నీరు-చెట్టుపై గరంగరం
♦ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం
♦ ఆ పనులపై విచారణ చేస్తామన్న కలెక్టర్
♦ ఇళ్ల ఎంపికలో కమిటీ సభ్యుల సంతకాలు లేకుండా తీర్మానంపై వాదోపవాదాలు
♦ జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని సజావుగా నడిపించిన కలెక్టర్
సాక్షి, కడప : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిరసనలు, వాదోపవాదాలతో వాడీవేడిగా సాగింది. పండ్లతోటల నష్ట పరిహారంతోపాటు నీరు-చెట్టు పనులకు సంబంధించి అవకతవకలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపు ప్రజాప్రతినిధుల మధ్య రగడ కొనసాగింది. శుక్రవారం కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది.
కలెక్టర్ కేవీ సత్యనారాయణ హాజరుకాగా, జేసీ శ్వేత తెవతీయ జెడ్పీ సీఈఓ హోదాలో సభను నడిపించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేలోపే టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు అడ్డుతగలడంతో రచ్చ రాజుకుంది. పదేపదే తనకు మైకు ఇవ్వాలంటూ టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్ పట్టుబట్టిన వ్యవహారం జెడ్పీ చైర్మన్ గూడూరు రవి తీవ్రస్థాయిలో స్పందించారు. అరగంటపాటు వాదోపవాదాలు సాగినా అనంతరం ప్రశాంతంగా సమావేశం కొనసాగింది.
నీరు-చెట్టు, ఇళ్ల మంజూరుపై వాగ్వాదం
సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుగా పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు వెంగముని, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వడగండ్ల వాన తో అరటితోపాటు ఇతర పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతోందని దుమ్మెత్తిపోశారు. దీంతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెప్పబోగా వెంటనే అందుకున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు రైతులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలోనే వారి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇళ్ల మంజూరులో ఇదే ం పద్ధతి
ఒంటిమిట్ట మండలంలోని మాధవరానికి 17 ఇళ్లు మంజూరుచేశారని, అయితే సర్పంచ్, సెక్రెటరీ లేకుండా సభ్యుల్లో ఇద్దరు మాత్రమే సంతకాలు చేసి తీర్మానం పంపారని దానిని ఎలా అమోదిస్తారంటూ జెడ్పీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దానికి సమాధానం చెప్పాలని హౌసింగ్ అధికారులను కోర గా, మధ్యలో టీడీపీ నేతలు జోక్యం చేసుకోవడంతో మాటలయుద్ధం సాగింది. ఒంటిమిట్ట మండలంలో ఉపాధిలో చేసిన పనులపైనే నీరు-చెట్టులో మళ్లీ పనులు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సభను సజావుగా నడిపించిన కలెక్టర్
జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కలెక్టర్ సత్యనారాయణ సజావుగా నడిపించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగిన సందర్భంలో జోక్యం చేసుకుం టూ సమస్యను చక్కదిద్దుతూ వచ్చారు. జెడ్పీటీసీలు అడిగిన ప్రశ్నలకు కూడా స్వయంగా కలెక్టరే సమాధానాలు ఇవ్వడంతోపాటు పరి ష్కారానికి మార్గం చూపారు. పథకాలకు సం బంధించిన లబ్ధిదారుల విషయంలో ఖచ్చితం గా అర్హులకే అందాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు అందకూడదని, ఈ విషయంలో ఎవరినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
నిధుల దుర్వినియోగంపై దద్దరిల్లిన జెడ్పీ
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో జరుగుతున్న నీరు చెట్టు పనుల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సంబంధిత పనులపై విజిలెన్సు విచారణ జరిపించాలని జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో చేసిన తీర్మానాన్ని మెజారిటీ సభ్యుల ఆమోదం తెలిపారు. శుక్రవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఇన్‌చార్జు సీఈఓ, జేసీ శ్వేతా అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా కలెక్టర్ కేవీ సత్యనారాయణ సభకు పరిచయం చేసుకున్నారు. అనంతరం ఈ ఏడాది పదవ తరగతిలో రాష్ట్రంలో కడప జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు డీఈఓ ప్రతాప్‌రెడ్డిని అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు.
పంటల బీమాను అందజేయాలి: ఎంపీ అవినాష్‌రెడ్డి
జిల్లాలో 2013-14లో జరిగిన పంటనష్టం ఇన్సూరెన్సును ఇచ్చి రైతన్నలను ఆదుకోవాలని ఎంపీ అవినాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా 55 వేలమంది రైతులకు పంటలనష్టబీమా రావాల్సి ఉండగా ఇందులో 29 వేలమందికి ఇన్స్యూరెన్సు వచ్చిందన్నారు. ఇటీవల మరో 11 వేలమందికి కూడా వచ్చిందని.. ఇంకా 16 వేలమందికి రావాల్సి ఉందన్నారు. వారికి సంబంధించిన పత్రాలో సమస్యలు ఉన్నాయని తెలిపారన్నారు. సంబంధిత విషయంలో కలెక్టర్ చోరవ తీసుకుని జాబితాను మళ్లీ పంపాలన్నారు. అలాగే అరటి పంటకు కూడా బీమాను వర్తింపచేయాలన్నారు. అరటికి పంటనష్ట జరిగితే హెక్టారుకు 24 వేలు ఇస్తున్నారని ఇది ఏమూలకు సరిపోదన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం: రాచమల్లు
జిల్లాలో జరిగిన నీరుచెట్టు పనుల్లో అవినీతి రాజ్యమేలుతొందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. చాలాచోట్ల వందకు పదిశాతం మేరకే పనులు చేశారని మిగతా సొమ్మంతా తెలుగుతమ్ముళ్ల జేబులు నింపేందుకేనన్నారు. ఇదంతా అధికారులకు తెలియదా అని నిలదీశారు. సంబంధిత పనులపై విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విత్తనాలు తక్కువ ఇస్తే ఎలా: రవీంద్రనాథరెడ్డి
ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే వేరుశనక్కాయలు రైతులకు సరిపడవని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ రెడ్డి అన్నారు. ఎకరాకు 60 సేర్ల విత్తనాలు అవసరం అయితే మీరు ఇచ్చే ఒక బస్తా ఎలా సరిపోతాయన్నారు. రైతులకు సరిపడ విత్తనాలను ఇవ్వాలని అవికూడా నారాయణి రకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మామిడికి గిట్టుబాటు ధరను కల్పించాలి: శ్రీకాంత్‌రెడ్డి
రైతన్నలు పండించే మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు. దీంతోపాటు రైతులకు సంబంధించి బ్యాంకుల్లో ఉన్న రుణాలను మొత్తం చెల్లించి మళ్లీ తీసుకొంటున్నారన్నారు. ఇలా చేయటం వల్ల రైతులు నష్టపోయి.. బయట బ్రోకర్లు బాగుపడుతున్నారని దీనిపై రైతులకు న్యాయం చేయాలన్నారు. స్పందించిన కలెక్టర్ పరిశీలిస్తామన్నారు. వెలిగళ్లు ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు ఇస్తే పంటల సాగుకు బాసటగా ఉంటుందన్నారు.
నీరు-చెట్టులో అవినీతి జరగలేదంటే రాజీనామా చేస్తా: రఘురామిరెడ్డి
ప్రభుత్వ తలపెట్టిన నీరు-చెట్టులో అవినీతి జరగలేదని అధికారులు నిరూపిస్తే తమ పదవికి రాజీనామా చేస్తానని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో విపరీతమైన కరువుతో రైతులు అల్లాడుతున్నారన్నారు. రైతులకు సరైన విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు లేవు. కానీ తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకే చంద్రబాబు నీరు-చెట్టును ప్రవేశ పెట్టారన్నారు. ఇది చంద్రబాబు సొమ్మా, పచ్చ చొక్కాల దోపిడీనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యాన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి: కొరముట్ల శ్రీనివాసులు
కోడూరు ప్రాంతంలో ఉద్యాన పంటల సాగు అధికమని కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. గాలులకు, వర్షాలకు పంటన ష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకూ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పండ్ల తోటకు పంట ఇన్స్యూరెన్సు ఇస్తే బాగుంటుందని తెలిపారు.
మండల కమిటీ ఆమోదం లేకుండానే పనులా: జెడ్పీ ఉపాధ్యక్షుడు
ఇరిగేషన్ పనులకు సంబంధించి సర్పంచ్ రెజెల్యూషన్ లేకుండానే పనులను ఇస్తున్నారని జెడ్పీ ఉపాధ్యక్షుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కమిటీలో ఉన్న సభ్యలలో ఒకరిద్దరు మాత్రమే సంతకాలు తీసుకుని పనులను మంజూరు చేస్తున్నారన్నారు. ఒంటిమిట్ట మండలంలో హౌసింగ్‌కు సంబంధించి గ్రామసభ తీర్మాణం లేకుండానే 17 ఇళ్లను మంజూరు చే శారని వీటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఐసైన్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ గోవిందరెడ్డి
జిల్లాలో అసైన్‌మెంట్ కమిటీలు లేక చాలా మంది రైతలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అన్నారు. గత రెండేళ్ల నుంచి అసైన్ క మిటీ లేదన్నారు. అలాగే టీఎఫ్‌సీ , జనరల్ ఫండ్ కింద వచ్చిన పనులకు నిధులు రాలేదన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనులకు కూడా నిధులు రాలేదన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ సంబంధిత పనుల్లో కొన్ని కోర్టులో ఉన్నాయని వాటి పరిధిలోని పనులకు మాత్రమే బిల్లులు ఇవ్వాలని వచ్చిందన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న పనులకు బిల్లులు ఇచ్చే విషయమై పరిశీలిస్తామన్నారు.
అక్రమ ఇసుక తరలింపును అరికట్టాలి: ఎమ్మెల్సీ దేవగుడి
ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతుంది కానీ 99 శాతం అక్రమంగానే తరలిపోతుందని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి అన్నారు. గ్రామానికి ఇద్దరు రౌడీలు జతై మామాళ్లు వసూలు చేస్తున్నారన్నారు. సంబంధిత క్వారీలను వెంటనే రద్దు చేయాలన్నారు.