అపోలోకు చిత్తూరు ప్రభుత్వాసుపత్రి | chittoor govt hospital attached to apollo hospital | Sakshi
Sakshi News home page

అపోలోకు చిత్తూరు ప్రభుత్వాసుపత్రి

Published Thu, Jul 2 2015 9:01 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

ప్రభుత్వం జారీ చేసిన మెమో - Sakshi

ప్రభుత్వం జారీ చేసిన మెమో

సాక్షి, హైదరాబాద్: తాను అధికారంలోకి వస్తే నూతన రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానంటూ ఓట్లు దండుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు... ఇప్పుడు అధికారం చేపట్టాక సొంత జిల్లా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రినే ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఒక వైద్య కళాశాల ప్రారంభిస్తామంటే నానా రకాల కొర్రీలు వేస్తూ ఏళ్లకు ఏళ్లు ముప్పుతిప్పలు పెట్టే ప్రభుత్వం... ప్రభుత్వ ఆస్పత్రిని వాడుకుని ప్రైవేటు మెడికల్ కాలేజీ పెట్టుకోవడానికి అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి అనుమతి మంజూరు చేయబోతోంది.

ఈ మేరకు 300 పడకలు, రోజూ 600మంది ఔట్ పేషంట్లతో నిత్యం రద్దీగా ఉండే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని క్లినికల్ అటాచ్‌మెంట్ పేరుతో  వచ్చే ఏడాదినుంచి మూడేళ్లపాటు అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి లీజుకిచ్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికోసం ఐదుగురు సభ్యులతో కమిటీని వేయడమే కాకుండా, ఈనెల మూడో తేదీన (శుక్రవారం) కమిటీ చిత్తూరు జిల్లా ఆస్పత్రిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వైద్య కళాశాలను స్థాపించాలంటే ఓ ఆస్పత్రిలో కనీసం మూడేళ్ల నుంచి వైద్య సేవలు అందించాల్సి ఉన్న నిబంధనలు ఉంది. దీంతో తాము వైద్య కళాశాలను నెలకొల్పేందుకు క్లినికల్ అటాచ్‌మెంట్ పేరుతో చిత్తూరు జిల్లా ఆస్పత్రిని ఇవ్వాలని అపోలో ఆస్పత్రి యాజమాన్యం ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అడిగిందే ఆలస్యమన్నట్టు అందుకు ప్రభుత్వం అంగీకరించింది.

రాష్ట్రంలో ఓ ప్రైవేటు కళాశాల వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వాసుపత్రిని ప్రైవేటుకు అప్పజెప్పడం ఇదే తొలిసారి. ఈ ఆస్పత్రిని ఇవ్వడంవల్ల 150 ఎంబీబీఎస్ సీట్లతో వచ్చే ఏడాది (2016) నుంచి వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ క్లినికల్ అటాచ్‌మెంట్ పేరుతో మణిపాల్‌లో ప్రభుత్వాసుపత్రిని లీజుకు తీసుకున్న వైద్యకళాశాల 20 ఏళ్లయినా వదలకపోవడం గమనార్హం.

నాలెడ్జ్ హెల్త్ సిటీ పేరుతో ఎత్తుగడ
అపోలో హెల్త్ నాలెడ్జ్ సిటీ (ఏహెచ్‌కేసీ) పేరుతో సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు దరఖాస్తు చేసుకుంది. వైద్య సేవలు అందించేందుకు మూడేళ్లపాటు ప్రభుత్వాస్పత్రిని లీజుకు ఇమ్మని కోరింది. ఈ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నాం కాబట్టి.. వైద్య కళాశాల మంజూరు చేయమనీ కోరింది. కళాశాల మంజూరైతే తొలి ఏడాది 150 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇస్తుంది. ఆ తర్వాత 250 సీట్ల వరకూ వెళ్లే అవకాశం ఉంది. 150 ఎంబీబీఎస్ సీట్లు వస్తే అందులో కన్వీనర్ కోటా కింద 75 సీట్లు ప్రభుత్వానికి వస్తాయి. మిగతా 75 సీట్లను వివిధ కేటగిరీల కింద యాజమాన్యం భర్తీ చేసుకోవచ్చు.

ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఒక్కో ఎంబీబీఎస్ సీటు రూ.కోటి వరకూ పలుకుతోంది. ఈ లెక్కన తొలిఏడాదే రూ.75కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మూడో ఏడాది లీజు పూర్తి అయ్యే నాటికి 250 సీట్ల వరకు పెరుగుతాయనుకుంటే... అందులో కన్వీనర్ కోటా పోను 125 సీట్లు యాజమాన్యానికి దక్కుతాయి. అంటే.. మూడేళ్లలో తక్కువలో తక్కువగా రూ.250 కోట్లకు పైగా సంస్థకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదాయంతోనే రెండు ఆస్పత్రులు, కళాశాల భవనాలు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలోకు ఇవ్వడానికి ఇప్పటికే నిర్ణయించుకున్న ప్రభుత్వం ఆ పనిని పూర్తిచేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని వేసింది. ఇందులో ఎన్‌టీఆర్ హెల్త్ వర్శిటీ వైస్ చాన్స్‌లర్ అధ్యక్షులు గానూ, చిత్తూరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ మెంబర్ కన్వీనర్‌గానూ, వైద్యవిద్యా సంచాలకులు (డీఎంఈ), వైద్యవిధాన పరిషత్ కమిషనర్, అపోలో యాజమాన్యానికి చెందిన ప్రతినిధులు సభ్యులుగానూ ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement