సీఐఎఫ్ నిధుల స్వాహా ! | CIF funds mis used by leaders | Sakshi
Sakshi News home page

సీఐఎఫ్ నిధుల స్వాహా !

Published Wed, Sep 18 2013 2:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

CIF funds mis used by leaders


 నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్:  మహిళలను లక్షాధికారులు చేయాలనే  వైఎస్సార్ ఆశయానికి కొందరి ధనదాహం, నిర్లక్ష్యం తూట్లు పొడుస్తున్నాయి. లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన రుణాలను కొం దరు అవినీతిపరులు స్వాహా చేస్తుండటంతో లక్ష్యం పక్కదారి పడుతోంది. కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పడుతున్నాయి. నిరుపేద మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(సీఐఎఫ్)ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నిధులు జిల్లాలోని పలు మండలాల్లో స్వాహా అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కలువాయి మండలం పెన్నబద్దెవోలులో గతంలో సీఎఫ్(క్లస్టర్ ఫెసిలిటేటర్)గా పనిచేసిన వ్యక్తి రూ.70 వేలు స్వాహా చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రామసంఘం అధ్యక్షురాలితో కలిసి ఆయన స్వాహా పర్వానికి తెరదీసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లాలోని అనేక మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
 
  ఓ వైపు నిధులు స్వాహా అవుతున్నా, మరోవైపు రికవరీలు 90 శాతానికిపైగా ఉన్నాయని అధికారులు చెప్పడం గమనార్హం. మండల సమాఖ్యలను అభివృద్ధి చేసేందుకు 2004లో అప్పటి సీఎం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా సమాఖ్యకు రూ.40 కోట్లకు పైగా సీఐఎఫ్ నిధులను కేటాయించారు. మొదటి విడతగా రూ.30 కోట్లు, రెండో విడతగా రూ.10 కోట్లు నిధులు అప్పట్లో మంజూరయ్యాయి. వీటిలో నుంచి మండల సమాఖ్యలకు రూ. 80 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు కేటాయించారు. సీఐఎఫ్ నిధులు మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఏపీఎం ఆధ్వర్యంలో ఉంటాయి. స్వయం సహాయక సంఘాలకు మండల సమాఖ్య రుణాలు మంజూరు చేస్తుంది. రుణాలు అవసరమైన మహిళలు మొదట గ్రామసంఘంలో దరఖాస్తు చేసుకోవాలి. రుణం మంజూరైన తర్వాత వడ్డీని మండల సమాఖ్యకు చెల్లిస్తారు. ఈ క్రమంలోనే నిధులు స్వాహా అవుతున్నట్టు సమాచారం. గతంలో డ్వాక్రా ఈఓలుగా పనిచేసిన వారు సీఐఎఫ్ నిధులను స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
 
 గూడూరు ప్రాంతానికి చెందిన ఓ ఈఓ ఇప్పటి వరకు బ్యాంకుకు నగదు చెల్లించలేదు. రుణం తాలూకు మహిళలు చెల్లించిన నగదును బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం రుణాలకు సంబంధించి వసూలైన మొత్తాలను ఆఫీస్ బేరర్లు బ్యాంకులో జమ చేయాలి. ఇది ప్రహసనంగా మారింది. చిన్నగోపవరం, బ్రాహ్మణపల్లిలో సుమారు రూ.1.20 లక్షలు స్వాహా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుణాలు పొందిన అనేక మంది మహిళలు తాము చెల్లించినట్టే భావిస్తున్నారు. అవి బ్యాంకులో జమకాకపోతుండటంతో వారికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు మంజూరు కావడం లేదు. విషయం తెలియని మహిళలు రుణాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
 2004లో మంజూరైన సీఐఎఫ్ నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత వడ్డీ వచ్చిందో తదితర వివరాలు అధికారుల వద్ద లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 పైసలు చొప్పున వడ్డీ లెక్కగట్టినా నెలకు రూ.20 లక్షలు రావాలి. ఈ క్రమంలో ఏడాదికి రూ.2 కోట్లు జిల్లా, మండల సమాఖ్య ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పరిశీలిస్తే ఇప్పటి వరకు రూ.16 కోట్లకు పైగా ఆదాయం ఎంఎస్‌లకు లభించి ఉండాలి. వడ్డీ వసూలు, ఖర్చు తదితర వివరాలు అధికారుల వద్ద అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
 
 ప్రత్యేక చర్యలు తీసుకుంటాం
 సీఐఎఫ్ రికవరీలను వంద శాతం సాధించేలా చర్యలు తీసుకుంటాం. నిధులు స్వాహా పర్వంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ చేస్తాం. మహిళలకు సీఐఎఫ్ రుణాలు మంజూరయ్యేందుకు చర్యలు చేపడుతాం.
 వి.వెంకటసుబ్బయ్య, పీడీ, డీఆర్‌డీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement