తమ్ముళ్లూ.. ప్చ్‌! | CM Chandrababu Naidu Special Focus on Rayalaseema Politics | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లూ.. ప్చ్‌!

Published Sun, Nov 25 2018 8:51 AM | Last Updated on Sun, Nov 25 2018 8:51 AM

CM Chandrababu Naidu Special Focus on Rayalaseema Politics - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’లో ఎదురుగాలి వీస్తోందని చంద్రబాబు గ్రహించారు. ‘అనంత’ టీడీపీకి కంచుకోట అనుకున్నామని, కానీ కూలిపోయే పరిస్థితి కనిపిస్తోందనే నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, మంత్రులపై కూడా తీవ్రంగా స్పందించారు. వ్యక్తులు ముఖ్యం కాదని.. పార్టీయే ముఖ్యమని, పార్టీకి నష్టం వాటిల్లుతోందని తెలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సూటిగా చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు మాట్లాడం, నేతలపై అసహనం వ్యక్తం చేయడం చేస్తే జిల్లాలో పార్టీ దారుణంగా దెబ్బతినిందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని, బాబులోని అసహనం, మాటలు చూస్తే అధికారంలోకి రాదనే విషయం కూడా స్పష్టమవుతోందనే చర్చ నేతలు, కార్యకర్తల్లో వినిపించింది. రెండురోజుల ‘అనంత’ పర్యటనకు వచ్చిన ఆయన పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించాలనేందు కోసమే ఈ దఫా జిల్లా పర్యటనకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. అధికారిక కార్యక్రమాల కంటే పార్టీ కార్యక్రమాలపైనే చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. 

‘అనంత’ పర్యటనకు 23వ సారి వచ్చిన చంద్రబాబు 21సార్లు జిల్లాకు రావడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లిపోయారు. 2016లో రెయిన్‌గన్‌లను ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే జిల్లాలో నాలుగురోజులు గడిపారు. అప్పుడు కూడా ‘అనంత’లో బస చేసి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు హెలికాప్టర్‌లో వెళ్లి వచ్చారు. కానీ ఈ దఫా మాత్రం రెండురోజులు ‘అనంత’లో బస చేసి పార్టీపై దృష్టి సారించారు. తొలిరోజు పుట్టపర్తి పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత బళ్లారిరోడ్డులోని ఎంవైఆర్‌ కళ్యాణమండపంలో శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. 

అర్ధరాత్రి రెండు గంటల వరకూ సమీక్ష కొనసాగింది. రెండోరోజు శనివారం ఉదయం 7కన్వెన్షన్‌ సెంటర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించి, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి పుట్టపర్తి, కళ్యాణదుర్గం నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్షించారు. అర్ధరాత్రి దాకా మేల్కొని సమీక్షలు నిర్వహించడం, అధికారులతో మాట్లాడిన తీరు.. పార్టీ నేతలు, కార్యకర్తల సమీక్షలో మాట్లాడిన వైనాన్ని నిశితంగా పరిశీలిస్తే ‘అనంత’లో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పకనే చంద్రబాబు చెప్పారు. రెండురోజుల సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలు ఆయా నియోజకవర్గాల నుంచి కీలక వ్యక్తుల ద్వారా తెలుసుకున్న సమాచారం మేరకు వివరాలివీ..

శింగనమల: శింగనమల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. విప్‌ యామినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమారుడు అశోక్‌ నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా పంచుకుని నాశనం చేశారని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్లో గ్రూపులు ఉండటంతో పాటు నియోజకవర్గంలో జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యేకు తెలీకుండా అమలు కాకూడదని అధికారులకు నిర్దేశించడంపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పనితీరు చూస్తే ‘అట్టర్‌ఫ్లాప్‌’ అనే నిర్ధారణకు వచ్చారు. నార్పలలో ఆలం నర్సానాయుడు పార్టీని భ్రష్టుపట్టించారని ఎంపీపీ ఆకుల అరుణ సీఎం దృష్టికి తీసుకొచ్చి నట్లు తెలిసింది. దీంతో నర్సానాయుడిపై సీఎం సీరియస్‌ అయ్యారు. పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘ఒక మండలంలోని సమస్యలు కూడా నా దృష్టికి వస్తున్నాయంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అన్ని రకాల ఫెయిల్‌ అయ్యారని’ సీఎం విప్, ఎమ్మెల్సీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కళ్యాణదుర్గం: ‘కళ్యాణదుర్గం జిల్లాలోనే అత్యంత బలంగా ఉందని అనుకునేవాళ్లం. సర్వే రిపోర్టులు చూస్తే అత్యంత దారుణపరిస్థితి అక్కడే ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ‘సన్‌స్ట్రోక్‌’ తగిలింది. మారుతి వ్యవహారంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. మారుతి నువ్వు మారాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని హెచ్చరించినట్లు తెలిసింది. అలాగే రామ్మోహన్‌చౌదరిపై కూడా తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలుస్తోంది. ‘మంత్రి అండ ఉందని ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు. గ్రూపులు కట్టుకుని పార్టీకి నష్టం చేస్తున్నారు. ఇకపై ఫిర్యాదు వస్తే సీరియస్‌గా ఉంటుంది.’ అని హెచ్చరించినట్లు సమాచారం.

 మొత్తంగా కళ్యాణదుర్గంలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తే రిపోర్ట్‌ వ్యతిరేకంగా వచ్చిందని, మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.గుంతకల్లు: గుంతకల్లు నియోజకవర్గం సర్వే రిపోర్టులు దారుణంగా ఉన్నాయి. ఎమ్మెల్యే కుటుంబపాలనతో పార్టీకి నష్టం వాటిల్లింది. పార్టీలోకి వచ్చే వారిని కలుపుకుని వెళ్లాలి. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయకూడదని పరోక్షంగా జితేంద్రగౌడ్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలాగే మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త చంద్రశేఖర్‌ పనితీరు పార్టీకి నష్టం చేస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల స్థితిగతులపై తరచూ సర్వేలు చేయిస్తున్నాం. ఏమాత్రం తేడాలు వచ్చినా సహించేది లేదని మాట్లాడారు.

కదిరి: కదిరి సమీక్షలో చంద్రబాబు తీవ్రస్థాయిలోనే స్పందించారు. కదిరిలో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఇప్పుడు ప్రత్యర్థులు బలపడుతుంటే, గ్రూపు తగాదాలతో రోజురోజుకు మరింత బలహీనపడుతున్నారని మండిపడ్డారు. ఇద్దరూ బలప్రదర్శన చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అత్తార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కందికుంటను హెచ్చరించారు. ఇద్దరి తీరుతో పార్టీ నాశనమైందని చెప్పుకొచ్చారు. వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీనే ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త జోక్యం చేసుకుని అత్తార్‌పై ఫిర్యాదు చేయబోయారు. ‘అవునయ్యా! ఇప్పుడు తీవ్రంగా మాట్లాడుతున్నారు. మొన్న ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు. నా ముందు వేషాలు వేయొద్దు!’ అని వారించారు. టిక్కెట్‌ ఎవరికి అనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని, ఇద్దరూ పార్టీ కోసం పనిచేయాలని పనితీరు ఆధారంగా చివరల్లో నిర్ధారిస్తానని చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెబుతూ కదిరి బాధ్యతను మంత్రి దేవినేనికి ప్రత్యేకంగా అప్పగించారు.

పుట్టపర్తి: పుట్టపర్తిపై సర్వేలు చేయిస్తే ఓడిపోతామని రిపోర్టులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. పల్లె ప్రవర్తనే పార్టీకి నష్టం చేకూరుస్తోందని చెప్పుకొచ్చారు. ఆయన భార్య చనిపోయింది.. కాబట్టి మీరే కోఆర్డినేట్‌ చేసుకుని పార్టీని ముందుకు నడిపించండి. ఎన్నికల ముందు పార్టీ పరిస్థితి బేరీజు వేసి, ఎవరి బలం ఏంటో నిర్ధారించి టిక్కెట్‌ సంగతి ఆలోచిస్తా! అని చెప్పినట్లు తెలుస్తోంది. 

అధికారులకు దిశానిర్దేశం
పార్టీ సమీక్షకు ముందు ప్రభుత్వ అధికారులతో 7 కన్వెన్షన్‌లో నిర్వహించిన సమీక్షలో కూడా చంద్రబాబు అధికారులకు కూడా పరోక్షంగా పార్టీ బలోపేతంపైనే దిశానిర్దేశం చేశారు. ఒక ప్రభుత్వానికి మంచిపేరు రావాలన్నా, చెడ్డపేరు రావాలన్నా అధికారుల పనితీరు కీలకమని ‘అనంత’లో పార్టీ పరిస్థితి బాగోలేదని అధికారులు ప్రభుత్వ పనితీరుపై జనాల్లో విస్తృత ప్రచారం చేయాలని, అది పరోక్షంగా పార్టీకి లాభిస్తుందనే కోణంలో మాట్లాడారు. అధికారుల సమీక్షతో పాటు ఐదు నియోజకవర్గాల సమీక్షలను పరిశీలిస్తే ఐదుచోట్ల టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందని చంద్రబాబు నిర్ధారణకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. సమీక్ష అనంతరం బయటకు వచ్చిన నేతలు, కార్యకర్తలు కూడా ఈ ఐదు ఓడిపోతామని తెలిసే చంద్రబాబు సమీక్ష పెట్టుకున్నారని, చంద్రబాబు ఇంత బాహాటంగా మాట్లాడటం చూస్తే జిల్లాలో 5 కచ్చితంగా ఓడిపోతామని స్పష్టమవుతోంది. తక్కిన 9 నియోజకవర్గాల్లో కూడా ఎన్ని గెలుస్తామో, ఎన్ని ఓడిపోతామో.. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయినట్లు ఉందని చర్చించుకున్నారు. సమీక్ష అనంతరం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్‌లో పుట్టపర్తికి వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి వెళ్లిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement