నెల్లిమర్ల: జిల్లాలో ఎక్కడా లేని విధంగా నెల్లిమర్ల మండలంలో పని చేస్తున్న ప్రభుత్వోద్యోగులు తరచుగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఆరు నెలల వ్యవధిలో ముగ్గురు ఉద్యోగులపై ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారంటే ఇక్కడ జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందోనన్న చర్చ జరుగుతోంది. ఎప్పుడో ఏడేళ్ల కిందట మండల విద్యుత్ శాఖ ఏఈగా పని చేసిన ఓ అధికారిపై ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ప్రభుత్వోద్యోగులు భయపడ్డారో ఏమోగాని అప్పటి నుంచీ గతేడాది వరకు ఒక్క అధికారిగాని, ఉద్యోగిగాని ఏసీబీకి పట్టుబడలేదు.
గతేడాది మళ్లీ ఏసీబీ అధికారులు నేరుగా తహసీల్దారు కార్యాలయం పైనే దాడి చేశారు. పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఆత్మారాముని అగ్రహారం గ్రామ రెవెన్యూ అధికారి యేసును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అది జరిగిన ఆరు నెలల్లోపే నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన అచ్చిన్నాయుడు ఇంటిపై దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు సదరు కమిషనర్‌పై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన నెల రోజుల వ్యవధిలోనే సతివాడ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిదిలో లైన్‌మన్‌గా పని చేస్తున్న రజనీకాంత్‌పై దాడి చేశారు. అన్యాయంగా తొలగించిన వ్యవసాయ విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించేందుకు రైతు నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆరునెలల వ్యవధిలోనే ముగ్గురు ప్రభుత్వోద్యోగులపై ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు మండలంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది నిజాయితీపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ దాడులతోనైనా అవినీతి అధికారులు తమ లంచావతారాన్ని మానుకుంటారో...లేదో...వేచి చూడాలి.
అవినీతి మరకలు
Published Thu, Jul 27 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
Advertisement
Advertisement