నిందితుణ్ని మూడుసార్లు అరెస్టు చేసిన కాప్స్
లష్కరేతోయిబాలోనూ శిక్షణ తీసుకున్న నజీర్
హైదరాబాదీగానే పొరబడిన వైనం
గుజరాత్ పోలీసుల విచారణలో దొరికిన జాడ
సాక్షి, సిటీబ్యూరో:
సిటీ పోలీసుల కేసుల దర్యాప్తు తీరు, నేరగాళ్ల విచారణ విధానాల్లో ఉన్న డొల్లతనం మరోసారి బయటపడింది. పాకిస్థాన్‌లో పుట్టి, ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్‌ఈటీ)లో శిక్షణ తీసుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా నగరంలో దర్జాగా నివసించిన నజీర్ అహ్మద్ భట్ అధికారుల్ని చాలా తేలిగ్గా బోల్తా కొట్టించేశాడు. 2008 నుంచి వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ మూడుసార్లు అరెస్టు అయినా... అతని నిజస్వరూపాన్ని మన పోలీసులు గుర్తించ లేకపోయారు. గుజరాత్ వద్ద అక్రమంగా సరిహద్దులు దాటుతూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)కు దొరకడంతో అన్నీ బయటపడ్డాయి. ఆ అధికారుల సమాచారంతో కంగుతిన్న పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లి పాత కేసులో పీటీ వారెంట్‌తో నిందుతుణ్ని నగరానికి తీసుకువచ్చారు. పాకిస్థానీ కావడంతో మరో కేసు నమోదు చేసి సీసీఎస్ ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు బదిలీ చేశారు. నజీర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్ అధికారులు అనేక వివరాలు సేకరించారు.
అనుకోకుండా ఎల్‌ఈటీలోకి...
కాశ్మీర్‌లోని కుప్వాడాకు చెందిన మహ్మద్ సికిందర్ భట్ పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు వలస వెళ్లాడు. ఇతడి కుమారుడే మహ్మద్ నజీర్ అహ్మద్ భట్ అలియాస్ హకీమ్ మహ్మద్ నజీర్ ఇన్‌క్విలాబ్. ఎనిమిదో తరగతి వరకు చదివిన నజీర్ 1987 నుంచి తన తండ్రితో కలిసి హెర్బల్ వైద్యం చేయడం ప్రారంభించాడు. ఈ వృత్తి కోసమే కరాచీకి మకాం మార్చిన నజీర్‌కు 2005లో ఎల్‌ఈటీకి చెందిన అబు తోలా ప్రభావానికి గురై ఉగ్రవాద సంస్థలో చేరేందుకు అంగీకరించాడు. అతడితో కలిసి కరాచీ నుంచి ముజఫరాబాద్ కొండల్లోని ఎల్‌ఈటీ ట్రైనింగ్ క్యాంప్‌నకు చేరుకున్న నజీర్.. మరో 300 మందితో కలిసి నాసిర్ జావేద్ నాయకత్వంలో 21 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. ట్రైనింగ్ పూర్తయిన తరవాత కూడా ఏడాది పాటు కరాచీలోనే ఉండి హెర్బల్ వైద్యం కొనసాగించాడు. 2006లో ఎల్‌ఈటీకే చెందిన సజీద్ సహకారంతో పాకిస్థాన్ పాస్‌పోర్ట్ పొందిన నజీర్ కరాచీ నుంచి విమానంలో నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నాడు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోల్‌కతా, అట్నుంచి రైలులో ఢిల్లీ, ఆ నగరం నుంచి బస్సులో జమ్ము మీదుగా శ్రీనగర్ చేరుకున్నాడు. అక్కడ నజీర్‌ను పంపూర్‌కు చెందిన ఇక్బాల్, ఇమ్రాన్ రిసీవ్ చేసుకున్నారు. తుపాకులు కలిగిన వీరిద్దరూ రాత్రి వేళల్లో దోపిడీలకు పాల్పడేవారు.
ఇన్‌స్పెక్టర్‌ను చంపేందుకు భయపడి...
ఇలా నాలుగు రోజులు గడిచిన తరవాత వీరిని పింటూ అనే వ్యక్తి కలిసి లష్కరేతొయిబా టార్గెట్‌లో ఉన్న పంపూర్‌లోని షఖూర్ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ను చంపాలని సూచించాడు. ఈ కుట్రలో భాగస్వామి కావడానికి నజీర్ ససేమిరా అనడంతో అతని పాస్‌పోర్ట్‌ను వారు చింపిపారేశారు. దీంతో నజీర్ తిరిగి ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై డాక్టర్ నాయర్ రాసిన పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. అందులో యునానీ వైద్యానికి సంబంధించిన విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్ చూసి సంప్రదించాడు. సదరు వ్యక్తి హైదరాబాద్‌కు రమ్మని కోరడంతో నజీర్ నేరుగా వచ్చి మలక్‌పేట్ ప్రాంతంలో అతడిని కలిశాడు. ఎలాంటి డిగ్రీలు లేకపోవడంతో సహకరించలేనని ‘ఆ స్థానికుడు’ చెప్పడంతో రెండు నెలల పాటు ఆస్పత్రులన్నీ తిరిగిన నజీర్.. మలక్‌పేట్‌లోనే ఓ గదిని అద్దెకు తీసుకుని క్లినిక్ ఏర్పాటు చేసి హెచ్‌ఐవీ బాధితులకు వైద్యం చేయడం ప్రారంభించాడు. అప్పటికే వివాహితుడైన నజీర్ వైద్యం కోసం వచ్చిన యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. 2007లో ఈ క్లినిక్‌ను బార్కస్ ప్రాంతానికి మార్చాడు. అక్కడ ‘హెచ్‌ఐవీ డిస్కవర్’ పేరుతో 17 పడకల ఆస్పత్రిగా తయారు చేశాడు.
మూడుసార్లు అరెస్టు అయినా...
ఎలాంటి విద్యార్హతలు లేని వైద్యుడిగా మోసాలు చేస్తున్నాడంటూ ఇంటి యజమాని చేసిన ఫిర్యాదు మేరకు 2008లో కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు నజీర్‌ను అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన నజీర్ మెహదీపట్నంలోని ఓ డిస్పెన్సరీలో కొంతకాలం పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిపై క్రిమినల్ ట్రెస్‌పాస్ కేసు నమోదు కావడంతో హుమయూన్‌నగర్ పోలీసులు 2011లో అరెస్టు చేశారు. ఈ కేసు లోక్‌అదాలత్‌లో రాజీ కావడంతో తన మకాంను ఉప్పరపల్లికి మార్చిన నజీర్.. అక్కడ ‘నోవా డిస్పెన్సరీ’ పేరుతో మరో ఆస్పత్రిని ఏర్పాటు చేశాడు. ఇక్కడ పరిచయమైన టోలిచౌకికి చెందిన మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. గత ఏడాది మార్చిలో లంగర్‌హౌస్ పోలీసులు నజీర్‌ను మూడోసారి అరెస్టు చే శారు. ఇతడు జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన బోగస్ తాంత్రికుడు మౌదూద్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహదేవ్ అలియాస్ లార్డ్ శివతో కలిసి ఏకంగా కానిస్టేబుల్ పైనే దాడి చేసిన కేసులో జైలుకు పంపారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఏ ఒక్కసారీ తాను ఎల్‌ఈటీలో శిక్షణ పొందిన పాకిస్థానీ అని నజీర్ బయటపెట్టలేదు... పోలీసులు కనిపెట్టనూ లేదు. నజీర్ మలక్‌పేటలో ఉండగానే తప్పుడు వివరాలతో కొన్ని ధ్రువీకరణల్ని సైతం సమకూర్చుకున్నాడు.
పాక్‌కు వెళ్తూ గుజరాత్‌లో చిక్కడంతో...
సిటీలోని అనేక ఠాణాల్లో కేసులు నమోదై ఉన్న మౌదూద్ మాటలకు నజీర్ ఎంతో ప్రభావితమయ్యాడు. చివరకు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉన్న తన మొదటి భార్య పెద్ద కుమార్తెను ఇతడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ పనుల నిమిత్తమే గత ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌కు పయనయ్యాడు. గుజరాత్‌లోని వాంఖనీర్ మీదుగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ బీఎస్‌ఎఫ్ దళాలకు చిక్కాడు. వీరు నజీర్‌ను అక్కడి నారా పోలీసులకు అప్పగించగా వారి విచారణలో తన ‘ప్రస్థానం’ మొత్తం బయటపెట్టాడు. నారా పోలీసుల సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన నగర పోలీసులు పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చారు. అలా ఇతగాడు పాకిస్థానీ అని తెలుసుకున్న అధికారులు నజీర్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సిట్‌కు బదిలీ చేశారు. గత నెల్లో న్యాయస్థానం అనుమతితో నజీర్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు 23వ తేదీ వరకు వివిధ కోణాల్లో విచారించారు. ఈ నేపథ్యంలోనే ఇతడు నగరంలో ఉంటూనే ఓటర్ ఐడీ, ఆధార్, పాన్‌కార్డులతో పాటు డ్రైవింగ్ లెసైన్స్ కూడా తీసుకున్నాడని, రెండు బ్యాంకుల్లో అకౌంట్లు కూడా తెరిచాడని వెలుగులోకి వచ్చింది. లష్కరేతొయిబాలో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నా నజీర్‌లో అలాంటి ధోరణి లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే అన్ని రోజులు నిశ్చింతగా సిటీలో ఉన్న ఇతగాడు ఎలాంటి కుట్రలకైనా తేలిగ్గా పాల్పడే ప్రమాదం ఉండేది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పోలీసుల విచారణ, దర్యాప్తు తీరుతెన్నుల్ని సమీక్షించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఇతర ఏజెన్సీలతో సమన్వయంతో పని చేయాల్సిన ఆవశ్యకతను నజీర్ ఉదంతం చెప్పకనే చెప్తోంది.
పాకిస్థానీ పట్టుబడినా పసిగట్టలేకపోయిన సిటీ పోలీసులు
Published Wed, Jan 8 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement