డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకు ఉద్యమం
మహిళల ధర్నాలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : డ్వాక్రా మహిళల రుణాలపై సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలను మోసం చేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. మూలధనం కాకుండా డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున మహిళలతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన జరిగిన తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుతగా డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ప్రకటించారని అన్నారు. మళ్లీ లక్ష రూపాయలు మాత్రమేననడం, ఆ తర్వాత ఒక్కో సభ్యురాలికి రూ.10 వేలు అని చెప్పి, చివరకు రూ.3 వేలు మూలధనం పేరిట ఇస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. అది కూడా వాడకూడదనే నిబంధనలు విధించడంతో మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఒక్కో మారు ఒక్కో విధంగా మహిళల మైండ్ సెట్‌ను మార్చి చివరికి మోసపుచ్చారన్నారు. దీనిపై దశల వారీగా ఆందోళన చేస్తామన్నారు.
ఇందులో భాగంగా పుట్టపర్తి సర్కిల్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, ప్రొద్దుటూరు పట్టణ బంద్ నిర్వహించడం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రొద్దుటూరు కేంద్రంగా ఆందోళన సాగిస్తామని తెలిపారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖరరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. సుమారు 2 వేల మంది మహిళలు ధర్నాకు హాజరు కావడం గమనార్హం. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, ఎంపీపీ మల్లేల ఝాన్సీరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు గోర్ల రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు కోటి మంది మహిళలను మోసం చేశారు
Published Wed, May 27 2015 2:37 AM | Last Updated on Tue, Oct 30 2018 5:08 PM
Advertisement