తల్లిదండ్రుల తర్వాత సమాజంలో గురువుకే ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. ఒకప్పుడు గురువుల ఎంపిక పారదర్శకంగా జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. డబ్బు, కులం, హోదా ఉంటే చాలు అనర్హులనైనా అందలం ఎక్కించేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇదే పరిస్థితి దాపురించింది. అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాకముందే పైరవీలు సాగిస్తున్నారు. కాసులుంటే చాలు.. క్లాసులు తీసుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన విద్యార్థులు శనివారం కదం తొక్కారు.
యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: రాయలసీమలో ఎస్వీ యూనివర్సిటీకి ఎనలేని పేరు ప్రతిష్టలు ఉన్నాయి. శ్రీనివాసుడి సన్నిధిలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో చదివితే చదువుతో పాటు ఉన్నత పదవులు అలంకరించవచ్చని అందరూ భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నానాటికీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే అధ్యాపకుల కొరత వల్ల చదువులు కుంటుపడుతూ వచ్చాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 268 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ముందుకొచ్చింది.
వీటి కోసం ‘కాసు’క్కూర్చున్న కొందరు అమాత్యులు తమదైన శైలిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నోటిఫికేషన్ విడుదల కాకముందే పోస్టులను కైవసం చేసుకోవాలని భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. కులం, డబ్బు, హోదాల ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సంబంధిత యూనివర్సిటీ అధికారులు పావులు కదపడంతో విషయం విద్యార్థుల దాకా వెళ్లింది. శనివారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కదం తొక్కారు.
అన్నమయ్య భవన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. అధ్యాపక పోస్టుల భర్తీలో అవినీతి,అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ వీసీ, రిజిస్ట్రార్‌పై మండిపడ్డారు. విద్యార్థుల మధ్య కుల చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధ్యాపక పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాసులుంటే క్లాసులు తీసుకోవచ్చు!
Published Sun, Nov 10 2013 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement