మాఫీలాగే మమ!
నిరుద్యోగ భృతిపై అధికార పార్టీ ఎత్తుగడ...
టీడీపీ పొలిట్‌బ్యూరోలో జగన్ లేఖ ప్రకంపనలు
⇒ ఏదో ఒకటి ప్రకటించకపోతే జనంలో తిరగలేం..
⇒ వ్యతిరేకత పెరుగుతుండడంపై నేతల్లో భయం
⇒ అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేమని నేతల ఆందోళన
⇒ ఇస్తున్నట్లు ప్రకటించి రుణమాఫీలా మమ అనిపించేద్దామని నిర్ణయం
⇒ ప్రతిపక్షానికి మైలేజీ దక్కకుండా ప్రచారం చేయాలని అధినేత నిర్దేశం
సాక్షి, అమరావతి : ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన బహిరంగ లేఖతో అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కలకలం రేగింది. ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం. జగన్ లేఖ నేపథ్యంలో ఉపాథి కల్పన, నిరుద్యోగ భృతి అంశాలపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోందని సమావేశంలో పలువురు మంత్రులు, నేతలు చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. దీనిపై వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే జనంలో తిరగలేమని పలువురు నేతలు భయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
‘జాబు కావాలంటే బాబు రావాలి’, ‘ఇంటికో ఉద్యోగం ఇస్తాం’, ‘ఉద్యోగం కల్పించేవరకు నెలనెలా రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేయడం పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతోందని మెజారిటీ సభ్యులు వివరించారు. ఉద్యోగాలు కల్పించకపోగా... ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున దోహదపడే ప్రత్యేకహోదా సాధన విషయంలోనూ మనం విఫలంకావడంపై నిరుద్యోగ యువత రగిలిపోతోందని వారు వివరించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాగ్దానాలు చేసి, మేనిఫెస్టోలోనూ ప్రస్తావించి ఇపుడు మమ్మల్ని మోసం చేస్తారా అని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని నేతలు వివరించారని తెలిసింది.
ఈ అంశంపై ఏదో ఒక ఊరడింపు చర్య తీసుకోవాలని, లేకపోతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడి సభ జరగడం దాదాపు కష్టమౌతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పదేళ్లు సరిపోదు, పదిహేనేళ్లు కావాలని మనమే డిమాండ్ చేయడం, ఇపుడు మనమే ప్రత్యేక హోదా సంజీవని కాదని వ్యాఖ్యానిస్తుండడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయని, ప్యాకేజీ గురించి ఎన్ని చెప్పినా జనం నమ్మడం లేదని పలువురు నేతలు వివరించినట్లు తెలుస్తోంది.
ఇద్దాం.. మమ అనిపించేద్దాం..
పొలిట్‌బ్యూరో సభ్యుల సూచనలపై స్పందించిన చంద్రబాబు.. అందరికీ ఇవ్వలేకపోయినా రుణమాఫీలా కొంతమందికైనా ఇచ్చి మమ అనిపిద్దామని చెప్పినట్లు తెలిసింది. కానీ జగన్ లేఖ రాసిన తర్వాతే నిరుద్యోగ భృతి వచ్చిందనే అభిప్రాయం యువతలో కలగకుండా దానిని జాగ్రత్తగా అమలు చేయాల్సి వుందని చెప్పినట్లు సమాచారం. నిరుద్యోగ భృతి ఇచ్చినట్లు కనిపిస్తూనే దానిని మమ అనిపించేయడానికి రుణమాఫీ విషయంలో వేసిన ఎత్తుగడలనే అమలుచేద్దామని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇంటికో ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చినందున రాష్ట్రంలో 1.75 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉందని, అన్ని కోట్లమంది నిరుద్యోగులకు గత 32 నెలలుగా నిరుద్యోగ భృతి బకాయిలు కూడా చెల్లించాల్సి ఉందని జగన్ డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా పలువురు నేతలు అధినేత దృష్టికి తీసుకువచ్చారని సమాచారం.
యువభేరి సదస్సులకు హాజరౌతున్న నిరుద్యోగులు తమకు రావలసిన 32 నెలల నిరుద్యోగ భృతి రూ.74 వేల గురించి ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విషయాన్ని ఓ సీనియర్ మంత్రి సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే రుణమాఫీ విషయంలో ఎలాంటి ఎత్తుగడలు వేశామో అలాంటివే ఈ నిరుద్యోగ భృతి విషయంలోనూ అమలు చేయవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎంతమందికి భృతి ఇచ్చామన్నది ముఖ్యం కాదని, నిరుద్యోగ భృతి ఇచ్చినట్లు కనిపించడం, మనం చేసిందే నిజమని నమ్మించడం ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని పలువురు నేతలు సూచించగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలిసింది.
వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్షం ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేయడానికి సిద్ధమవుతుందని పలువురు తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమావేశం ముగిసిన తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపైనా ప్రతిపక్షం ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని పలువురు నేతలు ప్రస్తావించగా దానికి సంబంధించి రూపొందించిన ప్రణాళికలను వివరించాలని సూచించారు. ఇళ్ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం చేయించిన సర్వే సరిగా లేదని, రాష్ట్రానికి ఐదు లక్షల ఇళ్లు, ఉత్తరప్రదేశ్‌కు 50 లక్షల ఇళ్లను కేటాయించవచ్చని సర్వే నివేదిక ఇవ్వడం ఏమిటనే దానిపై చర్చించారు. ఈ కేటాయింపులపై మళ్లీ సర్వే చేయించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానంపై కేంద్రానికి లేఖ..
అమెరికాలో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై చర్చించిన నేతలు తెలుగు వారి రక్షణ కోసం అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక విత్తన చట్టాన్ని రూపొందించాలని, అనాధలు, వీధిబాలలకు ఆశ్రయం కల్పించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చంద్రబాబు నేతలకు తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, ప్రతిభా భారతి, తెలంగాణ నుంచి మోత్కుపల్లి నరసింహులు, రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం తరువాత నందమూరి హరికృష్ణ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొనడం గమనార్హం.