సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే టెలీ హెల్త్‌కు కాంట్రాక్ట్‌లు ఇచ్చారని.. ఈఎస్‌ఐలో రూ.150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు. విజయవాడలోని ఏసీబీ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవసరం లేకపోయినా మందులు, నాణ్యత లేని పరికరాలు కొనుగోలు చేశారని చెప్పారు. అప్పట్లో కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు లేఖల ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని ఈఎస్‌ఐ అధికారులను ఆదేశించినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే అచ్చెన్నాయుడిని విచారణకు రావాలని కోరలేదని పేర్కొన్నారు. తగిన ఆధారాలు సేకరించి.. అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఆయనను అరెస్ట్ చేశామని వివరించారు. రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి జాయింట్ డైరెక్టర్ వెల్లడించిన మరిన్ని వివరాలివీ.
► ఈఎస్‌ఐలో 2014 నుంచి 2019 వరకు రూ.988.77 కోట్లతో మందులు, పరికరాల కొనుగోలు చేశారు. ఇందులో రూ.150 కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగినట్టు గుర్తించాం.
► ల్యాబ్ కిట్లు, సర్జికల్ మెటీరియల్, ఆఫీస్ ఫర్నిచర్, ఈసీజీ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు గుర్తించాం.
► ఈ కుంభకోణంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి, టెక్కలి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతోపాటు మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించాం. ఇప్పటివరకు ఏడుగుర్ని అరెస్ట్ చేశాం.
► టెలీ మెడిసిన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిపై రెండు కేసులు నమోదు చేశాం. ఒక కేసు టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడంపై, మరో కేసు మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై నమోదు చేశాం.
► ఒక కేసులో చింతల కృష్ణప్ప రమేష్‌కుమార్ ఏ–1 గాను, అచ్చెన్నాయుడు ఏ–2 గాను ఉన్నారు.
► మరో కేసులో ఈటగాడి విజయకుమార్, విప్పర్తి జనార్దన్, ఇవన రమేష్‌బాబు, ఎంకేపీ చక్రవర్తి, గోరో వెంకట సుబ్బారావు నిందితులు. వీరందరికీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించాం.
► అచ్చెన్నాయుడి ఆరోగ్య సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శస్త్ర చికిత్స చేయించుకున్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో రిమాండ్ అనంతరం ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.
► ఈ కుంభకోణానికి సంబంధించి అనేక మందిని విచారణ చేయాల్సి ఉంది. అనేక రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉంది.
► అచ్చెన్నాయుడు, రమేష్‌కుమార్ తరపున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు వేశారు. హైకోర్టు నుంచి నోటీసులు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి ఏసీబీ సమాధానం ఇస్తుంది.
► ఈ కుంభకోణానికి తెలంగాణాలోను లింకులున్నాయి. ఇందులో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించాం.
► ఈ కుంభకోణం వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ అధికారులతోపాటు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఎక్కువ ఉంది. అవినీతి వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరినీ బయటకు లాగుతాం.
అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే కాంట్రాక్ట్‌లు
Published Sun, Jun 14 2020 4:53 AM | Last Updated on Sun, Jun 14 2020 4:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment