వాడీవేడిగా...
జెడ్పీ సమావేశం గరంగరం
మచిలీపట్నం : మచిలీపట్నంలో మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశం గరంగరంగా సాగింది. నీరు-చెట్టు, సాగునీటి విడుదల అంశాలపై పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఖరీఫ్‌కు సాగునీటి విడుదల అంశంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీరు లేదని, క ృష్ణాడెల్టాకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15న నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తామని చెప్పడం గమనార్హం. పులిచింతల ప్రాజెక్టులో నాలుగైదు టీఎంసీల నీరు ఉందని, ఈ నీటిని విడుదల చేస్తే 15 రోజుల పాటు సరిపోతుందని, ఆ తరువాత ఎగువ నుంచి నీరు వచ్చే అవకాశం లేదని మంత్రి తెలిపారు. ఈ లెక్కన క ృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదని చెప్పకనే చెప్పారు.
చైర్‌పర్సన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షం
నీరు-చెట్టులో టీడీపీ కార్యకర్తలు, నాయకులు 70 శాతం మేర అవినీతికి పాల్పడ్డారని సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. దీనిపై చైర్‌పర్సన్ అనూరాధ స్పందిస్తూ ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అర్హత లేదని, ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో చైర్‌పర్సన్ తీరుపై పాలకపక్ష సభ్యులు మండిపడ్డారు. ఇద్దరు సభ్యులే ఉన్నా పాలకపక్షాన్ని నిలదీస్తారని, మాట్లాడొద్దని అనడం సరికాదని హితవు పలికారు.
ప్రైవేటు పాఠశాలలను వేధించొద్దు...
విద్యాశాఖపై సమీక్ష సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను నోటీసులు ఇచ్చి వేధించవద్దని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. దీనిపై జెడ్పీ ప్రతిపక్ష నేత తాతినేని పద్మావతి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పక్కనపెట్టి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను సమర్థించటం సమంజసంగా లేదని విమర్శించారు.
పింఛన్ల సొమ్ము దాచుకోవాలా?
పింఛన్ల పంపిణీ గందరగోళంగా మారిందని, కొందరికి బ్యాంకుల ద్వారా.. మరికొందరికి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోల ద్వారా ఇస్తున్నారని పెనమలూరు, గన్నవరం ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వల్లభనేని వంశీతో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. నిరుపేదలకు పింఛన్లు ఇస్తుంటే ఆ సొమ్మును దాచుకోవాలని అంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, పింఛనుదారు తనకు ఎంత అవసరమో అంతే నగదు తీసుకునే అవకాశముందని చెప్పారు.
మిగిలిన సొమ్ము అవసరమైన సమయంలో తీసుకోవచ్చన్నారు. ఈ పద్ధతిని జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ అభినందించారని వివరించారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ వేలిముద్ర పడని వారికి పింఛను ఇవ్వటం లేదని, జిల్లాలో ఎంతమందికి ఈ రకంగా నిలిపివేశారో వివరాలు చెప్పాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ గత జెడ్పీ సమావేశం నాటికి 23 వేల మందికి పింఛన్లు వివిధ కారణాలతో నిలిచిపోయాయని, ఆ సంఖ్యను 10,400కు తీసుకువచ్చామన్నారు.
అనంతరం జెడ్పీ పాలకవర్గం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ను దుశ్శాలువాలతో కార్యాలయ సిబ్బంది సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జేసీ గంధం చంద్రుడు, జేసీ-2 ఒంగోలు శేషయ్య, ట్రైనీ కలెక్టర్ సలోమి, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ శాయన పుష్పావతి పాల్గొన్నారు.
ఇసుక సీనరేజ్ నిధులు ఎప్పుడిస్తారు
జిల్లాలో ఇసుక క్వారీలను కొన్నింటిని మూసివేశారని, సీనరేజ్ నిధులను ప్రభుత్వం విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని జెడ్పీ ప్రతిపక్ష నేత తాతినేని పద్మావతి సమావేశం దృష్టికి తీసుకురాగా, ఇసుక విక్రయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి ఉమ బదులిచ్చారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గత ఏడెనిమిది నెలలుగా నూజివీడు పరిసర ప్రాంతాలకు ఇసుక అందించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవటం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వాగులు, వంకల నుంచి ఇసుకను విక్రయిస్తున్నారని, మన జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని అడ్డుకుంటున్నారని చెప్పారు.
మోపిదేవి జెడ్పీటీసీ సభ్యుడు మెడబలిమి మల్లికార్జునరావు మాట్లాడుతూ బొబ్బర్లంక, మోపిదేవి రేవుల సమీపంలో సరిహద్దులు నిర్ణయించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. నూజివీడు జెడ్పీటీసీ బాణావతు రాజు మాట్లాడుతూ గిరిజనులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న అటవీ భూములను వెనక్కి తీసుకుంటారనే అపోహ ప్రజల్లో ఉందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి ఉమా మాట్లాడుతూ పేదల భూములను వెనక్కి తీసుకోమని, భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకునేందుకే సర్వే జరుగుతోందని చెప్పారు. పాఠశాలల్లో సౌకర్యాలు, వసతుల సమస్యలపై ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, పదో తరగతి ఫలితాల్లో జిల్లా పదో స్థానంలో నిలవడంపై ఎమ్మెల్సీ ఏఎస్ రామక ృష్ణ సమావేశంలో ప్రస్తావించారు.
ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు
తాతినేని పద్మావతి
ప్రజాసమస్యలపై జిల్లా పరిషత్ సమావేశంలో ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చేస్తున్నారని జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి అన్నారు. వైఎస్సార్ సీపీకి తక్కువ మంది సభ్యులే ఉన్నారని, వారికి మాట్లాడే అర్హత లేదని సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ వ్యాఖ్యానించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పాలకపక్షం వక్రమార్గంలో నడుస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నిలదీయటం సహజమని చెప్పారు.