పలాస: పిల్లాడి చదువుకు అందివస్తుందని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు.... పిల్ల పెళ్లి చేద్దామన్న ఆశతో ఓ చిరుద్యోగి... వ్యాపారానికి పెట్టుబడిగా ఉంటుందని ఓ బడ్డీకొట్టు నిర్వాహకుడు... ఇంటికి ఫర్నిచర్ చేయించుకుందామని గుట్టుగా సంసారం చేసుకునే ఓ మహిళ... ఇలా ఎంతోమంది మళ్లీ చిట్స్ వలలో పడ్డారు. చీటింగ్‌కు బలైపోయారు. కాశీబుగ్గలో కోట్లలో టర్నోవర్ చేస్తున్న అరుణోదయ చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ ఇక మూతపడక తప్పదని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా 25కోట్ల రూపాయలు బకాయిపడిన ఆ సంస్థ యజమాని ఇప్పుడు పత్తాలేకుండా పోయాడు. చేసేది లేక బాధితులంతా ఈ రోజు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ భాస్కర కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న అరుణోదయ చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ యజమాని సంపతిరావు వెంకటగోవిందరావు సుమారు 500 మంది ఖాతాదారులకు సుమారు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. 6 నెలల నుంచి ఖాతాదారులు కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా చెల్లించడం లేదు. సుమారు 100 మంది ఖాతాదారులు ఫైనాన్స్ సంస్థ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు డి.లక్ష్మణరావు అనే ఖాతాదారుడు ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేశారు. 20 ఏళ్లుగా కాశీబుగ్గ, టెక్కలి కేంద్రంగా నడిచిన ఈ సంస్థ కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించింది. సంస్థ యజమాని ఆ మొత్తాలను స్థిరాస్తి వ్యాపారాలపై పెట్టడంతో తీవ్రంగా నష్టపోయారు. చీటీ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయారు.
అప్పుల బాధ తట్టుకోలేక గత ఏడాది ఆత్మహత్యకు యత్నించాడు. చివరికి సుదీర్ఘకాలం చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. ఇటీవల ఖాతాదారులు అతని కోసం కలవడానికి ప్రయత్నించినా వీలు పడలేదు. ఫోన్ చేస్తే స్విచ్‌ఆఫ్ రావడం, కొంతమందికి చిన్నమొత్తాలు చెల్లించి పెద్ద మొత్తాలను చెల్లించకపోవడంతో అందులోని ఖాతాదారులు చివరికి కార్యాలయం వద్ద కాపుకాశారు. ఫలితం లేకపోవడంతో గురువారం పలాసకు చెందిన సున్నపు కేశవరావు, టెక్కలికి చెందిన బి.క్రిష్ణవేణి, కొత్తఅగ్రహారానికి చెందిన బి.సత్యవతి, కాశీబుగ్గకు చెందిన బమ్మిడి పోలినాయుడు, పలాసకు చెందిన పి.కె.శ్రీను, పట్నాయక్, భీమారావు, గంధం కామేష్ తదితరులు ఫైనాన్స్ సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీబుగ్గలోనే సుమారు 150 మందికి రూ.8కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఇదిగో అదిగో అంటూ కాలం దాటిస్తున్నారే తప్ప డబ్బులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. పైగా ఇప్పుడు ఆయన ఐపీ పెట్టేయత్నంలో ఉన్నట్టు తెలియడంతో రోటరీనగర్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ను ఎస్‌బీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రూ.45 లక్షలు తమ బ్యాంకుకు ఇవ్వాలని, అందుకే ఈ భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అస్తమించిన అరుణోదయం
Published Fri, Jul 17 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement