ఉపాధి కల్పన, శిక్షణ వట్టిమాటే
నిధులు లేక నిర్వీర్యమైన సెట్వెల్ విభాగం
ఏలూరు (టూ టౌన్) : ‘దేశానికి యువతే వెన్నుముక. దేశ భవిష్యత్ వారిపైనే ఆధారపడి ఉంది’.. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇవే మాటలు చెబుతుంటారు. ఎన్నికల సమయంలో యువ ఓటర్లను, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇవే మాటలు వల్లెవేశారు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.రెండు వేల చొప్పున ఇస్తానని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఆయన అధికార పీఠమెక్కి 8 నెలలు కావస్తోంది. నేటికీ ఆ హామీ నెరవేరలేదు. నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగు కనీసం స్వయం ఉపాధి పథకం కింద ఏదైనా వ్యాపారం చేసుకుందామనుకునే నిరుద్యోగులకు కనీస ప్రోత్సాహం కూడా అందటం లేదు. స్వయం ఉపాధి ఎలా పొందవచ్చనే అంశంపై శిక్షణ కూడా ఇవ్వటం లేదు.
దీంతో సెట్వెల్ అధికారులు, ఉద్యోగులు గోళ్లు గిల్లుకుంటున్నారు. ఈ సంస్థ ద్వారా నిరుద్యోగులకు, పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతకు ఏటా శిక్షణ ఇచ్చి, వారిలో 50శాతం మందికి యువశక్తి పథకం కింద బ్యాంకుల ద్వారా 50 శాతం రాయితీతో కూడిన రుణా లు అందించే ఏర్పాటు చేసేవారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీవ్ యువశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి యువశక్తి పథకంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది జీవో-13 ద్వారా 2014 సెప్టెంబర్ 25న ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకూ మార్గదర్శకాలు మాత్రం విడుదల కాలేదు. దీంతో యువతకు ఉపాధి, శిక్షణ లేకుండా పోయాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 472 యువతీ, యువకులకు రాజీవ్ యువశక్తి పథకం కింద రుణాలు మంజూరయ్యాయి. వారిలో 372 మంది యూనిట్లను స్థాపిం చారు. అదే ఏడాది మార్చి 3న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన 100 మందికి రుణాలు అందలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పట్టిం చుకోకపోవటంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరికి కూడా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకపోగా, కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. దీంతో యువత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
యువత.. కుతకుత
Published Mon, Feb 23 2015 1:45 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement