water-tree
-
నీరు–చెట్టు ఫైళ్లకు మోక్షం
మూడు నియోజకవర్గాల ప్రతిపాదనలకు కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ – మిగతా నియోజకవర్గాలకు మొండిచెయ్యి – చక్రం తిప్పుతున్న ఇన్చార్జి బావమరిది సాక్షి ప్రతినిధి, కర్నూలు: అనుకున్నదే జరుగుతోంది. నీరు–చెట్టు పథకం కింద పూడికతీత పనులకు కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. జిల్లాలో కేవలం పత్తికొండ, డోన్, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనల ఫైళ్లపై మాత్రమే కలెక్టర్ సంతకాలు పెట్టేస్తున్నారు. మరోవైపు మిగతా నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు కలెక్టర్ వైఖరిపై మండిపడుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కేవలం మూడు నియోజకవర్గ ప్రతిపాదనలకు మాత్రమే అనుమతులిస్తున్నారని తప్పుపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గ ఇన్చార్జి బావమరిది రింగు మాస్టర్‌గా మారారని తెలుస్తోంది. బదిలీ అయినా... వాస్తవానికి జిల్లా కలెక్టర్ విజయమోహన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా జేసీగా ఉన్న సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన ఈనెల 22న బాధ్యతలు తీసుకోనున్నారు. బదిలీ అయిన తర్వాత కేవలం పరిపాలనకు సంబంధించిన సాధారణ ఫైళ్లు మినహా కొత్తగా ఆర్థికపరమైన అంశాలతో కూడిన ఫైళ్లపై సంతకాలు చేయడం నైతికంగా సరైన ప్రక్రియ కాదు. అయితే ఇందుకు భిన్నంగా కలెక్టర్ పొద్దుపోయే వరకు ఉండి మరీ కేవలం మూడు నియోజకవర్గాల ప్రతిపాదనలకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ ఇస్తుండటం విమర్శల పాలవుతోంది. మిగతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు చేసిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేస్తుండటంపై వారు మండిపడుతున్నారు. సీఎంకు ఫిర్యాదులు... కలెక్టర్ వ్యవహారశైలిపై మండిపడుతున్న అధికార పార్టీ నేతలు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తమ ప్రతిపాదనలను కనీసం ఆమోదించకుండా కేవలం డిప్యూటీ సీఎం, ఆయన తమ్ముడు ఇన్చార్జిగా ఉన్న నియోజకవర్గాలతో పాటు పాణ్యం నియోజకవర్గాల ఫైళ్లకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. అంతేకాకుండా ఒక ఇన్చార్జి బావమరిది రింగు మాస్టర్‌గా ఉండి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశాన్ని నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. -
మట్టి హాంఫట్!
• నీరు–చెట్టు పనుల పేరుతో దోపిడీ • ప్రతిరోజూ 400 ట్రిప్పులు అమ్మకం • నాలుగు మాసాలుగా ఇదే తంతు • చెరువునే చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు నీరు–చెట్టు పనులు అధికార పార్టీ నాయకులకు కల్పతరువుగా మారాయి. వర్క్ అలాట్మెంట్ కాకపోయినా ఈ పనుల పేరు చెప్పి చెరువులు, వంకలు, వాగుల్లోని మట్టిని కొల్ల గొడుతున్నారు. ట్రిప్పునకు రూ.400 నుంచి రూ.500 వరకు అమ్ముకుంటూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. కడప చుట్టుపక్కల 4 మాసాలుగా ఈ దందా సాగుతున్నా ఇరిగేషన్ అధికారులుగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు తొంగి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప కార్పొరేషన్: నీరు–చెట్టు పనులు కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పనులు చేపట్టే విషయంలో తెలుగు తమ్ముళ్లు ధనార్జనే ధ్యేయంగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. నిబంధలనల ప్రకారం నీరు–చెట్టు కింద పూడిపోయిన వంకలు, వాగులు, చెరువుల్లో పూడిక తీత, చెరువు నుంచి పొలాల్లోకి వున్న కాలువలను బాగుచేయడం వంటి పనులు చేయాలి. కానీ అవేవీ జిల్లాలో అమలు కావడం లేదు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని పుట్లంపల్లి చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉంది. పంటలు కోసిన తర్వాత ఈ మట్టిని పొలాల్లోకి తోలి భూసారాన్ని పెంచితే రైతులకు ఉపయోగముంటుంది. అలాకాని పక్షంలో చెరువు కట్టను బలోపేతం చేసేందుకు ఈ మట్టిని వినియోగించాలి. అంతిమంగా ఈ పనుల వల్ల రైతులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ పథకం అమలు మాత్రం తమ్ముళ్లకు ఆర్జించిపెట్టడమే పరమావధిగా ముందుకు సాగుతోంది. పుట్లపల్లి చెరువులో సాగుతున్న నీరు–చెట్టు పనులే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో నాలుగు మాసాలుగా ఈ మట్టి దందా సాగుతోంది. కేవలం రూ.10 లక్షల వర్క్‌ను ఇలా నెలల తరబడి చేస్తూ మట్టిని కొల్లగొడుతున్నట్లు సమచారం. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజుకు దాదాపు 400 ట్రిప్పుల వరకూ తోలుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన 4 నెలలకు రూ.2కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తోంది. వర్క్ అలాట్మెంట్ అయిన చోట కాకుండా చెరువు మధ్యలోని మట్టిని జేసీబీతో తోడుతూ ప్రయివేటు సంస్థలకు, ఇటుక బట్టీలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు కంటే కొసరే ఎక్కువ అసలు కంటే కొసరే ఎక్కువన్నట్లు ఇక్కడ వర్క్ మంజూరైంది రూ.10లక్షలైతే, మట్టిని అమ్ముకోవడం ద్వారా ఇరవై రెట్లు అధికంగా ఆర్జించినట్లు సమాచారం. చెరువులో, కాలువల్లో ఉన్న నల్లమట్టిని తీయాల్సి ఉండగా, సారవంతమైన ఎర్రమట్టిని తీస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలతో చేపట్టిన ఈ పనులు నాలుగునెలల పాటు సుదీర్ఘ కాలం సాగుతుండటంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు సుమారు రూ.1.60లక్షల వరకూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. దీని వెనుక అధికారపార్టీ ముఖ్యనేత ఉండటం వల్లే యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖలోని ఈఈ స్థాయి అధికారి దీనికి పూర్తి అండదండలు అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్త కలెక్టరేట్‌కు ఈ చెరువు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఈ దందాను అడ్డుకోలేని స్థితిలో ఉండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు–చెట్టు పేరు చెప్పి చెరువులో ఇష్టానుసారం గోతు లు తవ్వుతున్నారు. భవిష్యత్‌లో ఈ గోతు లు పెను అనర్థాలకు దారితీసే అస్కారం ఉందని పుట్లంపల్లె గ్రామస్తులు సైతం వాపోతున్నారు. గతంలో కూడా గుంతలున్నాయనే విషయం తెలియక ఈత సరదాతో పసిప్రాణాలు గాల్లో కలిసిన దాఖలాలున్నాయి. సమాజానికి ఎటుచూసినా అనర్థదాయకంగా మారనున్న ఈ వ్యవహారాన్ని తక్షణమే కట్టడి చేయాల్సి ఉంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం: నీరు–చెట్టు పనులకు వర్క్ మంజూరైంది. మొత్తం రూ.5లక్షలు విలువైన చేయాల్సి ఉంది. అయితే చెరువులోని మట్టిని అమ్ముకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలిస్తాం. మట్టి అమ్ముకున్నట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటాం. మురళీకృష్ణ, డీఈ, మైనర్ ఇరిగేషన్‌శాఖ కడప -
నీరు–చెట్టు పనుల్లో అవినీతిని నిరూపిస్తా
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి సవాలును స్వీకరించలేక టీడీపీ నేతలు గైర్హాజరు కోరుకొండ : నీరు–చెట్టు పథకంలో చేసిన పనుల్లో టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, ఆధారాలతో నిరూపిస్తామని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కోరుకొండ శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం వద్ద ఈ మేరకు ప్రమాణం చేయడానికి ఉదయం 10 గంటలకు జక్కంపూడి విజయలక్ష్మితో పాటు మూడు మండలాల వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. 12 గంటల వరకు చూసినా టీడీపీ నేతలుగాని, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కానీ రాలేదు. ఇటీవల ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరు–చెట్టు పనుల్లో అవకతవకలు జరగలేదని అందుకు శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని, జరిగిందని మీరు చేస్తారా అంటూ ప్రగల్భాలు పలికి నేడు ప్రమాణానికి రాలేదని జక్కంపూడి పేర్కొన్నారు. స్వామి సన్నిధిలో ప్రమాణం చేసి, బయట స్థలంలో ఎప్పుడు సదస్సు పెట్టినా తాను వచ్చి అవినీతిని నిరుపిస్తానని ఆమె అన్నారు. అనంతరం రోడ్డుపై టీడీపీ నేతల పనితీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ప్రజాధనాన్ని దోచేస్తున్నారు మంగళవారం కోరుకొండలో జక్కంపూడి విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన దోపిడీమయంగా మారిందన్నారు. మధురపూడిలో రైతులు విమానాశ్రయానికి భూములు ఇచ్చారని, వారిలో పార్టీ సానుభూతిపరులైన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల కన్వీనర్లు వుల్లి బుజ్జిబాబు, డాక్టర్ బాబు, మండారపు వీర్రాజు, జిల్లా కార్యదర్శులు అయిల శ్రీను, చల్లమళ్ల సుజీరాజు, పేపకాయల విష్ణుమూర్తి. జ్యోతుల లక్ష్మినారాయణ, వాసంశెట్టి పెద్దవెంకన్న, యూత్ రాష్ట్ర కార్యదర్శి బొరుసు బద్రి, మండల యూత్ కార్యదర్శి అడపా శ్రీను తదితరులున్నారు. -
‘మట్టి’ మాయ
ఈ ఏడాది 77 లక్షల క్యూ.మీ మట్టి వెలికితీత దారిమళ్లుతున్నా పట్టించుకోని యంత్రాంగం టీడీపీ నేతల జేబులు నింపుతున్న నీరు–చెట్టు పక్కదారి పట్టిన మట్టి విలువ రూ.100 కోట్ల పైమాటే ‘నీరు–చెట్టు’ మట్టి గుటకాయ స్వాహా అవుతోంది. అధికారులకు, అధికార పార్టీ నేతలకు కల్పతరువుగా మారుతోంది. తవ్వుతున్న మట్టికి లెక్కాపత్రం చెప్పే పరిస్థితి లేకపోవడంతో అమ్ముకున్న వాళ్లకు అమ్ముకున్నంత అన్నట్టుగా తయారైంది. గతేడాది 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏమైపోయిందో తెలియలేదు. తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అయితే ఆ మట్టిని ఏ విధంగా వినియోగిస్తున్నదీ చెప్పే నాధుడు కరువయ్యాడు. ఇప్పటి వరకు వెలికి తీసినదానిలో పక్కదారి పట్టిన మట్టి విలువ అక్షరాల రూ. వంద కోట్ల పైమాటేనని తెలుస్తోంది. సాక్షి, విశాఖపట్నం: నీరు–చెట్టు పథకం కింద జిల్లాలో గతేడాది రెండు విడతలుగా 92 చెరువుల్లో రూ.23 కోట్లతో పనులు చేపట్టారు. 73 చెరువు పనులు ప్రారంభించినప్పటికీ 20 శాతం పనులు మాత్రమే పూర్తి కాగా రూ.ఐదు కోట్ల చెల్లింపులు చేశారు. ఏకంగా 18 లక్షల క్యూ.మీ. మట్టిని మాత్రం వెలికి తీశారు. ఇక ఈ ఏడాది 326 చెరువుల్లో పూడిక తీయాలన్న లక్ష్యంతో రూ.107 కోట్లతో 1068 పనులకు పరిపాలనామోదం ఇచ్చారు. వీటిలో 756 పనులు గ్రౌండ్ కాగా, వాటిలో 356 పనులు పూర్తయ్యాయి. మరో 406 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.21 కోట్లు ఖర్చు చేయగా.. రూ.9 కోట్ల మేర చెల్లింపులు చేశారు. మరో రూ.11 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. అనధికారికంగా మరింత మట్టి ఇప్పటివరకు పూర్తయిన, ప్రగతిలో ఉన్న పనుల ద్వారా 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు అధికారులు లెక్కతేల్చారు. ఇందుకోసం 271 ఎక్స్వటర్స్ వినియోగించగా, 1650 ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఈ మట్టిని తరలించినట్టు రికార్డుల్లో చూపారు. ఇంత పెద్దఎత్తున వెలికి తీసిన మట్టి్ట ఏమైందంటే మాత్రం అధికారుల వద్ద సమాధానం లేదు. ప్రతి చెరువులోనూ మీటర్ నుంచి రెండున్నర మీటర్ల (ఆరడుగులు) లోతున సిల్ట్ తొలగిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఈ లెక్కన ఎకరాకు 4వేల క్యూ.మీ వరకు మట్టి వస్తుందని అంచనా. అధికారికంగానే 77 లక్షల క్యూ.మీ. మట్టిని వెలికి తీసినట్టు చెబుతున్నారంటే అనధికారికంగా ఇంకెంత మట్టిని వెలికి తీశారో అర్థమవుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన చెరువులన్నీ దాదాపు వందెకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్నవే. వెలికితీసిన మట్టిని పంచాయతీల పరిధిలోనే రైతులు.. స్థానికుల అవసరాలకు వినియోగించాలి. కాని ఇప్పటివరకు ఏ ఒక్క పంచాయతీలో మట్టికి సంబంధించి సీనరేజ్ సొమ్ము జమైన దాఖలాలు లేవు. స్థానికంగా వినియోగించిన ఛాయలు లేవు. పొలాల గట్లను ఎత్తు చేసుకునేందుకు రైతులు తరలించుకు పోతున్నారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్దఎత్తున వస్తున్న మట్టిని ఉపయోగించి బలహీనంగా ఉన్న శారదా, వరహా, గోస్తని వంటి నదుల కరకట్టలను బలోపేతం చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కన్పించడం లేదు. క్యూ.మీ మట్టి రూ.250 మార్కెట్లో క్యూ.మీ మట్టి రూ.250 పలుకుతోంది. విశాఖలో రియల్టర్లు తమ వెంచర్స్‌లో ఎర్త్ ఫిల్లింగ్ కోసం నీరు చెట్టు మట్టినే వినియోగిస్తున్నట్టు తెలిసింది. వీరికి కొంత మంది టీడీపీ నేతలు మట్టిని సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. గతేడాది మాటెలాగున్నా ఈ ఏడాది ఇప్పటి వరకు వెలికి తీసిన మట్టిలో కనీసం 50 లక్షల క్యూ.మీ. దారి మళ్లినట్టు తెలుస్తోంది. ఈ మట్టి విలువ రూ.100 కోట్ల పైమాటేనని అంచనా. ఇదే విషయాన్ని ఇరిగేషన్ శాఖాధికారులను వివరణ కోరితే వెలికి తీసిన మట్టిని తిరిగి చెరువు గట్లు, స్థానిక రైతుల పొలాల గట్ల పటిష్టతకు, పంచాయతీల పరిధిలోని శ్మశానవాటికలు, పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎత్తు చేసేందుకే వినియోగిస్తున్నారని.. ఎక్కడా పక్కదారి పట్టలేదని చెప్పుకొస్తున్నారు. -
నీరు-చెట్టుపై గరంగరం
♦ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం ♦ ఆ పనులపై విచారణ చేస్తామన్న కలెక్టర్ ♦ ఇళ్ల ఎంపికలో కమిటీ సభ్యుల సంతకాలు లేకుండా తీర్మానంపై వాదోపవాదాలు ♦ జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని సజావుగా నడిపించిన కలెక్టర్ సాక్షి, కడప : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిరసనలు, వాదోపవాదాలతో వాడీవేడిగా సాగింది. పండ్లతోటల నష్ట పరిహారంతోపాటు నీరు-చెట్టు పనులకు సంబంధించి అవకతవకలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ప్రజాప్రతినిధుల మధ్య రగడ కొనసాగింది. శుక్రవారం కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కలెక్టర్ కేవీ సత్యనారాయణ హాజరుకాగా, జేసీ శ్వేత తెవతీయ జెడ్పీ సీఈఓ హోదాలో సభను నడిపించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేలోపే టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు అడ్డుతగలడంతో రచ్చ రాజుకుంది. పదేపదే తనకు మైకు ఇవ్వాలంటూ టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్ పట్టుబట్టిన వ్యవహారం జెడ్పీ చైర్మన్ గూడూరు రవి తీవ్రస్థాయిలో స్పందించారు. అరగంటపాటు వాదోపవాదాలు సాగినా అనంతరం ప్రశాంతంగా సమావేశం కొనసాగింది. నీరు-చెట్టు, ఇళ్ల మంజూరుపై వాగ్వాదం సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుగా పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు వెంగముని, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వడగండ్ల వాన తో అరటితోపాటు ఇతర పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతోందని దుమ్మెత్తిపోశారు. దీంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెప్పబోగా వెంటనే అందుకున్న వైఎస్సార్సీపీ సభ్యులు రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలోనే వారి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఇళ్ల మంజూరులో ఇదే ం పద్ధతి ఒంటిమిట్ట మండలంలోని మాధవరానికి 17 ఇళ్లు మంజూరుచేశారని, అయితే సర్పంచ్, సెక్రెటరీ లేకుండా సభ్యుల్లో ఇద్దరు మాత్రమే సంతకాలు చేసి తీర్మానం పంపారని దానిని ఎలా అమోదిస్తారంటూ జెడ్పీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దానికి సమాధానం చెప్పాలని హౌసింగ్ అధికారులను కోర గా, మధ్యలో టీడీపీ నేతలు జోక్యం చేసుకోవడంతో మాటలయుద్ధం సాగింది. ఒంటిమిట్ట మండలంలో ఉపాధిలో చేసిన పనులపైనే నీరు-చెట్టులో మళ్లీ పనులు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సభను సజావుగా నడిపించిన కలెక్టర్ జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కలెక్టర్ సత్యనారాయణ సజావుగా నడిపించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగిన సందర్భంలో జోక్యం చేసుకుం టూ సమస్యను చక్కదిద్దుతూ వచ్చారు. జెడ్పీటీసీలు అడిగిన ప్రశ్నలకు కూడా స్వయంగా కలెక్టరే సమాధానాలు ఇవ్వడంతోపాటు పరి ష్కారానికి మార్గం చూపారు. పథకాలకు సం బంధించిన లబ్ధిదారుల విషయంలో ఖచ్చితం గా అర్హులకే అందాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు అందకూడదని, ఈ విషయంలో ఎవరినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగంపై దద్దరిల్లిన జెడ్పీ కడప ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న నీరు చెట్టు పనుల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సంబంధిత పనులపై విజిలెన్సు విచారణ జరిపించాలని జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో చేసిన తీర్మానాన్ని మెజారిటీ సభ్యుల ఆమోదం తెలిపారు. శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఇన్చార్జు సీఈఓ, జేసీ శ్వేతా అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా కలెక్టర్ కేవీ సత్యనారాయణ సభకు పరిచయం చేసుకున్నారు. అనంతరం ఈ ఏడాది పదవ తరగతిలో రాష్ట్రంలో కడప జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు డీఈఓ ప్రతాప్‌రెడ్డిని అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. పంటల బీమాను అందజేయాలి: ఎంపీ అవినాష్‌రెడ్డి జిల్లాలో 2013-14లో జరిగిన పంటనష్టం ఇన్సూరెన్సును ఇచ్చి రైతన్నలను ఆదుకోవాలని ఎంపీ అవినాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 55 వేలమంది రైతులకు పంటలనష్టబీమా రావాల్సి ఉండగా ఇందులో 29 వేలమందికి ఇన్స్యూరెన్సు వచ్చిందన్నారు. ఇటీవల మరో 11 వేలమందికి కూడా వచ్చిందని.. ఇంకా 16 వేలమందికి రావాల్సి ఉందన్నారు. వారికి సంబంధించిన పత్రాలో సమస్యలు ఉన్నాయని తెలిపారన్నారు. సంబంధిత విషయంలో కలెక్టర్ చోరవ తీసుకుని జాబితాను మళ్లీ పంపాలన్నారు. అలాగే అరటి పంటకు కూడా బీమాను వర్తింపచేయాలన్నారు. అరటికి పంటనష్ట జరిగితే హెక్టారుకు 24 వేలు ఇస్తున్నారని ఇది ఏమూలకు సరిపోదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం: రాచమల్లు జిల్లాలో జరిగిన నీరుచెట్టు పనుల్లో అవినీతి రాజ్యమేలుతొందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. చాలాచోట్ల వందకు పదిశాతం మేరకే పనులు చేశారని మిగతా సొమ్మంతా తెలుగుతమ్ముళ్ల జేబులు నింపేందుకేనన్నారు. ఇదంతా అధికారులకు తెలియదా అని నిలదీశారు. సంబంధిత పనులపై విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విత్తనాలు తక్కువ ఇస్తే ఎలా: రవీంద్రనాథరెడ్డి ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే వేరుశనక్కాయలు రైతులకు సరిపడవని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి అన్నారు. ఎకరాకు 60 సేర్ల విత్తనాలు అవసరం అయితే మీరు ఇచ్చే ఒక బస్తా ఎలా సరిపోతాయన్నారు. రైతులకు సరిపడ విత్తనాలను ఇవ్వాలని అవికూడా నారాయణి రకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మామిడికి గిట్టుబాటు ధరను కల్పించాలి: శ్రీకాంత్‌రెడ్డి రైతన్నలు పండించే మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు. దీంతోపాటు రైతులకు సంబంధించి బ్యాంకుల్లో ఉన్న రుణాలను మొత్తం చెల్లించి మళ్లీ తీసుకొంటున్నారన్నారు. ఇలా చేయటం వల్ల రైతులు నష్టపోయి.. బయట బ్రోకర్లు బాగుపడుతున్నారని దీనిపై రైతులకు న్యాయం చేయాలన్నారు. స్పందించిన కలెక్టర్ పరిశీలిస్తామన్నారు. వెలిగళ్లు ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు ఇస్తే పంటల సాగుకు బాసటగా ఉంటుందన్నారు. నీరు-చెట్టులో అవినీతి జరగలేదంటే రాజీనామా చేస్తా: రఘురామిరెడ్డి ప్రభుత్వ తలపెట్టిన నీరు-చెట్టులో అవినీతి జరగలేదని అధికారులు నిరూపిస్తే తమ పదవికి రాజీనామా చేస్తానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో విపరీతమైన కరువుతో రైతులు అల్లాడుతున్నారన్నారు. రైతులకు సరైన విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు లేవు. కానీ తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకే చంద్రబాబు నీరు-చెట్టును ప్రవేశ పెట్టారన్నారు. ఇది చంద్రబాబు సొమ్మా, పచ్చ చొక్కాల దోపిడీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యాన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి: కొరముట్ల శ్రీనివాసులు కోడూరు ప్రాంతంలో ఉద్యాన పంటల సాగు అధికమని కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. గాలులకు, వర్షాలకు పంటన ష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పండ్ల తోటకు పంట ఇన్స్యూరెన్సు ఇస్తే బాగుంటుందని తెలిపారు. మండల కమిటీ ఆమోదం లేకుండానే పనులా: జెడ్పీ ఉపాధ్యక్షుడు ఇరిగేషన్ పనులకు సంబంధించి సర్పంచ్ రెజెల్యూషన్ లేకుండానే పనులను ఇస్తున్నారని జెడ్పీ ఉపాధ్యక్షుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కమిటీలో ఉన్న సభ్యలలో ఒకరిద్దరు మాత్రమే సంతకాలు తీసుకుని పనులను మంజూరు చేస్తున్నారన్నారు. ఒంటిమిట్ట మండలంలో హౌసింగ్‌కు సంబంధించి గ్రామసభ తీర్మాణం లేకుండానే 17 ఇళ్లను మంజూరు చే శారని వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ గోవిందరెడ్డి జిల్లాలో అసైన్మెంట్ కమిటీలు లేక చాలా మంది రైతలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్నారు. గత రెండేళ్ల నుంచి అసైన్ క మిటీ లేదన్నారు. అలాగే టీఎఫ్సీ , జనరల్ ఫండ్ కింద వచ్చిన పనులకు నిధులు రాలేదన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనులకు కూడా నిధులు రాలేదన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ సంబంధిత పనుల్లో కొన్ని కోర్టులో ఉన్నాయని వాటి పరిధిలోని పనులకు మాత్రమే బిల్లులు ఇవ్వాలని వచ్చిందన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న పనులకు బిల్లులు ఇచ్చే విషయమై పరిశీలిస్తామన్నారు. అక్రమ ఇసుక తరలింపును అరికట్టాలి: ఎమ్మెల్సీ దేవగుడి ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతుంది కానీ 99 శాతం అక్రమంగానే తరలిపోతుందని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి అన్నారు. గ్రామానికి ఇద్దరు రౌడీలు జతై మామాళ్లు వసూలు చేస్తున్నారన్నారు. సంబంధిత క్వారీలను వెంటనే రద్దు చేయాలన్నారు. -
ప్రభుత్వాదేశాల మేరకే ఇస్తున్నాం
ప్రభుత్వాదేశాల మేరకే 10లక్షల్లోపు నీరు-చెట్టు పనులను నీటి సంఘాలకు, జన్మభూమి కమిటీలకు అప్పగిస్తున్నాం. త్వరలోనే వర్కు ఆర్డర్స్ జారీ చేస్తాం. గత ఏడాది పనుల కేటాయింపులో జరిగిన జాప్యం వల్ల ఆశించిన స్థాయిలో పనులు జరగలేదు. కానీ ఈసారి వేసవి ముందే పనులు అప్పగిస్తున్నందున వర్షకాలం మొదలయ్యేలోగానే పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది. -నాగేశ్వరరావు, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ, విశాఖ పచ్చనేతలకు ‘కోట్లు’ ఫలహారం నామినేషన్ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు నీటి సంఘాలు.. జన్మభూమి కమిటీలకు అప్పగించేందుకు సిద్ధం గత ఏడాది మట్టినీ అమ్ముకున్న అధికార పార్టీ నేతలు నామినేషన్ల జాఢ్యం ఇరిగేషన్‌కు శాఖకు పాకింది. ఇప్పటి వరకు ఈ శాఖలో పనులన్నింటినీ టెండర్ల పద్ధతిలోనే కేటాయించేవారు. రూ.5 లక్షల లోపు విలువైన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించే వారు. కానీ ఈ ఏడాది ‘నీరు-చెట్టు’ పనులకు నామినేషన్ పరిమితిని ఏకంగా రూ. 10 లక్షలకు పెంచేసి పచ్చచొక్కాల పరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎంపిక పేరుతో దొడ్డిదారిన నీటి సంఘాల్లోతిష్టవేసిన టీడీపీ నేతలకు ఈ పనులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. సంఘాల్లేని చోట జన్మభూమి కమిటీలకు ధారాదత్తం చేయనున్నారు. విశాఖపట్నం: జిల్లాలో గత ఏడాది నీరు-చెట్టు పథకం కింద నీటిపారుదల శాఖ పరిధిలో రూ.61.75 కోట్లతో 448 పనులు చేపట్టారు. జిల్లాలో వందెకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువులు 236 ఉంటే.. రూ.23.27 కోట్లతో రెండు విడతల్లో 92 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. వీటిలో ఐదు చెరువుల పనులు మాత్రమే నూరు శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని ఈ ఏడాది పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది నామినేషన్ పరిమితిని రూ.10లక్షల వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం 216 చెరువుల్లో పూడికతీత పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని జిల్లా ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. వీటిలో కొన్ని చెరువుల్లో పూడికతీతకు రూ.25 లక్షలకుపైగా వ్యయం అవుతుందని అంచనా. అలా అయితే నామినేషన్ పద్ధతి పని చే య దు. అందుకే అటువంటి పనులను రూ. 10 లక్షల లో పు ప్యాకేజీలుగా విడగొట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.17 కోట్ల విలువైన ఈ పనులను నీటి సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు. సంఘాల్లేని చోట జన్మభూమి కమిటీలకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు 150 చెరువులను నీటి సంఘాలకు, 66 చెరువులను జన్మభూమి కమిటీలకు అప్పగిస్తూ ఒకటి రెండ్రోజుల్లో వర్కు ఆర్డర్స్ ఇవ్వనున్నారు. మట్టినీ సొమ్ము చేసుకున్నారు: గత ఏడాది ఐదు చెరువుల్లోనే నూరుశాతం పూడికతీత జరగ్గా.. మిగిలిన చెరువుల్లో 10 నుంచి 70 శాతం వరకు పనులు జరిగాయి. ఈ విధంగా వెలికితీసిన 16.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని పచ్చనేతలు ఎంచెక్కా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఈ మట్టిని పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, శ్మశానాలు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, రైతు పొలం గట్లు ఎత్తు చేసేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. జన్మభూమి కమిటీల పర్యవేక్షణలో జరిగిన ఈ పనుల్లో తవ్వి తీసిన మట్టిలో 80 శాతం టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ విధంగా రూ.10 కోట్ల వరకు వారి జేబుల్లోకి వెళ్లినట్టు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా ఈ ఏడాది ఇంకా వేసవి ప్రారంభం కాకముందే 216 చెరువులను నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంతో వీటిలో మట్టిని కూడా దర్జాగా అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు ఇప్పటి నుంచే టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
ఆ..పనులను ఆపేయండి
నీరు-చెట్టు పనులు నిలుపుదలకు కలెక్టరు ఆదేశం కొత్తనిబంధనలు వచ్చే వరకూ పనులకు బ్రేక్ శ్రీకాకుళం టౌన్: డబ్బులిచ్చినా పనిచేయలేక పోయారు. ప్రాజెక్టుకైతే భూసేకరణ, ఇతర సమస్యలు చెపుతారు. ఇప్పుడు ఏసమస్యలేని పనులెందుకు చేయలేక పోతున్నారు. ఇందులో ఉన్న ఆంతర్యమేమిటో చెప్పాలంటూ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది మంజూరైన పనుల్లో ఇంతవరకు ఎంత మేరకు పనులు పూర్తి చేశారు..ఎంత చెల్లింపులు జరిగాయో వివరాలు చెప్పాలని ఆదేశించారు. కలెక్టరేట్లో నీరు-చెట్టు పనులపై శనివారం సమీక్షించారు. ఈనెల 21లోగా పనులు చేసి.. ఆ తరువాత నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని వివరించారు. మీ నిర్లక్ష్యం వల్ల రూ.కోట్లు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. కొత్తగా ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలను అనుసరించి కొత్తగా పనులు మంజూరు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. వేసవిలో పనులు చేపట్టక పోతే సాగునీటివనరుల అభివృద్ధి సాధ్యం కాదని గుర్తు చేశారు. ఇప్పటివరకు డివిజన్లవారీగా మంజూరు చేసిన పనులు, వాటికి ఇచ్చిన కేటాయింపులు, ఇప్పటివరకు పూర్తిచేసిన పనులు, వాటికి చెల్లింపులు ఎంతమేరకు జరిగాయన్న వివరాలు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో నీరు-చెట్టు పథకం నోడల్ అధికారి, వంశధార ఎస్ఈ బి.అప్పలనాయుడు, ఈఈ రవీంద్ర, వంశధార, అఫ్షోర్, మడ్డువలస ప్రాజెక్టుల ఈఈలు పాల్గొన్నారు. -
పచ్చ నేతలకు మళ్లీ ఉపాధి!
నీరు-చెట్టు పనులు పునఃప్రారంభం గతంలో అక్రమంగా మట్టి అమ్మకాలు రూ.కోట్లు దండుకున్న టీడీపీ శ్రేణులు మళ్లీ అదే సీన్! మట్టిదొంగలకు మళ్లీ చేతినిండాపని దొరికింది. ఏడు నెలల పాటు నిలిచిన నీరు-చెట్టు పనులు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం ఊపందుకోవడంతో మట్టికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇంకా చెరువుల్లో నీరు ఉండగానే పనులకు శ్రీకారం చుట్టారు. ఏదో విధంగా మట్టిని వెలికి తీసి అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు అధికార టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. గతేడాది జరిగిన నీరు-చెట్టు పనుల్లో సుమారు 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీయగా.. దాంట్లో 80 శాతం మట్టి పచ్చ నేతల జేబులు నింపింది. మళ్లీ అదే సీన్ రిపీట్ కానుంది. విశాఖపట్నం: జిల్లాలో నీరు-చెట్టు కింద 100 ఎకరాలకు పైబడిన ఆయకట్టు ఉన్న మీడియం ఇరిగేషన్ టాంక్స్ (చెరువులు)లో పూడిక తీత పనులను ఇరిగేషన శాఖకు అప్పగించారు. ఈ విధంగా జిల్లాలో 236 చెరువులుంటే 2014 డిసెంబర్లో తొలి విడతలో రూ.4.97 కోట్ల అంచనాలతో 23 చెరువులకు, రెండో విడతలో రూ.18.30కోట్లతో మరో 69 చెరువుల్లో పూడికతీత పనులకు పరిపాలనామోదం ఇచ్చారు. ఇలా రెండు విడతల్లో 92 పనులు రూ.23.27కోట్లతో చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇరిగేషన్ శాఖాధికారుల నిర్లక్ష్య ఫలితంగా పనులు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగింది. నామమాత్రంగా జిల్లాలో కేవలం 73 చెరువుల పనులు ప్రారంభమైనప్పటికీ పది చెరువుల్లో కనీసం ఐదుశాతం పనులు కూడా జరగలేదు. మరో ఐదు చెరువుల్లో 20 శాతం పనులు మాత్రమే జరగడంతో వీటికి ఎలాంటి చెల్లింపులు చేయలేదు. మిగిలిన 58 చెరువుల్లో ఐదు చెరువుల్లో మాత్రం నూరు శాతం పనులు పూర్తయ్యాయి. 53 చెరువుల్లో 30 నుంచి 40 శాతం మేర పనులు జరగ్గా ఆ మేరకు చెల్లింపులు జరిపారు. ఈ విధంగా జిల్లాలో రూ.14.36కోట్లు 58 చెరువుల్లో పనులు చేపట్టగా పూర్తయిన పనులకు రూ.4.59కోట్ల మేర చెల్లింపులు జరిపారు. అధికారిక లెక్కల ప్రకారం 13.86 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక (మట్టి) వెలికితీసినట్టు లెక్కలు చెబుతుండగా అనధికారికంగా 18 నుంచి 20లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వేశారు. నిబంధనలు గాలికి.. ఈ మట్టిని పూర్తిగా స్థానిక అవసరాలకే ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, శ్మశానాలు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, రైతు పొలంగట్లు ఎత్తుచేసేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. స్థానిక సంస్థలకు సీనరేజ్ చెల్లించి వచ్చిన ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న స్థాయిలో మట్టిని ఇచ్చామని చెప్పు కొస్తున్నారు. జన్మభూమి కమిటీల పర్యవేక్షణలో జరిగిన ఈ పనుల్లో వెలికి తీసిన మట్టిలో 80 శాతం మట్టి టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ మట్టిని ఎలా వినియోగించారో చెప్పాల్సిందిగా కోరితే మాత్రం అధికారులు లెక్కలు చూపలేకపోయారు. కాని మట్టి అంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే రియల్ ఎస్టేట్ వెంచర్స్‌కు తరలిపోయింది. ఈ మట్టి, గ్రావెల్ అక్రమ అమ్మకాల ద్వారా రూ.10 కోట్లకు ైపైగా చేతులు మారినట్టు తెలుస్తోంది. జూన్‌లో కురిసిన వర్షాల నేపథ్యంలో నిలిచిన నీరుచెట్టు పనులు మళ్లీ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మూడు చెరువుల్లో పూడిక పనులు ప్రారంభమయ్యాయని ఎస్ఈ నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన చెరువుల్లో పూడిక తీత పనులను కూడా ఈ వారంలో పూర్తి స్థాయిలో పునఃప్రారంభిస్తామని చెప్పారు. -
నీరు-చెట్టు.. అంతా కనికట్టు!
ఐరాల మండలంలోని 28 పంచాయతీల్లో ఉన్న 38 చెరువుల్లో నీరు-చెట్టు పనులు చేస్తున్నారు. వీటి విలువ రూ.1.5కోట్లు. ఇక్కడ చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద గతంలో తవ్విన పాత గుంతలనే జేసీబీలతో మెరుగులుదిద్దారు. తెలుగుతమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి అధికారులతో కుమ్మక్కై రూ.30 లక్షల మేర బిల్లులు పొందారు. ఇందులో రూ.20 లక్షలు అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం తంతును కింది స్థాయి సిబ్బంది నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదేవిషయాన్ని కొంత మంది రైతులు ఫొటోలతో సహా పక్కా ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు శూన్యం. ఇది మచ్చుకు చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి జిల్లాలో కోకొల్లలు. నీరు-చెట్టు పథకం అంతా కనికట్టుగా మారింది. పచ్చ కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టే కల్పతరువుగా తయారైంది. తిరుపతి: జిల్లాలో నీరు- చెట్టు పథకం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో ఉపాధి హామీ పథకం కింద తీసిన పాత గుంతలు, రైతులు తమ పొలాలకు మట్టితోలిన గుంతలకే మెరుగులుదిద్ది అందినకాడికి అడ్డంగా దోచేస్తున్నారు. అసలు లక్ష్యం ఇదీ వ్యవసాయ శాఖఅధికారులు ముందుగా చెరువుల్లోని మట్టిని పరీక్షించాలి. భూసారాన్నిబట్టి పొలాలకు మట్టి తోలచ్చా.. లేదా నిర్ణయించి నివేదిక అందించాలి. ఆపై నీరు- చెట్టు పనులకు అనుమతివ్వాలి. అలా చేయడం వల్ల భూసారం, నీటి నిల్వలు పెంచవచ్చని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు ఏం జరుగుతోందంటే జిల్లాలోని ఏ ఒక్క చెరువులోనూ నిబంధనల మేరకు భూసార పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. అరకొర తీసే మట్టి సైతం కరువు నేపథ్యంలో రైతులు తోలుకునే పరిస్థితి లేదు. ఇదేఅదునుగా కాంట్రాక్టర్లు వెంచర్లతోపాటు ప్రవేటుగా ఇష్టం వచ్చిన చోటికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రైతుల పొలాలకు మట్టి తోలకుండానే తోలినట్లు, చెరువులో గుంతలు తవ్వకుండానే తవ్వినట్టు అధికారులతో కుమ్మక్కై రికార్డులు సృష్టిస్తున్నారు. బిల్లులు చేసుకుని జేబులు నింపుకుంటున్నారు. అంతా మభ్యపెట్టడమే.. పొరబాటున నీరు-చెట్టు పథకం పనులు తనిఖీలు చేస్తే పచ్చ కాంట్రాక్టర్లు మభ్యపెట్టడానికి పక్కాప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పొలాల మట్టి ఎక్కడని ప్రశ్నిస్తే పైరు పెట్టేందుకు రైతులు నెరిపేశారని, చెరువుల్లో మట్టితీసిన గుంతల కొలతలు వర్షం వచ్చి ఆనవాళ్లు పోయాయని చెప్పడానికి సన్నద్ధమైనట్లు సమాచారం. సంబంధిత అధికారులు కాసులకు కక్కూర్తిపడి పచ్చకాంట్రాక్టర్లకు వంతపాడేపనిలో నిమగ్నమయ్యారు. అవసరం లేకున్నా ఎకరాలకు 10 వేల రూపాయల ఆయకట్టు అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధన ఉంది. అందుకు భిన్నంగా రేణిగుంట మండలంలో లక్షల రూపాయలు కేటాయిస్తున్నారు. కోట్ర మంగళం చెరువుకు ఇలా రెండు సార్లు రూ.10.65 లక్షలు, రూ.4.85 లక్షలు మంజూరు చేశారు. ఎల్లమండ్యం చెరువుకు రూ.5 లక్షలు, రూ.8.26 లక్షలు మంజూరు చేశారు. ఇక్కడ నిధులు కేటాయించిన మేర ఆయకట్టు లేదు. ఏర్పేడు మండలంలో 45 ఎకరాల చెరువుకు ఇప్పకి వరకు మూడు సార్లు వరుసగా రూ.4.50 లక్షలు, రూ.26 లక్షలు, రూ.6 లక్షలు మంజూరు చేశారు. కుప్పంలో నీరు- చెట్టు నిధులతో మట్టి తొలగిస్తున్నారు. తరువాత కింద ఇసుక రావడంతో దానిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంతకుమునుపు క్యూబిక్ మట్టి తరలిస్తే 29 రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడు అది రూ.40 నుంచి రూ.80కు పెంచడంతో తెలుగు తమ్ముళ్లు పనులు దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు. -
నీరు-చెట్టు పేరుతో వ్యవసాయ బావుల పూడ్చివేత
రాజకీయ కక్షతో అధికారపార్టీ నేతల దౌర్జన్యం పంట ఒబ్బిళ్ల సమయంలో ప్రతాపం చూపారని బాధితుల ఆందోళన శ్రీకాళహస్తి రూరల్: నీరు-చెట్టు కార్యక్రవుం వుుసుగులో అధికార పార్టీకి చెందిన నాయుకులు రాజకీయ కక్షతో రైతుల బావులను పూడ్చేశారు. ఈ సంఘటన సోవువారం శ్రీకాళహస్తి వుండలం వుుచ్చివోలులో చోటుచేసుకుంది. వుుచ్చివోలు చెరువు కట్ట సమీపంలో పొరంబోకు స్థలంలో సువూరు 25 వుంది రైతులు బోర్లు, బావులు తవ్వుకుని పంటలు పండిస్తున్నారు. ఈ క్రమంలో నీరు-చెట్టు పథకం కింద రూ.20 లక్షలతో పనులు చేపట్టిన అధికార పార్టీ నాయకులు గత ఎన్నికల్లో తవుకు వ్యతిరేకంగా పనిచేశారనే నెపంతో ఏడుగురు రైతుల బావులను సోవువారం జేసీబీల సాయుంతో పూడ్చేశారు. బావులకు అవుర్చిన విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు, ఆరుుల్ ఇంజిన్లు, పైపులైన్లు ధ్వంసం చేశారు. దాంతో బిళ్లు క్రిష్ణయ్యుయూదవ్, బిళ్లు వుురళీయూదవ్, బిళ్లు రావుచంద్రయ్యుయూదవ్, బిళ్లు గురవయ్యుయూదవ్, అక్కుపల్లి నరసింహులు యూదవ్, రవుణయ్యుయూదవ్, నరసయ్యు తమ 25 ఎకరాల పొలంలో సాగుచేసిన వేరుశనగపంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. పంట చేతికందే తరుణంలో తవుపై ప్రతాపం చూపడం భావ్యం కాదని, పంట ఒబ్బిళ్ల తర్వాత పనులు చేసుకోవాలని కాళ్లావేళ్లా పడి ప్రాధేయుపడినా కనికరం చూపలేదని బాధితులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వురో 18వుంది అగ్రవర్ణాల బడా రైతుల బావులను వూత్రం పూడ్చకుండా వదిలేశారని వారు చెప్పారు. -
నీరు-చెట్టు బిల్లుల కోసం తమ్ముళ్ల పరుగులు
పాత తేదీ వేసి బిల్లులు చేయాలని ఇంజినీర్లపై మంత్రి ఒత్తిడి బిజీబిజీగా ఇరిగేషన్ ఇంజినీర్లు బిల్లులు చేయడంలో నిమగ్నం కోర్టు ఉత్తర్వులు వచ్చేలోపే పీఏవోకు బిల్లులు పంపేలా చర్యలు పనులు నిలిపేయాల్సి వస్తుందనే ఆందోళనలో కాంట్రాక్టర్లు తిరుపతి: నీరు-చెట్టు పనులను అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిపై చేపట్టడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపిన నేపథ్యం లో తెలుగు తమ్ముళ్లు షాక్‌కు గురయ్యా రు. పనులను నిలిపివేస్తే అసలుకే మోసం వస్తుందని, పెట్టిన అరకొర పెట్టుబడులు మట్టిలో కలిసిపోతాయని ‘తెలుగు’ కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. ఎలాగోలా బిల్లులు చేయించుకుని అందిన కాడికి నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే కొద్దిమేర పనులు చేయగా, మరికొంత మంది ఇప్పుడిప్పుడే పనులను ప్రారంభించారు. వీరంతా ఎలాగోలా బిల్లుల ను చేయించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు మంత్రి వద్ద కెళ్లి తమ గోడు వెల్లబోసుకోన్నట్లు సమాచారం. దీంతో మంత్రి ఇరిగేషన్ ఎస్ఈ, ఆయా డివిజన్ల ఈఈలకు పాత తేదీలు వేసి బిల్లులు చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లులు చేస్తే మళ్లీ ఎక్కడ ఇరుక్కుపోతామోనని కొంతమంది అధికారులు ఆందోళన చెందుతున్నట్లు ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంజినీర్లలపై ఒత్తిడి... చోటా మోటా నాయకులు డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ ఇంజినీర్లపై బిల్లు లు చేయాలని ఒత్తిడి తెస్త్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి కొంతమంది ఇంజనీర్లు పాత తేదీలు వేసి బిల్లులు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సందట్లో సడేమియాగా కొంతమంది పనులు చేయకుండానే పాత గుంతలకు కొత్త మెరుగులు దిద్ది అందినకాడికి దోచుకోనేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ సిబ్బందికి డబ్బులు ఎరగా చూపి బిల్లులు నొక్కేయాలని తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తం మీద పనులు చేస్తే ఎక్కడ ఇరుక్కు పోతామో, బిల్లులు వస్తాయో రావోననే భయం తెలుగు తమ్ముళ్లను పట్టి పీడిస్తోంది. మరోవైపు ఉన్న పళంగా రెండు రోజుల్లోనే కోట్ల రూపాయల బిల్లులు పీఏవో ఆఫీసుకు చేరి చెల్లింపు జరిపితే అడ్డంగా దొరికిపోతామేమోనని ఇంజినీర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఇంతవరకు కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, కోర్టు ఉత్తర్వులను బట్టి కౌంటర్ దాఖలు చేస్తామని ఇరిగేషన్ ఎస్ఈ శ్రీరామకృష్ణ తెలిపారు. -
వాడీవేడిగా...
జెడ్పీ సమావేశం గరంగరం మచిలీపట్నం : మచిలీపట్నంలో మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశం గరంగరంగా సాగింది. నీరు-చెట్టు, సాగునీటి విడుదల అంశాలపై పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఖరీఫ్‌కు సాగునీటి విడుదల అంశంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీరు లేదని, క ృష్ణాడెల్టాకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15న నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తామని చెప్పడం గమనార్హం. పులిచింతల ప్రాజెక్టులో నాలుగైదు టీఎంసీల నీరు ఉందని, ఈ నీటిని విడుదల చేస్తే 15 రోజుల పాటు సరిపోతుందని, ఆ తరువాత ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశం లేదని మంత్రి తెలిపారు. ఈ లెక్కన క ృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదని చెప్పకనే చెప్పారు. చైర్పర్సన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షం నీరు-చెట్టులో టీడీపీ కార్యకర్తలు, నాయకులు 70 శాతం మేర అవినీతికి పాల్పడ్డారని సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. దీనిపై చైర్పర్సన్ అనూరాధ స్పందిస్తూ ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అర్హత లేదని, ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో చైర్పర్సన్ తీరుపై పాలకపక్ష సభ్యులు మండిపడ్డారు. ఇద్దరు సభ్యులే ఉన్నా పాలకపక్షాన్ని నిలదీస్తారని, మాట్లాడొద్దని అనడం సరికాదని హితవు పలికారు. ప్రైవేటు పాఠశాలలను వేధించొద్దు... విద్యాశాఖపై సమీక్ష సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను నోటీసులు ఇచ్చి వేధించవద్దని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. దీనిపై జెడ్పీ ప్రతిపక్ష నేత తాతినేని పద్మావతి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పక్కనపెట్టి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను సమర్థించటం సమంజసంగా లేదని విమర్శించారు. పింఛన్ల సొమ్ము దాచుకోవాలా? పింఛన్ల పంపిణీ గందరగోళంగా మారిందని, కొందరికి బ్యాంకుల ద్వారా.. మరికొందరికి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోల ద్వారా ఇస్తున్నారని పెనమలూరు, గన్నవరం ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వల్లభనేని వంశీతో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. నిరుపేదలకు పింఛన్లు ఇస్తుంటే ఆ సొమ్మును దాచుకోవాలని అంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, పింఛనుదారు తనకు ఎంత అవసరమో అంతే నగదు తీసుకునే అవకాశముందని చెప్పారు. మిగిలిన సొమ్ము అవసరమైన సమయంలో తీసుకోవచ్చన్నారు. ఈ పద్ధతిని జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ అభినందించారని వివరించారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ వేలిముద్ర పడని వారికి పింఛను ఇవ్వటం లేదని, జిల్లాలో ఎంతమందికి ఈ రకంగా నిలిపివేశారో వివరాలు చెప్పాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ గత జెడ్పీ సమావేశం నాటికి 23 వేల మందికి పింఛన్లు వివిధ కారణాలతో నిలిచిపోయాయని, ఆ సంఖ్యను 10,400కు తీసుకువచ్చామన్నారు. అనంతరం జెడ్పీ పాలకవర్గం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ను దుశ్శాలువాలతో కార్యాలయ సిబ్బంది సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జేసీ గంధం చంద్రుడు, జేసీ-2 ఒంగోలు శేషయ్య, ట్రైనీ కలెక్టర్ సలోమి, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ శాయన పుష్పావతి పాల్గొన్నారు. ఇసుక సీనరేజ్ నిధులు ఎప్పుడిస్తారు జిల్లాలో ఇసుక క్వారీలను కొన్నింటిని మూసివేశారని, సీనరేజ్ నిధులను ప్రభుత్వం విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని జెడ్పీ ప్రతిపక్ష నేత తాతినేని పద్మావతి సమావేశం దృష్టికి తీసుకురాగా, ఇసుక విక్రయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి ఉమ బదులిచ్చారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గత ఏడెనిమిది నెలలుగా నూజివీడు పరిసర ప్రాంతాలకు ఇసుక అందించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవటం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వాగులు, వంకల నుంచి ఇసుకను విక్రయిస్తున్నారని, మన జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని అడ్డుకుంటున్నారని చెప్పారు. మోపిదేవి జెడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు మాట్లాడుతూ బొబ్బర్లంక, మోపిదేవి రేవుల సమీపంలో సరిహద్దులు నిర్ణయించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. నూజివీడు జెడ్పీటీసీ బాణావతు రాజు మాట్లాడుతూ గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న అటవీ భూములను వెనక్కి తీసుకుంటారనే అపోహ ప్రజల్లో ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి ఉమా మాట్లాడుతూ పేదల భూములను వెనక్కి తీసుకోమని, భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకునేందుకే సర్వే జరుగుతోందని చెప్పారు. పాఠశాలల్లో సౌకర్యాలు, వసతుల సమస్యలపై ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, పదో తరగతి ఫలితాల్లో జిల్లా పదో స్థానంలో నిలవడంపై ఎమ్మెల్సీ ఏఎస్ రామక ృష్ణ సమావేశంలో ప్రస్తావించారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు తాతినేని పద్మావతి ప్రజాసమస్యలపై జిల్లా పరిషత్ సమావేశంలో ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ చేస్తున్నారని జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి అన్నారు. వైఎస్సార్ సీపీకి తక్కువ మంది సభ్యులే ఉన్నారని, వారికి మాట్లాడే అర్హత లేదని సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ వ్యాఖ్యానించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పాలకపక్షం వక్రమార్గంలో నడుస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిలదీయటం సహజమని చెప్పారు. -
మట్టి మాఫియా
జోరుగా వ్యాపారం చేస్తున్న అధికార పార్టీ నేతలు పరిమితులు లేకుండా తవ్వకాలు రైతులే పెట్టుబడిగా దోపిడీకి తెరతీసిన వైనం తమ్ముళ్లకు వరంగా మారిన నీరు-చెట్టు విజయవాడ : ఇన్నాళ్లూ ఇసుక దందా చెలాయించిన అధికార పార్టీ నేతలు తాజాగా మట్టి మాఫియాకు తెరతీశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న నీరు-చెట్టు పథకాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలోని ఇరిగేషన్ చెరువుల్లో మట్టిని తవ్వేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ స్థలాల్లోనూ పోసుకుంటారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా వారికి వత్తాసు పలుకుతోంది. దీంతో యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు చెరువుల్లోని మట్టి త రలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 5 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇవికాక మరో ఐదు రెట్లు రైతుల నుంచి టీడీపీ నాయకులు వసూలు చేసి రూ. 30 కోట్లు దోచేస్తున్నారు. 650 చెరువులు ఎండబెట్టారు.. జిల్లాలోని 924 చెరువుల్లో చెట్టు-నీరు కార్యక్రమాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 650 చెరువులను ఎండబెట్టారు. చెరువుల్లో పూడికతీత పనులు సజావుగా సాగాలంటే నీరు లేకుండా ఎండబెట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత చెరువుల్లో మట్టిని సులువుగా తవ్వేందుకు వీలవుతుంది. చెరువుల్లో మట్టి తవ్వకాలు మే నెలాఖరులోపు పూర్తి కావాల్సి ఉంది. దోపిడీ సాగుతున్నది ఇలా.. చెరువుల్లో మట్టిని తవ్వేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ ఎవరి ఇష్టానుసారం వారు తవ్వుకుంటున్నారు. చెరువుల్లో పేరుకుపోయిన ఒండ్రు మట్టిని మాత్రమే తవ్వాలి. ఎంత లోతంటే అంత లోతు తవ్వేందుకు వీల్లేదు. ప్రభుత్వం కేటాయించిన ఐదు కోట్లతో పొక్లెయిన్లు పెట్టి మట్టిని తవ్వి రైతుల పొలాలకు చేర్చాలి. ఇలా చేసినందుకు క్యూబిక్ మీటర్‌కు ప్రభుత్వం రూ. 29 ఇస్తుంది. ఈ లెక్కన మూడు క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే ట్రాక్టర్ నిండు తుంది. అంటే ఒక్క ట్రాక్టర్‌కు మట్టి నింపినందుకు రూ. 87 పొక్లెయిన్‌కు చెల్లించాలి. అయితే స్థానికంగా ఉండే టీడీపీ నేతలు పొక్లెయిన్ యజమానితో మాట్లాడి ట్రాక్టర్‌కు 150 నుంచి 200 రూపాయలు రైతుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. పొక్లెయినర్ యజ మానికి నామమాత్రంగా ముట్టజెప్పి మిగతా మొత్తం అంటే దాదాపు రూ. 25 కోట్లు నొక్కేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన ఐదు కోట్లు ఆ శాఖ మంత్రి జేబులోకి వెళుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాటించని నిబంధనలు చెరువుల్లో మట్టిని తవ్వేటప్పుడు టెక్నికల్ నిబంధనలు పాటించాలి. ఇంజినీర్లు చెప్పిన విధంగా ఒండ్రు మట్టిని మాత్రమే తవ్వాలి. చెరువులో గుంతలు తీయకూడదు. ఆయకట్టును దృష్టిలో ఉంచుకుని చెరువు లోతట్టును డిజైన్ చేస్తారు. అంతకుమించి తవ్వితే తూ ముకు నీరు అందే అవకాశం ఉండదు. కొన్ని చోట్ల చెరువుల్లో ఇసుక పొరలుంటాయి. ఆ పొరల వరకు తవ్వితే చెరువులో నీరు నిలబడదు. ఆవిరైపోతుంది. దీనివల్ల రైతులు నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇవన్నీ అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదు. ఇక చెరువులకు వర్షపు నీరందించే సప్లై చానల్స్ పూడిక తీయించాలి. వాటిపై అధికారులు దృష్టిపెట్టడంలేదు. అడ్డం తిరిగితే బెదిరింపులు అక్రమంగా మట్టి తరలించవద్దని, నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వవద్దని రైతులు అడ్డం తిరిగితే రెవెన్యూ అధికారులతో గ్రామస్తులను బెదిరిస్తున్నారు. సుమారు 70, 80 ఏళ్ల నుంచి చెరువు చివర ఆక్రమించుకుని సాగుచేసుకుని బతుకుతున్న పేదల పొలాలను విడగొడతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం, గన్నవరం, నూజివీడు, ఉయ్యూరు, తదితర చోట్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గన్నవవరం ఏరియాలో పాతపాడు, గోపవరపుగూడెం, పురుషోత్తపట్నం, ముస్తాబాద, బల్లిపర్రు తదితర ప్రాంతాల్లో ప్రతి రోజూ గొడవలు జరుగుతున్నాయి. -
యంత్రాలతోనే ‘నీరు-చెట్టు’
అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం కూలీల ‘ఉపాధి’కి గండి ఖజానాపై రూ.65 కోట్ల భారం తెలుగు తమ్ముళ్ల కోసమేనని అనుమానాలు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం తమ్ముళ్లకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు-చెట్టు కార్యక్రమాన్ని లక్ష్యంగా ఎంచుకొన్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే.. చెరువుల్లో పూడికతీత పనులకు యంత్రాలనే వినియోగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫలితంగా తెలుగు తమ్ముళ్లకు ఆర్థికంగా ప్రయోజనం సమకూరుతుండగా.. రాష్ట్ర ఖజానాపై రూ.65 కోట్ల భారం పడనుంది. అదేసమయంలో.. ఉపాధి హామీ పథకం కూలీలు పనులు కోల్పోయి.. పస్తులుండే పరిస్థితి ఏర్పడనుంది. సాధారణంగా చెరువుల్లో పూడికతీత పనులను వేసవి సీజన్లో ఉపాధి కింద కూలీల ద్వారా చేయిస్తారు.ఈ పనులు చేపట్టేందుకు అయ్యే ఖర్చులో 90 శాతం నిధులను కేంద్ర ప్రభు త్వమే మంజూరు చేస్తుంది. సీఎం చంద్రబాబు మాత్రం ఉపాధి హామీ కింద కూలీల ద్వారా ఈ పనులు చేయించేందుకు ఇష్టపడడం లేదు. యంత్రాలను వినియోగించాలని ఆదేశించారు. ఫలితంగా యంత్రాలు వినియోగానికి గాను ప్రభుత్వం భారీ మొత్తంలో నగదును వాటి యజమానులకు చెల్లించనుంది. దీంతో ఆయా యంత్రాలను టీడీపీకి చెందిన వారే ఏర్పాటు చేసే అవకాశముందని, ఫలితంగా భారీగా ఆర్థిక ప్రయోజనం పొందవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.సీఎం ఆదేశాలతో ఖజానాపై రూ.65 కోట్ల భారం పడనుందని అధికారులు పేర్కొంటున్నారు.పూడికతీతకు జిల్లాకు రూ. 5 కోట్ల చొప్పున రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ. 65 కోట్లు ఖర్చుకానున్నాయని వారు నిర్ణయించారు. అదేవిధంగా నీరు-చెట్టు కార్యక్రమ ప్రచారానికి మరో రూ.5 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం రూ.70 కోట్లను విడుదల చేయాలని వారు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. అధికారుల్లో విస్మయం! పూడికతీతను యంత్రాలతో చేయించాలన్న సీఎం నిర్ణయంపై సంబంధిత అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర నిధులను వినియోగించుకోకుండా రాష్ట్ర ఖజానాకు భారమయ్యేలా నిధులు విడుదల చేయాలని కోరడం పట్ల ఆర్థిక శాఖ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. -
నీరు-చెట్టు ద్వారా 10 లక్షల మొక్కలు
* 111 మున్సిపాలిటీల్లో 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు * రేపు నెల్లూరులో శ్రీకారం చుట్ట నున్న బాబు, వెంకయ్య సాక్షి, హైదరాబాద్: నీరు-చెట్టు అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 111 మున్సిపాలిటీల పరిధిలో ఈనెల 24 నుంచి సెప్టెంబర్ 7 వరకూ 10 లక్షల మొక్కలను నాటుతున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నాటిన మొక్కల్లో 90 శాతం మొక్కలు బతికి చెట్లుగా పెరగాలనే ఆశయంతో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈనెల 24న నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మున్సిపాలిటీల పరిధిలో చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా నివాస యోగ్యత పెరిగి కాలుష్యం తగుతుందని అన్నారు. ఆస్పత్రులు, బస్టాండ్లు, పార్కులు, పాఠశాలలు, శ్మశానవాటికలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. నాటేందుకు సరిపడా మొక్కల కోసం అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడామని, సరఫరా చేసేందుకు మంత్రి హామీ ఇచ్చారని నారాయణ పేర్కొన్నారు. బ్యాంకులు, చారిటీ సంస్థలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు మొక్కలు నాటే కార్యక్రమానికి సాయం చేయాలని కోరారు.