సీకే అడుగులెటు?
రేపు అనుచరులతోసమావేశం
21న భవిష్య కార్యాచరణ ప్రకటన
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: చిత్తూరు (కాంగ్రెస్ పార్టీ) ఎమ్మెల్యే సీకే.బాబు రాజకీయంగా ఎలాంటి అడుగులేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదే విషయమై ఆయన తన అనుచరులతో శుక్రవారం సమావేశం కానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ సీకే.బాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు రాజీనామా పత్రాన్ని మంగళవారం సాయంత్రం ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఓట్లు, సీట్ల కోసం తెలుగుజాతిని రెండుగా చీల్చడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఉద్యమంలో ఇలా..
తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరిస్తూ గత ఏడాది జూలై 30న ప్రకటన చేసింది. అదే రోజు రాత్రి సీకే.బాబు రోడ్డుపైకి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏడు రోజులు నగరంలో ఆమరణ నిరహారదీక్ష చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు నుంచి వందలాది మందితో తిరుమలకు పాదయాత్ర చేశారు. జిల్లాలో ఉద్యోగ సంఘ, ఎన్‌జీవో నేతలు సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక పేరిట ఫోరం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా అధ్యక్షుడిగా సీకే.బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రెండు నెలలు చిత్తూరులో సమై క్య ఉద్యమం సాగింది. రాష్ట్రం విడిపోతే తన ఎమ్మెల్యే పదవిని ఏ మాత్రం లెక్కచేయబోనని సీకే అప్పట్లోనే ప్రకటించారు.
రేపు సమాలోచన?
ఎమ్మెల్యే పదవికి రాజీనామా వరకే సీకే.బాబు ప్రస్తుతానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా అన్న దానిపై ప్రకటన చేయలేదు. వ్యక్తిగత పనులపై ఉన్న ఆయన శుక్రవారం తన అనుచరులతో సమాలోచన సమావేశం ఏర్పా టు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాంగ్రెస్ లో కొనసాగడమా, వేరే పార్టీ లో చేరడమా? స్వతంత్ర అభ్యర్థిగా సమైక్య నినాదంతో ప్రజ ల్లోకి వెళ్లడమా అనే విషయంపై ఆ రోజు స్పష్టత రానుంది. ఈ నెల 21న సీకే.బాబు తన రాజ కీయ భవిష్య కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి.