CHINTAMANENI MLA Prabhakar
-
చింతమనేనిని పదవి నుంచి తొలగించాలి
- గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలి - రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ - రాస్తారోకోలు, ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహసిల్దార్ పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటనకు వ్యతిరేకంగా వివిధ వర్గాలు ఆందోళన బాటపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. వివిధ మండలాల్లో తహసిల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. నగరంలోని రామచంద్రరావుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, చింతమనేనిపై గుండా యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కొవ్వూరులో వివిధ జిల్లాల నుంచి పుష్కర విధుల కోసం హాజరైన పలు శాఖల ఉద్యోగులు విధులను బహిష్కరించి, రాష్ట్ర రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలో రాస్తారోకో నిర్వహించి చింతమనేనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరసాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. చింతమనేనిని వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి చింతమనేని పాల్పడిన అనైతిక చర్యను తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సీపీఎం భీమవరం నాయకులు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షుడు ఎన్వీ సత్యనారాయణ చింతమనేనిని అరెస్టు చేయాలని ఆ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు ఉంగుటూరు, పోలవరం, దెందులూరు తదితర నియోజకవర్గాల్లో సైతం రెవెన్యూ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళనలు, నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహిళా ఉద్యోగిపై దాడి సిగ్గుచేటు ప్రభుత్వ పథకాలను, విధానాలను అమలు చేసే ఉద్యోగులపై ప్రజాప్రతినిధులే దాడులు చేయడం గర్హనీయం. మహిళ అని కూడా చూడకుండా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఉద్యోగిపై దాడి చింతమనేనికి ఉన్న పొగరును సూచిస్తోంది. ఆయనను విప్ పదవి నుంచి వెంటనే తొలగించాలి. తహసిల్దార్ వనజాక్షి, రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. లేనిపక్షంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. - కె.రమేష్‌కుమార్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ దాడి అమానుషం తహసిల్దార్‌పై చింతమనేని చేసిన దాడి అమానుషం. మనసు ఉన్న ప్రతి మనిషి తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది. ఇటువంటి చర్యలు ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. ఉద్యోగులందరూ ఏకమైతే ప్రభుత్వాలు సైతం చేష్టలుడిగి నిల్చోవల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పాలకులు గ్రహించాలి. చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఘటనా స్థలంలో చోద్యం చూసిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలి. రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు మా పూర్తి మద్దతు ఉంటుంది. - చోడగిరి శ్రీనివాస్, ఎన్జీవో అసోసియేషన్, ఏలూరు తాలూకా అధ్యక్షుడు -
పెరవేగిలో కేసు ఎలా!
- పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ - చింతమనేనికి వత్తాసుపై సీరియస్ - కౌంటర్ కేసు కృష్ణాజిల్లాకు బదిలీ? సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజా వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి పోలీసులకు చుట్టుకుంటోంది. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేటలో ఇసుకర్యాంపు వద్ద తహసిల్దార్ వనజాక్షిపై చింతమనేని సమక్షంలోనే దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తహసిల్దార్ కృష్ణాజిల్లా ముసునూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యే సూచన మేరకు ఇద్దరు డ్వాక్రా మహిళలు పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో తహసిల్దార్పైనే కౌంటర్ కేసు పెట్టారు. విజయరాయి ఇసుక సొసైటీ సభ్యులైన మీసాలకుమారి, సేసం నాగలక్ష్మి తహసిల్దార్ తమపై దాడి చేశారని, కులం పేరుతో దుర్భాషలాడారని ఫిర్యాదు చేయడంతో పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 354, 324, 323 సెక్షన్ల కింద మెడికో లీగల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే కేసు పెదవేగి పోలీసులను ఇరకాటంలోకి నెట్టింది. ఎక్కడ ఘర్షణ జరిగిందో ఆ ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా ఎంచుకున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఎలా చేస్తారని, ఒకవేళ వారు చేసినా పోలీసులు కేసు ఎలా నమోదు చేశారని ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కనీస పరిజ్ఞానం లేకుండా చింతమనేని ఒత్తిడి చేయగానే కేసు ఎలా నమోదు చేస్తారంటూ పెదవేగి పోలీసులను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సెట్ కాన్ఫరెన్స్‌లో తీవ్రస్థాయిలో మందలించినట్టు తెలిసింది. శుక్రవారం ఆ కౌంటర్ కేసును కృష్ణాజిల్లా పోలీసులకు బదిలీ చేసినట్టు సమాచారం. అంత జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నట్టు? ఇక, వివాదం జరిగిన రోజు పోలీసుల యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 50 మంది ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారని వనజాక్షి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో రెండు జిల్లాల పోలీసులు ఏ మేరకు స్పందించారు.. పోలీసులొస్తే ఏమవుతుందోనన్న భయం కూడా లేకుండా దుండగులు రెచ్చిపోయారంటే ఖాకీల పనితీరు ఏ రీతిన ఉందన్న అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. మండల మెజిస్ట్రేట్ హోదా కలిగిన తహసిల్దార్‌పై దుండగులు దౌర్జన్యం చేస్తుంటే ఎమ్మెల్యే గన్‌మెన్ ఏం చేశారు.. బాధ్యత కలిగిన అతను వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఎందుకివ్వలేదు.. ఇవన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇక చింతమనేని ప్రభాకర్ గురువారం అనుచరులతో ఏలూరులో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి పోలీసు అధికారులను కలవడం కూడా వివాదాస్పదమవుతోంది. ఇదే విషయాన్ని ఎన్జీవో సంఘాల నేతలు ఎత్తిచూపి పోలీసు అధికారులపై విమర్శలు సంధిస్తున్నారు. ప్రభాకర్ తాజా వివాదం నేపథ్యంలో ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేసిన పోలీసులు ఇప్పుడు ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సిందే. కేసు విచారణలో ఎవరి ఒత్తిళ్లూ లేవు తప్పుడు కేసని తేలితే క్లోజ్ చేస్తాం : ఎస్పీ పెదవేగిలో నమోదైన కౌంటర్ కేసు విచారణలో ఎవరి ఒత్తిళ్లు లేవని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. కృష్ణాజిల్లా పోలీసులతో పాటు పెదవేగి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. తప్పుడు కేసని తేలితే వెంటనే క్లోజ్ చేస్తామన్నారు. -
తహశీల్దార్‌పై దాడిని ఎవరూ సమర్థించరు
నన్నపనేని రాజకుమారి తిరుమల: కృష్ణా జిల్లాలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఎవరూ సమర్థించరని శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ దాడి చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ విచారం వ్యక్తం చేశారు. గతంలో తనపై కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు వస్తుంటాయన్నారు. ఈ ఘటనపై తాను కూడా వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి త్వరగా పూర్తి కావాలని కోరుకున్నానన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా టీటీడీ తనవంతుగా సంపూర్ణం సహకారం అందిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండేలా చూడాలని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు. -
చింతమనేనిని అరెస్ట్ చేయాలి
- రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ - విధులను బహిష్కరిస్తామని హెచ్చరిక ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : కృష్ణాజిల్లా ముసునూరు తహసిల్దార్‌పై దాడి చేయించిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని రెవెన్యూ అసోషియేషన్ రాష్ర్ట కార్యదర్శి ఎల్వీ సాగర్ డిమాండ్ చేశారు. చింతమనేనిని అరెస్ట్ చేయాలంటూ రెవెన్యూ ఉద్యోగులు గురువారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ నేర చరిత్ర ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ విప్‌గా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రభాకర్‌ను అరెస్టు చేయించిన విషయం మరిచారా అని చంద్రబాబును ప్రశ్నించారు. అనేక కేసులలో ముద్దాయిగా ఉన్న విప్ ప్రస్తుతం తనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే డీఐజీని దర్జాగా కలిసి వెళ్లడం చూస్తే ఆయన అధికార దర్పం అర్థమవుతుందని విమర్శించారు. పాలకులే దగ్గరుండి దాడులు చేయిస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగులకు కేంద్ర బలగాలతో రక్షణ ఇవ్వాలని గవర్నర్‌ను ఇటీవలే కోరామన్నారు. రాష్ట్రంలో మాత్రం పాలకులే దాడులకు పాల్పడుతున్నారన్నారు. చింతమనేనిని శుక్రవారం 10 గంటలలోగా అరెస్ట్ చేయకపోతే రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన చేపడతామన్నారు. మిగిలిన శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరవుతారని, వర్క్‌టు రూల్ పాటిస్తామని సాగర్ స్పష్టం చేశారు. దర్నాకు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్‌కుమార్, కలెక్టరేట్ విభాగ అధ్యక్షుడు ఎన్వీ నాంచారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి డీవీఎన్ సత్యనారాయణ నాయకత్వం వహించారు. కలెక్టరేట్లోని రెవిన్యూ విభాగ ఉద్యోగులు పాల్గొన్నారు. -
చింతమనేని చిందులు
మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న ఎస్సైపై ఆగ్రహం హేలాపురిలో ప్రభుత్వ విప్ హైడ్రామా ఏలూరు :‘ఏంటయ్యా నువ్వు చేసింది. మా వాళ్ల ట్రాక్టర్లే తీసుకొస్తావా. ఓవరాక్షన్ చేస్తున్నావా. నేను పొలిటికల్ యాక్షన్ చూపించాల్సి ఉంటుంది’ అంటూ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులపై నోరు పారేసుకున్నారు. వట్లూరు పెద్దచెరువు నుంచి మట్టి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు త్రీటౌన్ ఎస్సై డి.ప్రసాద్‌కుమార్ శుక్రవారం రాత్రి సిబ్బందితో అక్కడికి వెళ్లి ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇంతలో పదుల సంఖ్యలో అనుచరులతో స్టేషన్‌కు చేరుకున్న చింతమనేని ఎస్సైపై చిందులు తొక్కారు. ‘కేసులు ఎలా రాస్తావయ్యా. ట్రాక్టర్లు నువ్వు ఏ విధంగా తీసుకువచ్చావ్. నీకేంటి సంబంధం. నేను మైనింగ్ వాళ్లను అడిగాను. వాళ్లేమీ తెలియదంటారు. మాదాకా రాలేదంటారు. ఇది పండుగల సీజన్. ఏవో నాలుగురాళ్ల కోసం మట్టి తోలుకుంటే కేసులు ఎలా రాస్తావయ్యా’ అని ఎస్సైపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఫోన్ వచ్చింది సార్. అందుకే వెళా’్లనని ఎస్సై ప్రసాద్ చెప్పగా.. ‘ఏంటోయ్ నువ్వు వెళ్లేది. నేను కూడా వంద ఫోన్లు చేస్తా. చెప్పిందల్లా చేస్తావా. పేనుకు పెత్తనమిచ్చినట్టు చేస్తావా’ అని చింతమనేని విసురుగా మాట్లాడారు. ఇంతలో చింతమనేని వెంట వచ్చిన వారు ఎస్సైని ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడుతుండగా, వారిపై ఎస్సై అసహనం వ్యక్తం చేశారు. దీంతో చింతమనేని ‘ఏయ్.. నా ముందే మావాళ్ల మీద దౌర్జన్యం చేస్తావా. ఆరేళ్ల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నా. నేనేంటో తెలుసుకో. ఏలూరులో ఈ మధ్యనే 36 చోరీలు జరిగాయి. వాటిమీద యాక్షన్ తీసుకోండి. నిన్ననే కదా సీఎం చెప్పారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని. మీరు ఓవర్ చేస్తే మేం పొలిటికల్ యాక్షన్ చూపించాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాక్టర్లు వదలాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి ఎస్సై ‘మైనింగ్ వాళ్లకు సమాచారం ఇచ్చాం సార్’ అని చెప్పడంతో ‘సరే.. నేను వాళ్లతోనే తేల్చుకుంటాను’ అని బయటకు వచ్చారు. బయటకు వచ్చీ రావడంతోనే అక్కడున్న కార్యకర్తలతో ‘మీరేం చేస్తున్నార్రా. బళ్లు తీసుకువెళ్తుంటే ఆపొద్దా’ అని మందలించారు.