జంకులేని బంకులు | City Gas Stations baritegimpu | Sakshi
Sakshi News home page

జంకులేని బంకులు

Published Mon, Feb 17 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM

జంకులేని బంకులు

జంకులేని బంకులు

  •    సిటీలో పెట్రోల్ బంకుల బరితెగింపు
  •      శివారు ప్రాంతాల్లో మరీనూ...
  •      వాహనదారులను నిలువునా దోచేస్తున్న వైనం
  •      ఏటా రూ.35 కోట్లకుపైగా మోసం
  •      యథేచ్చగా కల్తీ
  •      పరిమాణంలోనూ భారీగా చేతివాటం
  •      మామూళ్ల మత్తులో తూనికలు కొలతలశాఖ
  •      హైదరాబాద్ సంఘటనలతోనైనా కళ్లుతెరవని అధికారులు
  •  కంటికి కనిపించని దొంగతనం అంటే ఏంటో తెలుసా..ఎప్పుడైనా చూసి ఉంటారా...లేదంటే సిటీలో పెట్రోల్ బంక్‌ల తీరును నిశితంగా గమనిస్తే ఇట్టే పట్టేయొచ్చు. నిజం..నగరంలో పెట్రోల్ బంకులు బరితెగించేస్తున్నాయి. నిలువు దోపిడీయే లక్ష్యంగా బంక్‌లతో పంపింగ్ చేస్తున్నాయి. నాలుగు చేతులు నిండితేచాలు వాహనదారులు ఏమైపోతే మనకెందుకు అనే ధోరణితో ఏటా కోట్లకు కోట్లు పిండేస్తున్నాయి. బంక్‌కు వచ్చిన వాహనదారులు తొందరగా పెట్రోల్ పోయించుకుపోతే చాలనే కంగారుతో పరోక్షంగా బంక్‌ల అక్రమాలకు బలైపోతున్నారు. ఒక పక్క కల్తీ, మరోపక్క పరిమాణం రూపంలో బంక్‌ల యాజమాన్యాలు భారీగా దిగమింగుతూ చెలరేగిపోతున్నాయి. అడ్డుకునేవాళ్లు లేక, బాధ్యత వహించాల్సిన తూనికలు కొలతలశాఖ బంక్‌లు పోసే మామూళ్ల మత్తులో తేలుతున్నాయి. ఏటా రూ.35 కోట్లకుపైగా జరుగుతున్న ఈ దోపిడీకి అంతంలేకుండా పోతోంది.
     
     మేమంతే...అడ్డుకునేవాళ్లేరి?
     అన్ని కంపెనీలవి కలిపి నగరంలో మొత్తం 72పెట్రోలు బంక్‌లున్నాయి. వీటిలో చాలా బంకులు అడ్డగోలుగా బరితెగించేస్తున్నాయి.      
     
    నిబంధనలకు పెట్రోలొదిలి అందినకాడికి దోచుకుంటున్నాయి. వాస్తవా నికి వాహనదారుడెవరైనా బంక్‌కు వస్తేనిక్కచ్చి కొలతతో ఇంధనం పోయాలి. కానీ అడ్డగోలు మాయాజాలం లెక్కలతో తక్కువ పరిమాణం పెట్రోలుతో దోచేస్తున్నాయి.
     
     శివారు ప్రాంతంతోపాటు జాతీయరహదారిపైనున్న పదులసంఖ్యలోని పెట్రోల్ బంకులు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. లీటర్ ఇంధనం కొట్టాల్సినచోట పరిమాణం తగ్గించి పంప్ చేస్తున్నాయి. ఇలా నిత్యం వందల వాహనాల్లో ఇంధనం నింపి ఏటా కోట్లలో వెనకేసుకుంటున్నాయి. కొన్ని బంక్‌లు తక్కువ పరిమాణంలో ఇంధనం నింపి ఎక్కువ కొట్టినట్టు తప్పుడు మీటర్లతో మాయచేస్తోన్న సంఘటనలు ఇటీవల రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో బయట పడ్డాయి. సరిగ్గా ఇటువంటి దోపిడీకూడా నగరంలో యథేచ్చగా జరుగుతోంది.
     
     పేరుకు మీటర్ రీడింగ్ సక్రమంగానే కనిపించినా ట్యాంకులో మాత్రం అంత ఇంధనం పడడంలేదు. విషయం తెలియక, బంక్‌ల బరితెగింపు అర్థంకాక వినియోగదారులు చేసేదిలేక మళ్లీ ఇంధనానికి అక్కడకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేవలం కొన్ని బంక్‌లు మినహా చాలావి ఇదే దారిలో నడుస్తున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ కల్తీచేసి విక్రయిస్తూ వేలాది వాహనాల జీవిత కాలాన్ని దెబ్బతీస్తున్నాయి.
     
     ఏదైనా లారీ 100 లీటర్లు డీజిల్ కొట్టిస్తే ట్యాంకులో పడేది కేవలం 9వేల మిల్లీలీటర్ల వరకు పరిమాణం తగ్గించేస్తున్నారు. అంటే సుమారుగా 9లీటర్లకుపైగానే మోసం జరుగుతోంది. ఈ విధంగా నిత్యం నగరం, చుట్టుపక్క ప్రాంతాల్లో వేలాది లారీలు వందలాది లీటర్లు ఇంధనం కొట్టిస్తాయి. ఈ విధంగా ఏటా కోట్లలో వీటినుంచి పిండేస్తున్నారు.
     
     ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టించుకునే ఇంధనంలో అయిదు లీటర్లకు 100ఎంఎల్ వరకు తగ్గించేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అయితే  యథేచ్చగా మీటర్ ట్యాంపరింగ్ జరుగుతోంది. అయిదు లీటర్లు పెట్రోలుకు నాలుగు లీటర్లే కొట్టినా మీటర్ రీడింగ్ మాత్రం సరిగ్గానే చూపిస్తున్నాయి.
     
     వాస్తవానికి పెట్రోల్ బంక్‌ల మాయాజాలాన్ని జిల్లా తూనికలు కొలతలశాఖ అధికారులు పట్టుకుని వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ  నగరంలో మాత్రం ఆశాఖ పనిచేస్తోన్న దాఖలాలు కనిపించడంలేదు. కొన్నిసార్లు  నెలనెలా, వివిధ సందర్భాల్లోనూ, నిబంధనలన్నీ సరిగ్గా అమలవుతున్నాయన్న సర్టిఫికెట్, స్టాంపింగ్ వేసే సమయాల్లో వీటినుంచి అందినకాడికి దోచేస్తున్నారు. దీంతో అధికారులు తమ జోలికి రారనే ధైర్యంతో అడ్డగోలుగా బరితెగించేస్తున్నారు.
     
    నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్‌లపై ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి. కానీ ఇదెక్కడా అమలు కావడంలేదు. నగరంలో భారీగా బంక్‌లు దోచేస్తుంటే అధికారులు మాత్రం తమ తనిఖీల్లో కేవలం అయిదు లీటర్లకు 30నుంచి 40 ఎంఎల్ మాత్రమే పరిమాణం తగ్గిస్తున్నారని చెప్పడం విశేషం. మరో పక్క ప్రతి పెట్రోల్ బంక్ విక్రయించే ఇంధన శాంపిళ్లను బంక్ వద్ద ప్రదర్శించాలి. దాన్ని తరచూ అధికారులు తనిఖీలు చేస్తుండాలి. నగరంలో 90శాతం వరకు బంక్‌లు శాంపిళ్లను ప్రదర్శించడం లేదు. విడి పెట్రోల్‌ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఇందులోను భారీగా బయటకుతరలిపోయి బాటిళ్ల రూపంలో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై తూనికలుకొలతలశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ మాధురిని వివరణ కోరగా, సిటీలో బంక్‌లు కొంతవరకు మోసంచేసున్నాయని, పదిరోజులుగా తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement