
భూమనకు మరోసారి సీఐడీ నోటీసులు
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. తుని ఘటనకు సంబంధించి ఆయనను ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. ఎల్లుండి గుంటూరు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఈ నెల 6,7 తేదీల్లో భూమనను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు విచారణ పేరుతో ఆయనను రెండు రోజుల పాటు దాదాపు 16గంటలకు పైగా విచారణ జరిపారు. కాగా ఈ ఏడాది జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.