ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు జమానాలో జరిగిన ఈఎస్‌ఐ స్కామ్‌లో కీలక కోణాన్ని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుర్తించింది. ఈఎస్‌ఐలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 988.77 కోట్లు ఖర్చు చేయగా, వాటిలో అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి రూ.150 కోట్లకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే.
► 19 మంది ప్రమేయం ఉన్న ఈ కేసులో కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు 8 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. మరో 11 మంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
► ఈ భారీ స్కామ్‌లో తొమ్మిది అంశాలను గుర్తించారు. తప్పుడు కొటేషన్లు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు, మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటెమ్స్, ఫర్నిచర్, బయో మెట్రిక్ పరికరాల కొనుగోళ్లలో, టోల్ ఫ్రీ–ఈసీజీ సర్వీసులు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ వంటి 9 అంశాల్లో అవినీతిని గుర్తించారు.
► ఈ–టెండర్ల బదులు నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయలను దారి మళ్లించారు. లేని కంపెనీలు ఉన్నట్టు నకిలీ లెటర్ ప్యాడ్‌లు, కొటేషన్లు, ఓచర్లు, బిల్లులు సృష్టించి సొమ్ము కాజేసినట్లు గుర్తించారు.
► ఈఎస్‌ఐ ఉద్యోగులు కొందరు తమ కుటుంబ సభ్యుల పేరుతో బినామీ మందుల కంపెనీలు పెట్టి అక్రమంగా మందుల కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకున్నారు.
► మందులు, సర్జికల్ ఐటెమ్స్ విషయంలో మార్కెట్ ధర కంటే 50 నుంచి 136 శాతం అదనంగా అక్రమ చెల్లింపులకు పాల్పడ్డారు.
► మందుల కొనుగోళ్లలో రూ.51.2 కోట్లు, ల్యాబ్ కిట్ల కొనుగోళ్లలో రూ.85.32 కోట్లు, సర్జికల్ ఐటెమ్స్‌కు రూ.10.43 కోట్లు, ఫర్నిచర్‌లో రూ.4.63 కోట్లు ఇలా మొత్తం రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు.
► రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మా సంస్థల నుంచి కొనుగోళ్లు, ఇన్వాయిస్‌లను సోదాలు చేస్తే రూ.5.70కోట్లు వ్యత్యాసం కనిపించింది.
► ఈఎస్‌ఐ ఫార్మసిస్ట్‌గా ఉన్న కె.ధనలక్ష్మి కోడలు రావిళ్ల రవి తేజస్వి పేరుతో ఏర్పాటు చేసిన జెర్కాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు రూ.9.50కోట్ల మందుల ఆర్డర్లు ఇచ్చారు. ఇవన్నీ రమేశ్‌కుమార్, విజయకుమార్‌లు డైరెక్టర్లుగా ఉన్నప్పుడే జరిగాయి.
► జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లలోనూ అవకతవకలున్నాయి. ప్రొడిజి సంస్థ నుంచి ఒక్కొక్కటి రూ.17వేల ఖరీదు చేసే బయో మెట్రిక్ మెషీన్లను రూ. 70 వేలు చొప్పున వంద మెషీన్లు కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment