కేంద్రాన్ని తిడితే నష్టపోతాం
‘ఏపీ పర్స్’ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఇతర ప్రత్యామ్నాయాలు లేకుండా అత్యధిక శాతం చలామణిలో ఉన్న నగదును ఉపసంహరించడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అలా అని కేంద్రాన్ని తిడుతూ కూర్చుంటే మనమే ఎక్కువ నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందుకే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. చిన్న నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2,000 నోట్లను అత్యధికంగా సరఫరా చేస్తుండటం వల్ల సమస్య మరింత జఠిలంగా మారిందన్నారు. మంగళవారం రాత్రి విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ‘ఏపీ పర్స్’ మొబైల్ యాప్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలంటే వ్యవస్థలో పూర్తిగా నగదు చలామణి లేకుండా చేయడం కాదని, సాధ్యమైనంత వరకు తగ్గించడమే దీని ఉద్దేశమన్నారు. జేబులో మొబైల్ ఫోన్, కార్డుతో పాటు తక్కువ మొత్తంలో నగదు ఉంటే చాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు 16 శాతానికి చేరాయని, ఇవి మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.