చింతమనేని చిందులు
మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న ఎస్సైపై ఆగ్రహం
హేలాపురిలో ప్రభుత్వ విప్ హైడ్రామా
ఏలూరు :‘ఏంటయ్యా నువ్వు చేసింది. మా వాళ్ల ట్రాక్టర్లే తీసుకొస్తావా. ఓవరాక్షన్ చేస్తున్నావా. నేను పొలిటికల్ యాక్షన్ చూపించాల్సి ఉంటుంది’ అంటూ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులపై నోరు పారేసుకున్నారు. వట్లూరు పెద్దచెరువు నుంచి మట్టి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు త్రీటౌన్ ఎస్సై డి.ప్రసాద్‌కుమార్ శుక్రవారం రాత్రి సిబ్బందితో అక్కడికి వెళ్లి ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇంతలో పదుల సంఖ్యలో అనుచరులతో స్టేషన్‌కు చేరుకున్న చింతమనేని ఎస్సైపై చిందులు తొక్కారు. ‘కేసులు ఎలా రాస్తావయ్యా. ట్రాక్టర్లు నువ్వు ఏ విధంగా తీసుకువచ్చావ్. నీకేంటి సంబంధం. నేను మైనింగ్ వాళ్లను అడిగాను. వాళ్లేమీ తెలియదంటారు. మాదాకా రాలేదంటారు. ఇది పండుగల సీజన్. ఏవో నాలుగురాళ్ల కోసం మట్టి తోలుకుంటే కేసులు ఎలా రాస్తావయ్యా’ అని ఎస్సైపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఫోన్ వచ్చింది సార్. అందుకే వెళా’్లనని ఎస్సై ప్రసాద్ చెప్పగా.. ‘ఏంటోయ్ నువ్వు వెళ్లేది. నేను కూడా వంద ఫోన్లు చేస్తా. చెప్పిందల్లా చేస్తావా. పేనుకు పెత్తనమిచ్చినట్టు చేస్తావా’ అని చింతమనేని విసురుగా మాట్లాడారు.
ఇంతలో చింతమనేని వెంట వచ్చిన వారు ఎస్సైని ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడుతుండగా, వారిపై ఎస్సై అసహనం వ్యక్తం చేశారు. దీంతో చింతమనేని ‘ఏయ్.. నా ముందే మావాళ్ల మీద దౌర్జన్యం చేస్తావా. ఆరేళ్ల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నా. నేనేంటో తెలుసుకో. ఏలూరులో ఈ మధ్యనే 36 చోరీలు జరిగాయి. వాటిమీద యాక్షన్ తీసుకోండి. నిన్ననే కదా సీఎం చెప్పారు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని. మీరు ఓవర్ చేస్తే మేం పొలిటికల్ యాక్షన్ చూపించాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాక్టర్లు వదలాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి ఎస్సై ‘మైనింగ్ వాళ్లకు సమాచారం ఇచ్చాం సార్’ అని చెప్పడంతో ‘సరే.. నేను వాళ్లతోనే తేల్చుకుంటాను’ అని బయటకు వచ్చారు. బయటకు వచ్చీ రావడంతోనే అక్కడున్న కార్యకర్తలతో ‘మీరేం చేస్తున్నార్రా. బళ్లు తీసుకువెళ్తుంటే ఆపొద్దా’ అని మందలించారు.