
మాటలు కోటలు దాటాయి
సాక్షి ప్రతినిధి, కడప : ‘గాలి మోటారులో పర్యటన, గాలి కబుర్లతో కాలయాపన’ అన్న మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్షరాలా వర్తిస్తాయి. ఇబ్బడి ముబ్బడి హామీలు గుప్పించడం, ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా ఆయన వ్యవహరిస్తున్నారు. గండికోటకు జూలై నాటికి నీరు ఇస్తామని ఫిబ్రవరిలో ప్రకటించారు. ఇప్పటి వరకూ పెండింగ్ పనుల్లో అర ఇంచు పురోగతి లేదు. ఇదివరకే ఓమారు గండికోట ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం మరోమారు సమీక్షించనున్నారు. ‘జూలై నాటికి గండికోట, మైలవరం ప్రాజెక్టుల్లో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తాం.
అవసరమైతే కాలువ గట్లపై నిద్రిస్తా. సత్వరమే పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. కుప్పం కంటే ముందే పులివెందులకు నీరు ఇస్తాం’. ఈ మాటలు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిబ్రవరి 27న గండికోట ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా హామీ ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఐదు శాతం పను లు పూర్తి అవుతాయని అందరూ భావించారు. ఐదు నెలల కాలం పూర్తి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా గండికోట ప్రాజెక్టు ఉండిపోయింది. పునరావసం, పరిహారం చెల్లింపు, నిర్వాసితులను ఖాళీ చేయించడంలో ఏమాత్రం పురోగతి లేదు.
సీఎం హామీలు నీటిపై రాతలే అన్నట్లుగా ఉండిపోయాయి. సీఎం హామీ అనంతరం మే 8న నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చారు. ఈసందర్భంగా సర్వరాయసాగర్ ప్రాజెక్టు సందర్శించారు. అక్కడే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం 3నెలలు పూర్తి అయినా అరతట్ట మట్టి తీయలేదు, ఒక మీటర్ స్ట్రక్చర్ చేపట్టలేదని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్న కాంట్రాక్టర్లను తప్పించి, అనుయాయులకు కాంట్రాక్టు పనులు అప్పగించారు.
సత్వరపూర్తికి చిత్తశుద్ధి ఏదీ...!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 95 శాతం పూర్తి అయిన గండికోట ప్రాజెక్టు పనులు సత్వర పూర్తికి ఆశించిన చొరవ కన్పించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జూలై నాటికి జిల్లాలో 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని సిఎం ప్రకటించడం మినహా, ఆ తర్వాత బడ్జెట్‌లో తగిన గుర్తింపు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకొస్తున్నారు. జిఎన్‌ఎస్‌ఎస్‌కు కేవలం రూ.169 కోట్లు మాత్రమే కేటాయించారని వివరిస్తున్నారు. గండికోట ముంపు గ్రామాలు ఖాళీ చేయించి, నీరు వచ్చేనాటికి సంసిద్ధంగా మునక ప్రాంతాన్ని చేయాలన్న ఆలోచన కూడ లేదని పలువురు వాపోతున్నారు.
ముంపువాసులకు సుమారు మరో రూ.18 కోట్లు పరిహారం అందించాల్సి ఉందని, ఆర్‌అండ్‌ఆర్ పునరావాస కార్యక్రమం సైతం నిధులు లేక నీరసించిందని పలువురు వివరిస్తున్నారు. ఎంతోకాలంగా జిల్లా వాసులు ఆశలు పెంచుకున్న ఉక్కు పరిశ్రమపై సెయిల్‌నీళ్లు చల్లుతోంది. ఇక్కడ అన్ని రకాలుగా అవకాశాలున్నా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద సెయిల్ అధ్యయనం చేస్తుడడంపై సీఎం చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.