యంత్రాలతోనే ‘నీరు-చెట్టు’
- అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- కూలీల ‘ఉపాధి’కి గండి
- ఖజానాపై రూ.65 కోట్ల భారం
- తెలుగు తమ్ముళ్ల కోసమేనని అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం తమ్ముళ్లకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు-చెట్టు కార్యక్రమాన్ని లక్ష్యంగా ఎంచుకొన్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే.. చెరువుల్లో పూడికతీత పనులకు యంత్రాలనే వినియోగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఫలితంగా తెలుగు తమ్ముళ్లకు ఆర్థికంగా ప్రయోజనం సమకూరుతుండగా.. రాష్ట్ర ఖజానాపై రూ.65 కోట్ల భారం పడనుంది.
అదేసమయంలో.. ఉపాధి హామీ పథకం కూలీలు పనులు కోల్పోయి.. పస్తులుండే పరిస్థితి ఏర్పడనుంది. సాధారణంగా చెరువుల్లో పూడికతీత పనులను వేసవి సీజన్‌లో ఉపాధి కింద కూలీల ద్వారా చేయిస్తారు.ఈ పనులు చేపట్టేందుకు అయ్యే ఖర్చులో 90 శాతం నిధులను కేంద్ర ప్రభు త్వమే మంజూరు చేస్తుంది. సీఎం చంద్రబాబు మాత్రం ఉపాధి హామీ కింద కూలీల ద్వారా ఈ పనులు చేయించేందుకు ఇష్టపడడం లేదు.
యంత్రాలను వినియోగించాలని ఆదేశించారు. ఫలితంగా యంత్రాలు వినియోగానికి గాను ప్రభుత్వం భారీ మొత్తంలో నగదును వాటి యజమానులకు చెల్లించనుంది. దీంతో ఆయా యంత్రాలను టీడీపీకి చెందిన వారే ఏర్పాటు చేసే అవకాశముందని, ఫలితంగా భారీగా ఆర్థిక ప్రయోజనం పొందవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.సీఎం ఆదేశాలతో ఖజానాపై రూ.65 కోట్ల భారం పడనుందని అధికారులు పేర్కొంటున్నారు.పూడికతీతకు జిల్లాకు రూ. 5 కోట్ల చొప్పున రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ. 65 కోట్లు ఖర్చుకానున్నాయని వారు నిర్ణయించారు. అదేవిధంగా నీరు-చెట్టు కార్యక్రమ ప్రచారానికి మరో రూ.5 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం రూ.70 కోట్లను విడుదల చేయాలని వారు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు.
అధికారుల్లో విస్మయం!
పూడికతీతను యంత్రాలతో చేయించాలన్న సీఎం నిర్ణయంపై సంబంధిత అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర నిధులను వినియోగించుకోకుండా రాష్ట్ర ఖజానాకు భారమయ్యేలా నిధులు విడుదల చేయాలని కోరడం పట్ల ఆర్థిక శాఖ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.