చెందిన డొల్ల కంపెనీలను గుర్తించారు. ఈ కంపెనీలు దేవికారాణితో కలసి మం దుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డ తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి పేరిట ఉన్నాయి. దీం తో గురువారం అల్వాల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇంటి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి వరకు దాడులు కొనసాగాయి. తాజా సమాచారంతో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. రూ.కోట్లలో ఆర్జన.. ఈఎస్ఐలో ప్రభుత్వ జీవో 51 ప్రకారం.. ఆర్సీ (రేటెడ్ కంపెనీ)లకే మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎన్ఆర్సీ కంపెనీలకు అవకాశం ఇవ్వాలి. కానీ డైరెక్టర్ హోదాలో ఉన్న దేవికారాణి ఈ లొసుగును ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారన్నది ఏసీబీ అభియోగం. కమీషన్ల కోసం తేజ, ఓమ్ని, మెడీ వంటి కంపెనీల చేత అవసరానికి మించి, అధిక ధరలకు మందులు కొనుగోలు చేయించినట్లు ఏసీబీకి ఆధారాలు దొరుకుతున్నాయి. కాగితాల మీద కంపెనీలు సృష్టించి వాటికి బిల్లులు మంజూరు చేయించుకుని, పంచుకున్నారన్న ఆరోపణలు తాజాగా ఏసీబీ తనిఖీల్లో లభిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో దేవికారాణికి ఫార్మాసిస్ట్ కొడాలి నాగలక్ష్మి సహకరించింది. నకిలీ కంపెనీలకు భారీగా బిల్లులు మంజూరు చేసి వీరిద్దరూ రూ.కోట్లు గడించారు. దేవికారాణి ఏకంగా రూ.3 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు కొన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడిది? అంత విలువైన ఆభరణాలు ఎలా కొనగలిగారు? అన్న వివరాలపై అధికారులు కూపీ లాగుతున్నారు. రూ.10 కోట్లు దాటిన అక్రమాలు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల గోల్‌మాల్‌లో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మలు పోటీపడ్డారు. ఫలితంగా ఈఎస్ఐకి రూ.9.28 కోట్లు నష్టం వాటిల్లింది. తాజాగా 2017–18కి సంబంధించిన 22 ఇండెంట్లలో రెండింటిని విశ్లేషించిన ఏసీబీ అధికారులు రూ.70 లక్షలకుపైగా ఈఎస్ఐ సొమ్ము పక్కదారి పట్టిందని తేల్చారు. దీంతో ఈ వ్యవహా రంలో వెలుగుచూసిన అవినీతి రూ.10 కోట్లు దాటింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన 16 మంది రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సేకరించిన ఆధారాలతో మరిం త మందిని అరెస్టు చేయనున్నారని సమాచారం. -
ఏసీబీ వలలో జేసీ సీసీ
భూపాలపల్లి: వివిధ శాఖల్లో నిత్యం దాడులు జరిపే అవినీతి నిరోధక శాఖ ఈసారి ఏకంగా జిల్లా కలెక్టరేట్లోనే పంజా విసిరింది. లంచం కోసం కక్కుర్తి పడిన ఓ అధికారిని బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారిం ది. ఏసీబీ డీఎస్పీ కె భద్రయ్య, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన బియ్యం వ్యాపారి జన్ను అనిల్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఓ లారీలో 162 క్వింటాళ్ల బియ్యాన్ని ములుగు మీదుగా తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ములుగు పోలీసులు లారీని పట్టుకొని సీజ్ చేశారు. దీంతో అనిల్ హైకోర్టును ఆశ్రయించగా సీజ్ చేసిన బియ్యాన్ని రిలీజ్ చేయాలని అక్టోబర్ 23న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రతులను అక్టోబర్ 30న జేసీ స్వర్ణలత సీసీ ఎండీ తాజొద్దీన్‌కు అప్పగించారు. తన బియ్యాన్ని రిలీజ్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. బియ్యం రిలీజ్ ఆర్డర్ కాపీ తీసుకునేందుకని ఈ నెల 5న సీసీ తాజొద్దీన్ వద్దకు అనిల్ వచ్చాడు. అయితే లంచం ఇవ్వనిదే రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వనని సదరు అధికారి చెప్పాడు. సుమా రు పది రోజుల పాటు సీసీని బాధితుడు అనిల్ బతిమిలాడాడు. అయినప్పటికీ అతడు కనికరించలేదు. రిలీజింగ్ ఆర్డర్ కాపీ కోసం రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు. దీంతో చేసేది లేక బాధితుడు అనిల్ రూ. 50 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని అనిల్ ఇటీవల వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని జేసీ సీసీ గదిలో అనిల్ రూ. 45 వేలు సీసీ తాజొద్దీన్‌కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె భధ్రయ్య, అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుకున్న నగదును స్వాధీనం చేసుకొని తాజొద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని సీసీ కెమెరాల పుటేజీలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. లంచం తీసుకున్న తాజొద్దీన్ బుధవారం ఎవరెవరిని కలిశారనే విషయమై సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యా హ్నం నుంచి రాత్రి వరకు తాజొద్దీన్‌ను విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు రాత్రి అతడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే కలెక్టరేట్లో చోటు చేసుకున్న ఈ సంఘటన కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. లంచం ఇవ్వడం ఇష్టం లేకనే.. బియ్యం వ్యాపారం చేస్తాను. నా బియ్యాన్ని ములుగు పోలీసులు పట్టుకున్నారు. హైకోర్టును ఆశ్రయించగా బియ్యాన్ని రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ కాపీలు ఇచ్చినప్పటికీ రిలీజింగ్ ఆర్డర్ కాపీని సీసీ తాజొద్దీన్ ఇవ్వడం లేదు. రూ. లక్ష లంచం కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించా. రూ. 45 ఇచ్చి తాజొద్దీన్‌ను ఏసీబీకి పట్టించా. – జన్ను అనిల్, బాధితుడు విచారణ కొనసాగుతోంది.. జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత సీసీ తాజొద్దీన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై విచారణ జరుపుతున్నాం. సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిపై కేసులు నమోదు చేసేందుకు వెనుకాడం. – కె భద్రయ్య, ఏసీబీ డీఎస్పీ -
సీఎం ఇలాకాలో.. డీఎస్పీ.. ఓ అవినీతి కథ
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆయన ఓ సీఐ. కానీ..ఓ నిఘా అధికారికి అత్యంత సన్నిహితుడు. ఆయన కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ పోస్టు సృష్టించి మరీ డీఎస్పీగా పదోన్నతి కల్పించారు. సీఎం ఇలాకా చిత్తూరు జిల్లాలో ఆ డీఎస్పీ ఆడిందే ఆట..పాడిందే పాట. ఎర్రచందనం స్మగ్లింగ్ దగ్గర నుంచీ సెటిల్మెంట్ల వరకు ఆయన చేయని దందా లేదు. ఇలా అక్రమమార్గాల్లో పోగేసిన సొమ్ములో హైదరాబాద్‌లో చేర్చాల్సిన వారికి చేర్చి.. తన వాటాగా వచ్చిన సొమ్ముతో సమీకరించిన ఆస్తుల విలువ రూ.300 కోట్లకుపైగా ఉంటుందని పోలీసు అధికారవర్గాలే చెబుతున్నాయి. పోలీసువనంలో గంజాయి మొక్కలా మారిన ఈ డీఎస్పీపై ఆ శాఖ వర్గాలే విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. 1991 బ్యాచ్‌కు చెందిన ఓ ఎస్ఐ తొలుత రేణిగుంట సర్కిల్లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగారు. కొన్నాళ్ల క్రితం సీఐగా పదోన్నతి పొందిన ఈ ఎస్ఐకు సూపర్ న్యూమరరీ పోస్టును సృష్టించి మరీ డీఎస్పీగా పదోన్నతి కల్పించారు నిఘా అధికారి. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతంలోని ఓ నియోజకవర్గానికి ఇన్చార్జి డీఎస్పీగా పోస్టింగ్ తెప్పించుకున్నారు. పశ్చిమ మండలాల్లో బలహీనంగా ఉన్న టీడీపీని బలోపేతం చేసే బాధ్యతను కూడా ఆ అధికారి తనకు అప్పగించారని ఆ డీఎస్పీ బాహటంగానే వ్యాఖ్యానిస్తుంటారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నా... ఈ డీఎస్పీనే సెటిల్ చేస్తుంటారు. జిల్లాకు చెందిన ఏ స్థాయి నాయకుడైనా ఈ డీఎస్పీ వద్దకు వెళ్లాల్సిందే. చిత్తూరు, తిరుపతిలో ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి తమ సమస్యనో, సెటిల్మెంట్ల గురించో విన్నవిస్తే.. ఆయన పరిష్కరిస్తారు. డాన్లకే డాన్ ఆ డీఎస్పీ..: అక్రమార్జనే ప్రధానంగా తన అవినీతి సామ్రాజ్యాన్ని డీఎస్పీ విస్తరించుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఈ డీఎస్పీ స్మగ్లర్లను మించిపోయారనే ప్రచారం ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో పనిచేసిన ఓ పోలీసు అధికారి ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టారు. ఓ మాజీ నక్సల్ ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణా చేయించేవారు. అతని ద్వారా మరికొంతమందిని ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించుకునేవారు. సీఐకి తెలియకుండా ఎవ్వరూ ఎర్రచందనం అక్రమ రవాణా చేయడానికి వీలు లేని విధంగా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో అరెస్టయిన ప్రముఖ మోడల్ సంగీత చటర్జీ నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. ఇటీవల రేణిగుంట పోలీస్టేషన్లో ఓ ఎర్రచందనం స్మగ్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ పేరుతో పిలుచుకొచ్చి అతన్ని తీవ్రంగా హింసించటంతో దెబ్బలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపించారు. అయితే స్మగ్లర్ మృతిపై ఎటువంటి విచారణ లేదు, ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఈ డీఎస్పీనే కారణమనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ స్మగ్లర్ల వద్ద ఈ డీఎస్పీ రూ.కోటి నుంచి రూ.3 కోట్లు వసూలు చేసుకుని, అతనిపై సాధారణ కేసులు నమోదు చేస్తాడు. నాలుగైదు రోజుల్లో బైయిల్‌పై బయటకు వచ్చేలా చేసి.. యథావిధిగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తి సహకారం అందించి భారీగా మామూళ్లు వసూలు చేసుకుంటుంటాడు. అక్రమ వ్యాపారాల్లో ఆరితేరిన డీఎస్పీ.. ఏ పోలీస్‌స్టేషన్‌లో అయినా పార్టీ నాయకులపై కేసు రిజిస్టర్ కావాలన్నా... ఎటువంటి ‘పంచాయితీ’ చేయాలన్నా ఆ డీఎస్పీ నిర్ణయించాలి. ముఖ్యంగా ఇతర పార్టీ నేతలపై క్రిమినల్ కేసులన్నీ ఇతని కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. జిల్లాలోని మద్యం సిండికేట్ల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటున్నాడు. దీంతో పాటు ఇసుకను బెంగళూరు, చెన్నైకు తరలి వెళ్తున్న అక్రమ రవాణాలో ఇతని అనుచరులే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అనుచరుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు.. ఇతరులు తరలిస్తున్న అక్రమ రవాణాలోనూ మామూళ్లు పుచ్చుకుంటున్నట్లు విమర్శలున్నాయి. అంతటితో విడిచిపెట్టని డీఎస్పీ బియ్యం అక్రమరవాణా, క్వారీలు పేలుడు పదార్థాలు, గ్రానైట్ అక్రమ రవాణా ముఖ్య ఆదాయ వనరులుగా మార్చుకున్నాడు. గ్రానైట్ అక్రమ రవాణా ద్వారా ప్రతి నెలా రూ.50 లక్షల చొప్పున వసూలు చేసుకుంటున్నాడు. అదే విధంగా పశువులను కబేళాలకు తరలించే వారి నుంచి ప్రతి నెలా రూ.10 లక్షలు వసూలు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వందల కోట్లకు చేరిన అక్రమాస్తులు.. డీఎస్పీ అక్రమ సంపాదన నెలకు సుమారు రూ.కోట్లలో ఉంటుందని డిపార్ట్మెంట్ వారే చర్చించుకుంటున్నారు. వివిధ అక్రమ రవాణా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తిన ఆ డీఎస్పీ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, అమరావతి, తిరుపతి, చిత్తూరులో ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న బంగళా విలువ కోట్ల రూపాయలు ఉంటుంది. గాజులమండ్యం వద్ద సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. సత్యవేడు వద్ద మరో ఫ్యాక్టరీలో ఈ డీఎస్పీ భాగస్వామి అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే పరిశ్రమ యజమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంటాడు. అందులో భాగంగా గాజులమండ్యం వద్ద ఆరునెలల క్రితం ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి ఓ కార్మికుడు చనిపోయాడు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. డీఎస్పీ ఆ ఫ్యాక్టరీపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాపాడాడు. ఎర్రచందనం అక్రమ రవాణా, సెటిల్మెంట్ల ద్వారా అక్రమంగా సంపాదించిన ధనంతో తిరుపతిలో విలాసవంతమైన పెంట్ హౌస్, ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో కొన్ని కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. కడప, చెన్నై, బెంగళూరులలో పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నాడు. పోలీస్‌శాఖలో చాలా మంది డీఎస్పీలు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నా.. వారిని కాదని సదరు అవినీతి డీఎస్పీని జిల్లాలోని ఓ నియోజకవర్గానికి ఇన్చార్జి డీఎస్పీగా నియమితుడైన.. ఇతనిపై చర్యలు తీసుకోవడానికి ఏ అధికారి సాహసించక లేకపోతున్నారంటే ఇతనికి ఏ స్థాయిలో అండదండలున్నాయో అర్థమౌతోంది. -
అవినీతి నిరోధానికి త్వరలో కఠిన చట్టాలు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): అవినీతిని నిరోధించడానికి కేంద్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కఠినమైన చట్టాలు రూపొందించిందని, త్వరలో ఇవి అమల్లోకి రానున్నాయని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ చెప్పారు. విశాఖ పోర్టు ట్రస్ట్(వీపీటీ), డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్)లలో నిర్వహిస్తున్న నిఘా వారోత్సవాల ముగింపు సభ శనివారం పోర్టు సాంబమూర్తి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఠాకూర్ మాట్లాడుతూ అవినీతిపరులను గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషిస్తున్నామన్నారు. వీపీటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డీసీఐ సీఎండీ రాజేష్ త్రిపాఠి మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించి అవినీతిని అదుపు చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కమర్షియల్ ట్యాక్స్ ప్రి న్సిపల్ కమిషనర్ హరేరాం మాట్లాడుతూ అవినీతి నిరోధించేందుకు అన్ని శాఖల పని తీరు పారదర్శకంగా ఉండాలన్నారు. వారో త్సవాల్లో భాగంగా ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన చిత్ర లేఖన పోటీల్లో గెలు పొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో పోర్టు డి ప్యూటీ చైర్మన్ పి.ఎల్. హరనాథ్, చీఫ్ విజిలె న్స్ అధికారి వి.వి. ఎస్.శ్రీనివాస్, వీపీటీ, డీసీఐ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏఎంసీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆంధ్రా వైద్య కళాశాలలో శనివారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించారు. ఏఎంసీ, హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా చేపట్టిన ఈ వారోత్సవాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఎస్.వి.ఎస్.ఎస్.ఎస్.ప్రసాద్‌శర్మ, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.దేవి మాధవి, హెచ్‌పీసీఎల్ చీఫ్ మేనేజర్(పబ్లిక్ రిలేషన్స్) యు.ఎస్.శర్మ, చీఫ్ మేనేజర్(విజిలెన్స్) సురేష్‌బాబు, వివిధ శాఖల వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్య విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నైతిక విలువలతో పారదర్శకత పెంపు ఉక్కునగరం: ఉద్యోగుల్లో నైతిక విలువలు, సంస్థ పట్ల వైఖరి మార్పు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఎం ఎం.సి.మాథుర్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ఎంపీ హాలులో జరిగిన విజిలెన్స్ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల్లో నిబద్ధత, భాగస్వామ్య వైఖరి పెంచడం వల్ల సంస్థ అభివృద్థి పథంలో నడుస్తుందన్నారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ అవినీతి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందన్నారు. ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పి.సి.మహాపాత్ర, రే చౌదరి, పి.కె.రథ్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి మరకలు
నెల్లిమర్ల: జిల్లాలో ఎక్కడా లేని విధంగా నెల్లిమర్ల మండలంలో పని చేస్తున్న ప్రభుత్వోద్యోగులు తరచుగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఆరు నెలల వ్యవధిలో ముగ్గురు ఉద్యోగులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారంటే ఇక్కడ జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందోనన్న చర్చ జరుగుతోంది. ఎప్పుడో ఏడేళ్ల కిందట మండల విద్యుత్ శాఖ ఏఈగా పని చేసిన ఓ అధికారిపై ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ప్రభుత్వోద్యోగులు భయపడ్డారో ఏమోగాని అప్పటి నుంచీ గతేడాది వరకు ఒక్క అధికారిగాని, ఉద్యోగిగాని ఏసీబీకి పట్టుబడలేదు. గతేడాది మళ్లీ ఏసీబీ అధికారులు నేరుగా తహసీల్దారు కార్యాలయం పైనే దాడి చేశారు. పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఆత్మారాముని అగ్రహారం గ్రామ రెవెన్యూ అధికారి యేసును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అది జరిగిన ఆరు నెలల్లోపే నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన అచ్చిన్నాయుడు ఇంటిపై దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు సదరు కమిషనర్‌పై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన నెల రోజుల వ్యవధిలోనే సతివాడ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిదిలో లైన్‌మన్‌గా పని చేస్తున్న రజనీకాంత్‌పై దాడి చేశారు. అన్యాయంగా తొలగించిన వ్యవసాయ విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించేందుకు రైతు నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆరునెలల వ్యవధిలోనే ముగ్గురు ప్రభుత్వోద్యోగులపై ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు మండలంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది నిజాయితీపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ దాడులతోనైనా అవినీతి అధికారులు తమ లంచావతారాన్ని మానుకుంటారో...లేదో...వేచి చూడాలి.