
జోరుగా ‘బ్లాక్’ వ్యాపారం
కొత్త సినిమా వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య బ్లాక్‌లో టికెట్లు. సినిమా అంటేనే బ్లాక్ అనే ముద్ర బలంగా ప్రేక్షకుల్లో చొచ్చుకుపోయింది.
► థియేటర్లలో టిక్కెట్టుపై అదనపు వసూళ్లు
► చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం
తణుకు: కొత్త సినిమా వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య బ్లాక్‌లో టికెట్లు. సినిమా అంటేనే బ్లాక్ అనే ముద్ర బలంగా ప్రేక్షకుల్లో చొచ్చుకుపోయింది. అందులో మొదటివారం రోజులు నాలుగు షోలు బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. సగటు ప్రేక్షకుడికి థియేటర్ యాజమాన్యం కనీసం గౌరవం కూడా ఇవ్వకపోగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వారికి సంబంధించిన వ్యక్తులతోనే బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. మరోవైపు టిక్కెట్టుపై ఉన్న ధరకు అదనంగా వసూలు చేయడం ఇటీవలి కాలంలో షరామామూలైపోయింది.
తమకు అనుమతులు ఉన్నాయంటూ బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారు. పట్టుమని రెండు నిమిషాలు కూడా బుకింగ్ కౌంటర్‌లో టిక్కెట్లు ఇవ్వడంలేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని సైతం బెదిరిస్తున్నారు. బ్లాక్‌లో ఉన్నాయి.. కావాలంటే తీసుకోండి.. లేదంటే ఇంటికి వెళ్లండని దబాయిస్తున్నారని పలువురు వాపోతున్నారు. థియేటర్‌కు వచ్చిన వారు కచ్చితంగా సినిమా చూస్తారని తెలుసు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా అని ఫ్యాన్స్ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి బాణసంచా కాలుస్తారు. వీరికి కూడా మొదటిరోజు ఒకషో మాత్రమే 10 నుంచి 15 టిక్కెట్లు అభిమానులకు ఇస్తారు. అభిమాన హీరో సినిమా చూడాలన్న ఆశతో బ్లాక్‌లో టిక్కెట్లు కొనుక్కుని సినిమా చూస్తున్నామని పలువురు వాపోతున్నారు.
బ్లాక్‌లో ఇంటిదొంగలే
జిల్లాలో 95 సినిమా థియేటర్లు ఉన్నాయి. సినిమా థియేటర్‌లో ప్రతి ఆటకు బుకింగ్ కౌంటర్‌లో కేవలం 30 శాతం మాత్రమే టిక్కెట్లు ఇస్తున్నారు. 70 శాతం టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు. ప్రేక్షకుడు వినోదం కోసం హాయిగా రెండు గంటల పాటు ఎంజాయ్ చేద్దామంటే జేబులో ఉన్న రూ.500 ఖాళీ కావాల్సిందే. కొందరు థియేటర్ యాజమాన్యాలు సిబ్బంది తమ మనుషులచే టిక్కెట్లు విక్రయించేలా ప్రోత్సహిస్తున్నారు. మరికొంతమంది బయట వారు ముందుగా టిక్కెట్లు బుక్కింగ్ చేసుకుని షో సమయానికి రెండు గంటల ముందే థియేటర్ సమీపంలో బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఇద్దరు అగ్రహీరోల సినిమాల కోసం బ్లాక్‌లో టిక్కెట్లను సుమారు రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగినట్టు సమాచారం. ఇది నమ్మడానికి చేదుగా ఉన్నా నిప్పులాంటి నిజం. ఇంతగా సొమ్ములు చేసుకుంటున్నా ఏ ఒక్క అధికారి కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఆన్‌లైన్‌లో రూ.100 పెట్టి కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి సైతం సినిమా చూస్తుండగా వచ్చి అదనంగా రూ.50 వసూలు చేస్తున్న ఘటనలు సైతం ఉన్నాయి. థియేటర్‌లలో ఇంత జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించి, టిక్కెట్లపై అదనపు వసూళ్లు ఆపాలని ప్రతి ప్రేక్షకులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
సినిమా టిక్కెట్టుపై అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవలి కాలంలో టిక్కెట్టుపై అదనంగా వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో ఆయా సినిమా హాళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి హెచ్చరికలు జారీ చేశాం. ఇకపై కూడా అలా జరిగితే సీజ్ చేయడానికి కూడా వెనుకాడం. - బి.శ్రీనివాసరావు, ఆర్డీవో, కొవ్వూరు