తాడేపల్లిగూడెంలోని ఓ సిగరెట్ల వ్యాపారి గోడౌన్ అది. అందులోకి ఓ చిల్లర దొంగ చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.3 వేలను దొంగిలించాడు. ఇదే అదునుగా సదరు వ్యాపారి భారీ మోసానికి తెగబడ్డాడు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అక్షరాల రూ.45 లక్షల్ని పరిహారంగా పట్టేశాడు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, పోలీసుల చేతులు తడిపాడు. కొన్ని నెలల తరువాత ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అసలు కథ బయటకు పొక్కింది. అవాక్కైన సదరు వ్యాపారి, పోలీసులు కలసి వాస్తవాలను బయటపెట్టిన ఇద్దరు కార్మికులపై కేసు పెట్టారు. అసలు కేసును తిరగదోడాలని అధికారి ఆదేశించినా.. పోలీసులు మాత్రం ఆ కేసును మరుగున పడేశారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కేవలం రూ.మూడు వేలు చోరీ కాగా.. ఓ సిగరెట్ల గోడౌన్ యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు, పోలీసులు కుమ్మక్కై రూ.45 లక్షలను అడ్డంగా నొక్కేసిన వైనం తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం పూర్వాపరాలిలా ఉన్నాయి. గత ఏడాది మే నెలలో తాడేపల్లిగూడెంలోని ఓ ప్రముఖ సిగరెట్ కంపెనీ డీలర్‌కు చెందిన గోడౌన్‌లో సుమారు రూ.50 లక్షల విలువైన సిగరెట్లు చోరీ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన ఓ దొంగ ఈ చోరీకి పాల్పడ్డాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. కానీ.. రికవరీ చూపించలేదు. చోరీ జరిగిందని కేసు నమోదైంది. దొంగ కూడా దొరికాడు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ పంపించారు. దీంతో సదరు కంపెనీ ప్రతినిధులు విచారణకు వచ్చారు. ఆనక అక్షరాలా రూ.45 లక్షల పరిహారం విడుదల చేశారు. ఇక్కడివరకు అంతాసాఫీగానే సాగింది. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది.
ఒక్క ప్యాకెట్ కూడా పోలేదట
ఆ తర్వాత కొద్దినెలలకు అదే సిగరెట్ కంపెనీ గోడౌన్ యజమానికి, అందులో పనిచేసే ఇద్దరు కార్మికులకు మధ్య వివాదం చెలరేగింది. యువకులైన ఆ ఇద్దరు కార్మికులు పోలీసులను ఆశ్రయించారు. తమ యజమానికి చెందిన గోడౌన్‌లో సిగరెట్ బండిళ్ల దొంగతనమే జరగలేదని, అందరూ కుమ్మక్కై రూ.45 లక్షలు దోచేశారని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.3 వేలు మాత్రమే చోరీ అయ్యాయని స్పష్టం చేశారు.
కానీ.. తమ యజమాని అదే అదనుగా అప్పటికే గోడౌన్‌లో ఉన్న సిగరెట్ బండిళ్లను వేరే చోటకు ఆటోల్లో తరలించి భారీ చోరీ జరిగిందంటూ తప్పుడు ఫిర్యాదు చేశారని వివరించారు. రూ.3 వేల నగదు తప్ప ఒక్స సిగరెట్ ప్యాకెట్ కూడా పోలేదని చెప్పుకొచ్చారు. తమ యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, పోలీసులు కుమ్మక్కై తప్పుడు కేసు కట్టి రూ.లక్షలు పంచుకున్నారని ఆరోపించారు. రూ.45లక్షల్లో రూ.35 లక్షలను గోడౌన్ యజమాని తీసుకోగా, మిగిలిన రూ.10 లక్షలను ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు, కొంతమంది పోలీసులు నొక్కేశారని చెప్పుకొచ్చారు.
బండారం బయటపెట్టిన వారిపైనే కేసులు
గోడౌన్ యజమాని ఒత్తిళ్ల మేరకు పోలీసులు సదరు యువకుల ఫిర్యాదును పట్టించుకోకుండా తిరిగి వారిద్దరిపైనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో ఆ ఇద్దరూ ఓ పోలీసు అధికారిని కలిసి మొత్తం కుంభకోణాన్ని వివరించి ఫిర్యాదు చేశారు. స్పందించిన సదరు అధికారి విచారణ చేపట్టగా అందరూ కుమ్మక్కై తప్పుడు కేసు కట్టి రూ.లక్షలు కొట్టేశారని ప్రాథమికంగా రుజువైంది. పక్కా ఆధారాలతో కేసును తిరగదోడాలని ఆయన కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. ఆ కేసును పక్కనపడేశారు. సామాజికవర్గ కోణంలో ఆ కుంభకోణానికి సహకరించిన పోలీసులను కాపాడాలనే యత్నంలో భాగంగానే కేసును నిర్వీర్యం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పోయింది గోరంత.. బొక్కింది కొండంత
Published Fri, Apr 8 2016 1:02 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement