చంద్రబాబు సర్కార్ నూతన సృష్టి
ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులు భర్తీ ఇదే తొలిసారి
మంత్రుల పేషీల్లో పనిచేయడానికి మొత్తం 44 పోస్టులు
ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్‌మెంట్ నోటీసు జారీ
సాక్షి, అమరావతి: పార్టీ వారికి ఉపాధి కోసం ఏకంగా ప్రభుత్వంలో చంద్రబాబు సర్కారు సోషల్ మీడియా పోస్టులను సృష్టించింది. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో పనిచేయడం కోసం మొత్తం 44 సోషల్ మీడియా పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు డిజిటల్ కార్పొరేషన్ లిమిడెట్ సోమవారం ఎంప్లాయ్‌మెంట్ నోటీసు జారీ చేసింది.
24 మంది మంత్రుల పేషీల్లో 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ను, మరో 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్స్‌ను భర్తీచేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. ఔట్ సోర్సింగ్ విధానంలో వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక అంటేనే పార్టీకి చెందిన వారిని తీసుకుంటారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఇమేజ్ను పెంపొందించాలని, సోషల్ మీడియా ఖాతాలను, సంఘాలను నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ సందేశాలను, కార్యక్రమాలను బలంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుందని నోటీస్‌లో పేర్కొంది.
వీసీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నత విద్యా కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈనెల 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10ఏళ్ల పాటు ఆచార్యులు, సంబంధిత స్థాయిలో అనుభవం గడించిన వారు వైస్ చాన్సలర్లు పోస్టుల కోసం దరఖాస్తుకు అర్హులని తెలిపారు. మూడేళ్ల కాల పరిమితితో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment