ఉక్కిరిబిక్కిరి | Choked | Sakshi
Sakshi News home page

ఉక్కిరిబిక్కిరి

Published Sun, Mar 9 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

Choked

 ఉయ్యూరు, తిరువూరు, నందిగామ నగర పంచాయతీల్లో ఈసారి 218 మంది కౌన్సిలర్లు ఎన్నిక కానున్నారు. ఒక కార్పొరేషన్, ఎనిమిది మున్సిపాలిటీల్లో ఈసారి మొత్తం 10,41,306 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండున పూర్తవుతుంది.

అనంతరమే విజయవాడ నగర మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలకు, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే ఏడున ఎన్నికలు జరుగుతాయి. ఈసారి జిల్లాలోని 31,76,086 మంది ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో ఇటీవల చేరిన కొత్త ఓటర్లు 69 వేల మందికిపైగా ఉన్నారు. తాజాగా ఈ నెల తొమ్మిదో తేదీ ఆదివారం మరో అవకాశం ఇవ్వడంతో జిల్లాలో మరింతమంది కొత్త ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
 

రెండున్నరేళ్లకు మోక్షం...
 జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు రెండున్నరేళ్ల తర్వాత మోక్షం దక్కింది. జెడ్పీ చైర్మన్‌గా కుక్కల నాగేశ్వరరావు పాలకవర్గ పదవీకాలం 2011 జూలై 22తో ముగిసింది. అదే ఏడాది జూలై 21న మండల పరిషత్‌ల పదవీకాలం కూడా పూర్తయింది. అప్పటినుంచి పాలకవర్గాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీల రిజర్వేషన్‌లను ఖరారు చేసిన యంత్రాంగం శనివారం జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లు ప్రకటించింది. రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తికావడంతో ఏప్రిల్ 6న మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు.
 

 అధికారులకు కష్టకాలమే...
 వరుస ఎన్నికలు ఒకేసారి రావడంతో యంత్రాంగం సతమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్నికల విధులు నిర్వర్తించేవారికి ఇది నిజంగా కష్టకాలమే అని చెప్పక తప్పదు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు కొద్దిరోజులుగా వెన్నునొప్పితో బాధపడుతూనే ఎన్నికల ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు, వీడియో కాన్ఫరెన్స్‌లు, ఫోన్ ఆదేశాలను ఆయన చూసుకుంటూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు చకచకా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మున్సిపల్, సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఎస్పీ జె.ప్రభాకరరావు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఏడాదికాలంగా వరుస బందోబస్తులతో జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అవస్థలు పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల బందోబస్తు సైతం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న పోలీసులకు వరుస ఎన్నికలు ఊపిరి సలపనిచ్చేలా లేవు. మిగిలిన ఎన్నికల సిబ్బందికి సైతం వరుస ఎన్నికలను తలచుకుంటేనే గుండె జారిపోతోంది.
 

 అభ్యర్థులకు అగ్ని పరీక్షే...
 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా గెలుపొందాలని గంపెడాశలు పెట్టుకున్న ఆశావహులకు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే తమ గెలుపు అవకాశాలపై ప్రభావం ఉంటుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అనివార్యంగా మున్సిపాలిటీల్లోను, స్థానిక సంస్థల్లోను గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించేలా భరోసా ఇస్తున్నారు. మొత్తానికి ఆశావహులకు వరుస ఎన్నికలు అగ్నిపరీక్ష పెడుతున్నాయి.         
 

 అరుదైన రికార్డే...
 ఇటు మున్సి‘పోల్స్’ అటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున నడుమ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమైంది. స్థానిక సంస్థలకు కూడా ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సంకేతాలు ఇవ్వడంతో అరుదైన రికార్డే అవుతుంది. ఐదు ఎన్నికలను నిర్వహిస్తే పట్టణాల్లోని ఓటర్లు మూడు ఓట్లు, గ్రామీణ ఓటర్లు నాలుగు ఓట్లు వేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement