నీరు–చెట్టు పనుల్లో అవినీతిని నిరూపిస్తా
-
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి
-
సవాలును స్వీకరించలేక టీడీపీ నేతలు గైర్హాజరు
కోరుకొండ :
నీరు–చెట్టు పథకంలో చేసిన పనుల్లో టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, ఆధారాలతో నిరూపిస్తామని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కోరుకొండ శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం వద్ద ఈ మేరకు ప్రమాణం చేయడానికి ఉదయం 10 గంటలకు జక్కంపూడి విజయలక్ష్మితో పాటు మూడు మండలాల వైఎస్సార్‌సీపీ నేతలు వచ్చారు. 12 గంటల వరకు చూసినా టీడీపీ నేతలుగాని, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కానీ రాలేదు. ఇటీవల ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరు–చెట్టు పనుల్లో అవకతవకలు జరగలేదని అందుకు శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని, జరిగిందని మీరు చేస్తారా అంటూ ప్రగల్భాలు పలికి నేడు ప్రమాణానికి రాలేదని జక్కంపూడి పేర్కొన్నారు. స్వామి సన్నిధిలో ప్రమాణం చేసి, బయట స్థలంలో ఎప్పుడు సదస్సు పెట్టినా తాను వచ్చి అవినీతిని నిరుపిస్తానని ఆమె అన్నారు. అనంతరం రోడ్డుపై టీడీపీ నేతల పనితీరుకు నిరసనగా నినాదాలు చేశారు.
ప్రజాధనాన్ని దోచేస్తున్నారు
మంగళవారం కోరుకొండలో జక్కంపూడి విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన దోపిడీమయంగా మారిందన్నారు. మధురపూడిలో రైతులు విమానాశ్రయానికి భూములు ఇచ్చారని, వారిలో పార్టీ సానుభూతిపరులైన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల కన్వీనర్లు వుల్లి బుజ్జిబాబు, డాక్టర్ బాబు, మండారపు వీర్రాజు, జిల్లా కార్యదర్శులు అయిల శ్రీను, చల్లమళ్ల సుజీరాజు, పేపకాయల విష్ణుమూర్తి. జ్యోతుల లక్ష్మినారాయణ, వాసంశెట్టి పెద్దవెంకన్న, యూత్ రాష్ట్ర కార్యదర్శి బొరుసు బద్రి, మండల యూత్ కార్యదర్శి అడపా శ్రీను తదితరులున్నారు.