మట్టి మాఫియా
జోరుగా వ్యాపారం చేస్తున్న అధికార పార్టీ నేతలు
పరిమితులు లేకుండా తవ్వకాలు
రైతులే పెట్టుబడిగా దోపిడీకి తెరతీసిన వైనం
తమ్ముళ్లకు వరంగా మారిన నీరు-చెట్టు
విజయవాడ : ఇన్నాళ్లూ ఇసుక దందా చెలాయించిన అధికార పార్టీ నేతలు తాజాగా మట్టి మాఫియాకు తెరతీశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న నీరు-చెట్టు పథకాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలోని ఇరిగేషన్ చెరువుల్లో మట్టిని తవ్వేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ స్థలాల్లోనూ పోసుకుంటారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా వారికి వత్తాసు పలుకుతోంది. దీంతో యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు చెరువుల్లోని మట్టి త రలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 5 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇవికాక మరో ఐదు రెట్లు రైతుల నుంచి టీడీపీ నాయకులు వసూలు చేసి రూ. 30 కోట్లు దోచేస్తున్నారు.
650 చెరువులు ఎండబెట్టారు..
జిల్లాలోని 924 చెరువుల్లో చెట్టు-నీరు కార్యక్రమాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 650 చెరువులను ఎండబెట్టారు. చెరువుల్లో పూడికతీత పనులు సజావుగా సాగాలంటే నీరు లేకుండా ఎండబెట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత చెరువుల్లో మట్టిని సులువుగా తవ్వేందుకు వీలవుతుంది. చెరువుల్లో మట్టి తవ్వకాలు మే నెలాఖరులోపు పూర్తి కావాల్సి ఉంది.
దోపిడీ సాగుతున్నది ఇలా..
చెరువుల్లో మట్టిని తవ్వేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ ఎవరి ఇష్టానుసారం వారు తవ్వుకుంటున్నారు. చెరువుల్లో పేరుకుపోయిన ఒండ్రు మట్టిని మాత్రమే తవ్వాలి. ఎంత లోతంటే అంత లోతు తవ్వేందుకు వీల్లేదు. ప్రభుత్వం కేటాయించిన ఐదు కోట్లతో పొక్లెయిన్‌లు పెట్టి మట్టిని తవ్వి రైతుల పొలాలకు చేర్చాలి. ఇలా చేసినందుకు క్యూబిక్ మీటర్‌కు ప్రభుత్వం రూ. 29 ఇస్తుంది. ఈ లెక్కన మూడు క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే ట్రాక్టర్ నిండు తుంది. అంటే ఒక్క ట్రాక్టర్‌కు మట్టి నింపినందుకు రూ. 87 పొక్లెయిన్‌కు చెల్లించాలి. అయితే స్థానికంగా ఉండే టీడీపీ నేతలు పొక్లెయిన్ యజమానితో మాట్లాడి ట్రాక్టర్‌కు 150 నుంచి 200 రూపాయలు రైతుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. పొక్లెయినర్ యజ మానికి నామమాత్రంగా ముట్టజెప్పి మిగతా మొత్తం అంటే దాదాపు రూ. 25 కోట్లు నొక్కేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఐదు కోట్లు ఆ శాఖ మంత్రి జేబులోకి వెళుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాటించని నిబంధనలు
చెరువుల్లో మట్టిని తవ్వేటప్పుడు టెక్నికల్ నిబంధనలు పాటించాలి. ఇంజినీర్లు చెప్పిన విధంగా ఒండ్రు మట్టిని మాత్రమే తవ్వాలి. చెరువులో గుంతలు తీయకూడదు. ఆయకట్టును దృష్టిలో ఉంచుకుని చెరువు లోతట్టును డిజైన్ చేస్తారు. అంతకుమించి తవ్వితే తూ ముకు నీరు అందే అవకాశం ఉండదు. కొన్ని చోట్ల చెరువుల్లో ఇసుక పొరలుంటాయి. ఆ పొరల వరకు తవ్వితే చెరువులో నీరు నిలబడదు. ఆవిరైపోతుంది. దీనివల్ల రైతులు నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇవన్నీ అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదు. ఇక చెరువులకు వర్షపు నీరందించే సప్లై చానల్స్ పూడిక తీయించాలి. వాటిపై అధికారులు దృష్టిపెట్టడంలేదు.
అడ్డం తిరిగితే బెదిరింపులు
అక్రమంగా మట్టి తరలించవద్దని, నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వవద్దని రైతులు అడ్డం తిరిగితే రెవెన్యూ అధికారులతో గ్రామస్తులను బెదిరిస్తున్నారు. సుమారు 70, 80 ఏళ్ల నుంచి చెరువు చివర ఆక్రమించుకుని సాగుచేసుకుని బతుకుతున్న పేదల పొలాలను విడగొడతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం, గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు, తదితర చోట్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గన్నవవరం ఏరియాలో పాతపాడు, గోపవరపుగూడెం, పురుషోత్తపట్నం, ముస్తాబాద, బల్లిపర్రు తదితర ప్రాంతాల్లో ప్రతి రోజూ గొడవలు జరుగుతున్నాయి.