పాత తేదీ వేసి బిల్లులు చేయాలని ఇంజినీర్లపై మంత్రి ఒత్తిడి
బిజీబిజీగా ఇరిగేషన్ ఇంజినీర్లు బిల్లులు చేయడంలో నిమగ్నం
కోర్టు ఉత్తర్వులు వచ్చేలోపే పీఏవోకు బిల్లులు పంపేలా చర్యలు
పనులు నిలిపేయాల్సి వస్తుందనే ఆందోళనలో కాంట్రాక్టర్లు
తిరుపతి: నీరు-చెట్టు పనులను అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిపై చేపట్టడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపిన నేపథ్యం లో తెలుగు తమ్ముళ్లు షాక్‌కు గురయ్యా రు. పనులను నిలిపివేస్తే అసలుకే మోసం వస్తుందని, పెట్టిన అరకొర పెట్టుబడులు మట్టిలో కలిసిపోతాయని ‘తెలుగు’ కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. ఎలాగోలా బిల్లులు చేయించుకుని అందిన కాడికి నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే కొద్దిమేర పనులు చేయగా, మరికొంత మంది ఇప్పుడిప్పుడే పనులను ప్రారంభించారు. వీరంతా ఎలాగోలా బిల్లుల ను చేయించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లు మంత్రి వద్ద కెళ్లి తమ గోడు వెల్లబోసుకోన్నట్లు సమాచారం. దీంతో మంత్రి ఇరిగేషన్ ఎస్‌ఈ, ఆయా డివిజన్ల ఈఈలకు పాత తేదీలు వేసి బిల్లులు చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లులు చేస్తే మళ్లీ ఎక్కడ ఇరుక్కుపోతామోనని కొంతమంది అధికారులు ఆందోళన చెందుతున్నట్లు ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇంజినీర్లలపై ఒత్తిడి...
చోటా మోటా నాయకులు డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ ఇంజినీర్లపై బిల్లు లు చేయాలని ఒత్తిడి తెస్త్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి కొంతమంది ఇంజనీర్లు పాత తేదీలు వేసి బిల్లులు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సందట్లో సడేమియాగా కొంతమంది పనులు చేయకుండానే పాత గుంతలకు కొత్త మెరుగులు దిద్ది అందినకాడికి దోచుకోనేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ సిబ్బందికి డబ్బులు ఎరగా చూపి బిల్లులు నొక్కేయాలని తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తం మీద పనులు చేస్తే ఎక్కడ ఇరుక్కు పోతామో, బిల్లులు వస్తాయో రావోననే భయం తెలుగు తమ్ముళ్లను పట్టి పీడిస్తోంది. మరోవైపు ఉన్న పళంగా రెండు రోజుల్లోనే కోట్ల రూపాయల బిల్లులు పీఏవో ఆఫీసుకు చేరి చెల్లింపు జరిపితే అడ్డంగా దొరికిపోతామేమోనని ఇంజినీర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఇంతవరకు కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, కోర్టు ఉత్తర్వులను బట్టి కౌంటర్ దాఖలు చేస్తామని ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీరామకృష్ణ తెలిపారు.
నీరు-చెట్టు బిల్లుల కోసం తమ్ముళ్ల పరుగులు
Published Sat, Jul 25 2015 2:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement