చింతమనేనిని పదవి నుంచి తొలగించాలి
- గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలి
- రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్
- రాస్తారోకోలు, ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహసిల్దార్ పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటనకు వ్యతిరేకంగా వివిధ వర్గాలు ఆందోళన బాటపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. వివిధ మండలాల్లో తహసిల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. నగరంలోని రామచంద్రరావుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, చింతమనేనిపై గుండా యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కొవ్వూరులో వివిధ జిల్లాల నుంచి పుష్కర విధుల కోసం హాజరైన పలు శాఖల ఉద్యోగులు విధులను బహిష్కరించి, రాష్ట్ర రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలో రాస్తారోకో నిర్వహించి చింతమనేనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నరసాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. చింతమనేనిని వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి చింతమనేని పాల్పడిన అనైతిక చర్యను తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సీపీఎం భీమవరం నాయకులు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.
తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షుడు ఎన్‌వీ సత్యనారాయణ చింతమనేనిని అరెస్టు చేయాలని ఆ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు ఉంగుటూరు, పోలవరం, దెందులూరు తదితర నియోజకవర్గాల్లో సైతం రెవెన్యూ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళనలు, నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
మహిళా ఉద్యోగిపై దాడి సిగ్గుచేటు
ప్రభుత్వ పథకాలను, విధానాలను అమలు చేసే ఉద్యోగులపై ప్రజాప్రతినిధులే దాడులు చేయడం గర్హనీయం. మహిళ అని కూడా చూడకుండా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఉద్యోగిపై దాడి చింతమనేనికి ఉన్న పొగరును సూచిస్తోంది. ఆయనను విప్ పదవి నుంచి వెంటనే తొలగించాలి. తహసిల్దార్ వనజాక్షి, రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. లేనిపక్షంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది.
- కె.రమేష్‌కుమార్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ
దాడి అమానుషం
తహసిల్దార్‌పై చింతమనేని చేసిన దాడి అమానుషం. మనసు ఉన్న ప్రతి మనిషి తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది. ఇటువంటి చర్యలు ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఉద్యోగులందరూ ఏకమైతే ప్రభుత్వాలు సైతం చేష్టలుడిగి నిల్చోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పాలకులు గ్రహించాలి. చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఘటనా స్థలంలో చోద్యం చూసిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలి. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు మా పూర్తి మద్దతు ఉంటుంది.
- చోడగిరి శ్రీనివాస్, ఎన్‌జీవో అసోసియేషన్, ఏలూరు తాలూకా అధ్యక్షుడు