పెరవేగిలో కేసు ఎలా!
- పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
- చింతమనేనికి వత్తాసుపై సీరియస్
- కౌంటర్ కేసు కృష్ణాజిల్లాకు బదిలీ?
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజా వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి పోలీసులకు చుట్టుకుంటోంది. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేటలో ఇసుకర్యాంపు వద్ద తహసిల్దార్ వనజాక్షిపై చింతమనేని సమక్షంలోనే దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తహసిల్దార్ కృష్ణాజిల్లా ముసునూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యే సూచన మేరకు ఇద్దరు డ్వాక్రా మహిళలు పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో తహసిల్దార్‌పైనే కౌంటర్ కేసు పెట్టారు.
విజయరాయి ఇసుక సొసైటీ సభ్యులైన మీసాలకుమారి, సేసం నాగలక్ష్మి తహసిల్దార్ తమపై దాడి చేశారని, కులం పేరుతో దుర్భాషలాడారని ఫిర్యాదు చేయడంతో పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 354, 324, 323 సెక్షన్ల కింద మెడికో లీగల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే కేసు పెదవేగి పోలీసులను ఇరకాటంలోకి నెట్టింది. ఎక్కడ ఘర్షణ జరిగిందో ఆ ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా ఎంచుకున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఎలా చేస్తారని, ఒకవేళ వారు చేసినా పోలీసులు కేసు ఎలా నమోదు చేశారని ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కనీస పరిజ్ఞానం లేకుండా చింతమనేని ఒత్తిడి చేయగానే కేసు ఎలా నమోదు చేస్తారంటూ పెదవేగి పోలీసులను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సెట్ కాన్ఫరెన్స్‌లో తీవ్రస్థాయిలో మందలించినట్టు తెలిసింది. శుక్రవారం ఆ కౌంటర్ కేసును కృష్ణాజిల్లా పోలీసులకు బదిలీ చేసినట్టు సమాచారం.
అంత జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నట్టు?
ఇక, వివాదం జరిగిన రోజు పోలీసుల యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 50 మంది ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారని వనజాక్షి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో రెండు జిల్లాల పోలీసులు ఏ మేరకు స్పందించారు.. పోలీసులొస్తే ఏమవుతుందోనన్న భయం కూడా లేకుండా దుండగులు రెచ్చిపోయారంటే ఖాకీల పనితీరు ఏ రీతిన ఉందన్న అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. మండల మెజిస్ట్రేట్ హోదా కలిగిన తహసిల్దార్‌పై దుండగులు దౌర్జన్యం చేస్తుంటే ఎమ్మెల్యే గన్‌మెన్ ఏం చేశారు.. బాధ్యత కలిగిన అతను వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఎందుకివ్వలేదు.. ఇవన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇక చింతమనేని ప్రభాకర్ గురువారం అనుచరులతో ఏలూరులో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి పోలీసు అధికారులను కలవడం కూడా వివాదాస్పదమవుతోంది. ఇదే విషయాన్ని ఎన్జీవో సంఘాల నేతలు ఎత్తిచూపి పోలీసు అధికారులపై విమర్శలు సంధిస్తున్నారు. ప్రభాకర్ తాజా వివాదం నేపథ్యంలో ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేసిన పోలీసులు ఇప్పుడు ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సిందే.
కేసు విచారణలో ఎవరి ఒత్తిళ్లూ లేవు
తప్పుడు కేసని తేలితే క్లోజ్ చేస్తాం : ఎస్పీ
పెదవేగిలో నమోదైన కౌంటర్ కేసు విచారణలో ఎవరి ఒత్తిళ్లు లేవని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. కృష్ణాజిల్లా పోలీసులతో పాటు పెదవేగి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. తప్పుడు కేసని తేలితే వెంటనే క్లోజ్ చేస్తామన్నారు.