‘రాజకీయ’ చిచ్చు! | 'Political' end of | Sakshi
Sakshi News home page

‘రాజకీయ’ చిచ్చు!

Published Sat, Jun 21 2014 12:55 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

'Political' end of

  •     స్వార్థంతో ఆజ్యం పోసిన అధికార పార్టీ నాయకులు
  •      యాభై కుటుంబాల్లో ఆందోళన
  •      అచ్చెర్ల గ్రామంలో విషాదం
  • కశింకోట: క్షణికావేశంలో రెండు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. పరస్పరం కులదూషణ కేసులు పెట్టుకున్నారు. కాస్త ఆవేశం చల్లారాక ఇరువర్గాలు రాజీపడ్డారు. దీంతో వివాదం సమసిపోయిందని అంతా అనుకున్నారు. ఇక్కడే వివాదం కొత్త మలుపు తిరిగింది. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత పసుపుచొక్కా తొడుక్కున్న కొందరు నేతల రంగప్రవేశంతో పరిస్థితి ఉల్టా అయింది.

    అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీకి చెందిన యాభై మంది నాయకులను అరెస్టు చేయడం సంచలనమే అయింది. ఈ కేసులో తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నప్పటికీ వారిని అరెస్టు చేయకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు చూపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లవల్లే పోలీసులు అరెస్టు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

    వివరాల్లోకి వెళితే...గత ఏడాది అక్టోబర్ 19న అచ్చెర్ల గ్రామంలోని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గం తరపున సర్పంచ్ పొన్నాడ రాజు, మరోవర్గం తరపున గుడాల సత్యవతి తమ మద్దతుదారులను కొట్టి కులదూషణకు పాల్పడ్డారంటూ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అప్పట్లో పోలీసులు ఇరువర్గాలకు చెందిన 53 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును అనకాపల్లి డీఎస్పీ వి.ఎస్.ఆర్.మూర్తి దర్యాప్తు చేపట్టారు.

    ఈలోగా ఇరువర్గాలు రాజీకి వచ్చాయి. కేసు సమసిపోతుందనుకుంటుండగా గురువారం కేసు ఫైల్ దులిపిన పోలీసులు చర్చలకని పిలిచి హడా వుడిగా 50 మందిని అరెస్టు చేయడం సంచలనమే అయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిమ్మదల సన్యాసినాయుడు, అతని తమ్ముళ్లు బుల్లిబాబు, రమేష్‌లతోపాటు మద్దతుదారులను, మరో వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దొడ్డి నాగేశ్వరరావుతోపాటు అతని మద్దతుదారులను (ఎక్కువ మంది ఎస్సీలు) అరెస్టు చేశారు.

    ఈ కేసులో  అధికార పార్టీకి చెందిన మండల టీడీపీ అధ్యక్షుడు నిమ్మదల త్రినాథరావు, మరో ఇద్దరు ఉన్నప్పటికీ పోలీసులు వారిని అరెస్టు చేయకుండా పరారీలో ఉన్నట్లు చూపుతున్నారు. వాస్తవానికి ఈ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని, ఆ తర్వాత పరారీ అయ్యారని చెబుతున్నారని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే ఇలా జరిగిందని కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

    తమ్ముళ్ల ఒత్తిడికి లొంగే రాజీపడిన కేసులో అరెస్టు చేశారని, ఉద్యోగులు, విద్యావంతుల, మహిళలని కూడా చూడకుండా అరెస్టులకు పాల్పడ్డారని బాధితులు విమర్శిస్తున్నారు. చిన్న వివాదాన్ని పెద్దదిచేసి పలువురి భవిష్యత్తును పోలీసులు నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులదూషణ కేసులో ఎక్కువ మంది ఎస్సీలనే అరెస్టు చేయడం ఇక్కడి పోలీసులకే చెల్లిందని విమర్శించారు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు.
     
    ఇదీ చరిత్ర

    1983 నుంచి గ్రామంలో రెండు వర్గాలున్నాయి. టీడీపీకి నిమ్మదల త్రినాథరావు, కాంగ్రెస్‌కు నిమ్మదల సత్యనారాయణ నాయకత్వం వహించే వారు. ఇక్కడ బంధుత్వాలు, సామాజిక వర్గం కంటే పార్టీలకే కట్టుబడి ఉండేవారు. ఒక పార్టీవారి ఇళ్లలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు కూడా మరొక పార్టీవారు హాజరయ్యే వారు కాదు. చివరికి రిక్షా ఎక్కాలన్నా తమ పార్టీ మద్దతుదారుడి రిక్షాలో మాత్రమే ప్రయాణించే వారు. ఆ స్థాయిలో పట్టుదలలు కొనసాగేవి. 2004 నాటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పార్టీలతో పనిలేకుండా అంతా కలిసి పండగలు, ఉత్సవాలు జరుపుకొనే వారు. ఒకరి కార్యక్రమాలకు ఒకరు హాజరయ్యే వారు. ఈ పరిస్థితుల్లో నెలకొన్న చిన్న వివాదానికి ‘రాజకీయ’ రంగుపూసి తెలుగు తమ్ముళ్లు వినోదం చూడడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబ సభ్యులు అధికార పార్టీ నేతల తీరుకు శాపనార్థాలు పెడుతున్నారు.
     
     ఇది చాలా అన్యాయం
     కుల దూషణ కేసు పెట్టి ఒకేసారి 50 మందిని అరెస్టు చేయడం ఎప్పుడూ చూడలేదు. ఇది ఎన్ని కుటుంబాలను ఇబ్బంది పాల్జేస్తుందో ఆలోచించకుంటే ఎలా. దీనివల్ల గ్రామంలో విషాదం అలముకుంది.
     -బొడ్డేడ సత్యారావు, అచ్చెర్ల
     
     నలుగురిని ఇరికించారు
     మా ఇంట్లో నలుగురిని కేసులో ఇరికించారు. తోడికోడలు, మరిది, ఇద్దరు కొడుకులపై రాజకీయ దురుద్దేశంతో కేసుపెట్టి అరెస్టు చేశారు. మా పిల్లల భవిష్యత్తు ఏమిటి. ఇది చాలాభాధాకరం.
     -గుడాల గంగ, అచ్చెర్ల ఎస్సీ కాలనీ
     
     రాజకీయం తగదు
     రాజకీయ వివాదాన్ని పేదలపై రుద్దడం అన్యాయం. రాజీ పడినప్పటికీ కేసులుపెట్టి అరెస్టు చేయడం ఘోరం. కుల దూషణ కేసులో ఎస్సీలను కూడా అరెస్టు చేయడం ఎక్కడా చూడలేదు.
     - పొన్నపు నల్లమారి, అచ్చెర్ల ఎస్సీ కాలనీ
     
     రాజీపడినా...
     వివాదం జరిగాక రాజీపడినా యాభై మందిని అరెస్టు చేయడం సమంజసం కాదు. రాజకీయ ఒత్తిడివల్లే ఈ చర్యకు పాల్పడ్డారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదు.
     - పొన్నాడ రాము, అచ్చెర్ల
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement