కోనేరుసెంటర్(మచిలీపట్నం): చీటీల పేరుతో జనాన్ని మోసం చేసి పరారైన వ్యాపారిని ఇనగుదురుపేట పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న అతన్ని కోర్టుకు హాజరుపరిచారు. శనివారం ఇనగుదురుపేట సీఐ ఎస్‌కే నబీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం రాజుపేటకు చెందిన అన్నం రాధాకృష్ణమూర్తి 30 ఏళ్లుగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఏడాదిగా వ్యాపారం సరిగా నడవకపోవటంతో కుటుంబంతో సహా రాధాకృష్ణమూర్తి మచిలీపట్నం నుంచి రాత్రికిరాత్రే ఉడాయించాడు. బాధితులు పలువురు ఫిబ్రవరిలో రాధాకృష్ణమూర్తిపై ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.
పోలీసులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రాత్రి అతనిని రాజుపేటలో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చీటీల పేరుతో సుమారు రూ. 50 లక్షలకుపైగా బాధితులకు టోకరా పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. రాధాకృష్ణమూర్తితోపాటు వ్యాపారానికి సంబంధించి మరి కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. అదుపులోకి తీసుకున్న అతన్ని కోర్టుకు హాజరుపరచి రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కుమార్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment