సాగునీటి సంకల్పం | CM jagan Focus On Three Irrigation Projects In Vizianagaram | Sakshi
Sakshi News home page

సాగునీటి సంకల్పం

Published Sat, Sep 14 2019 8:31 AM | Last Updated on Sat, Sep 14 2019 8:31 AM

జంఝావతి ప్రాజెక్టు - Sakshi

జిల్లాలోని రైతుల ఆశలు నెరవేరనున్నాయి. సాగునీటి సమస్యలు పరిష్కారం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఇక తెరపడనుంది. ఇన్నాళ్లు అవరోధంగా నిలిచిన పక్క రాష్టాలతో చర్చకు సీఎం సుముఖత చూపడం శుభపరిణామంగా కనిపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న కాలువల ఆధునికీకరణకు ఇక మార్గం సుగమమైంది. ఇక రాబోయే కాలంలో జిల్లా మొత్తం సస్యశ్యామలంగా మారనుంది. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో సాగునీటి రంగానికి మంచి రోజులు రానున్నాయి.  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన అధికారుల సమావేశంలో జంఝావతి ప్రాజెక్టు అంతరాష్ట్ర సమస్యపై ఒడిశా సీఎంతో మాట్లాడతానని  హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తోటపల్లి నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోని రైతులకు మరింత మేలు జరగనుంది. ఇదే క్రమంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను గాడిన పెట్టేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు నడుం బిగుస్తున్నారు. అధికారులతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. 

పథకాలున్నా... ప్రయోజనం అంతంతే...
జిల్లాలో ఉన్న సాగునీటి వనరులే తక్కువ. ఉన్న కాడికి నిధులు ఏటా ఖర్చు చేస్తున్నా తూములు, మదుములు, కాలువలకు మాత్రం మరమ్మతు ల గ్రహణం వీడటం లేదు. ముఖ్యంగా లక్షా 78 వేల ఎకరాలకు పైగా భూములు చిన్న నీటి పథకాల పరిధిలో సాగవుతున్నాయి. ఏటా రైతులు ఇసుక బస్తాలు, రాళ్లు అడ్డం పెట్టుకోవడం లేదా కాలువల్లోని పూడికలు తీసుకోవడం మినహా మరే విధమయిన అవకాశమూ లేకపోతోంది. 

ఆధునికీకరణకు నోచని మధ్యతరహా ప్రాజెక్టులు
జిల్లాలో తొమ్మిది మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులున్నాయి. ఇందులో కాలువలకు లైనింగ్‌లేదు. చాలా ప్రాజెక్టులకు ప్రధాన కాలువలతో పాటు షట్టర్లు సైతం మరమ్మతుల్లో ఉండటం వల్ల ఉన్న కొద్ది పాటి నీరు కూడాఏటా లీకులవుతూనే ఉన్నాయి. వీటి మరమ్మతుల కోసం వెచ్చించిన నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదు. జైకా నిధులు ఉన్నా దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మాత్రం సరిచేసి పంపించాల్సి ఉండగా నేటికీ అడుగు ముందుకు పడటం లేదు. దీంతో మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల్లో చివరి భూములకు మాత్రం నేటికీ సాగునీరందడం లేదు.

ప్రాజెక్టుల మరమ్మతుకు ఈ ఏడాది ప్రతిపాదనలు కూడా చేసినట్టు లేదు. ఫలితంగా జిల్లాలోని పలు ప్రాజెక్టుల్లో సాగునీరు పారేందుకు వీలు లేకపోయింది. నీరు చెట్టు పనులకు సంబంధించి భారీ స్థాయిలో స్కెచ్‌ వేసిన నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్‌ఇవ్వడంతో ఆ బిల్లులు నిలిచిపోయాయి. ఇప్పుడు మాత్రం పారదర్శకంగా పనులు చేస్తేనే బిల్లులిస్తామని తేలడంతో ఆదేశాలు వచ్చే వరకూ ఎటువంటి పనులూ చేయకూడదని పలువురు నిర్ణయించుకున్నారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. 


తోటపల్లి ప్రాజెక్టు 

సా...గుతున్న తోటపల్లి కాలువ పనులు
జిల్లాలోని పది సాగునీటి ప్రాజెక్టులున్నా ఏకైక మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు తోటపల్లే. రెండు జిల్లాలకూ కలిపి పాత ఆయకట్టు 64 వేల ఎకరాలు కాగా కొత్తగా లక్షా 23 వేల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించినా కాలువకు లైనింగ్‌ లేదు. ఎన్నాళ్ల క్రితమో లైనింగ్‌ కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. కానీ పనులు కాక సక్రమంగా  సాగునీరు వెళ్లడం లేదు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద నిద్రపోయి పూర్తి చేస్తున్నానని ఆర్భాటంగా  ప్రకటించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆనాటితో ప్రాజెక్టును వదిలేశారు. ప్రాజెక్టు అంచనాలు గత ఐదేళ్లలో రూ.450కోట్ల నుంచి రూ.1127కోట్లకు పెంచేశారు.

కానీ పనులు పూర్తి కాలేదు. ప్యాకేజీ–1 పనులు 75శాతం, ప్యాకేజీ–2 పనులు 90శాతం పూర్తయ్యాయి. దీనివల్ల ప్రాజెక్టులో నీరున్నా కాలువలు ద్వారా పంట పొలాలకు అందడం లేదు. ఇక్కడి ప్రధాన కాలువల నుంచి పిల్ల కాలువలకు భూ సేకరణ కూడా చేపట్టలేదు. కళ్లముందే సాగునీరు ఇతర జిల్లాలకు వెళ్తున్నా ఇక్కడి రైతులకు మాత్రం కన్నీరే గతయింది.  

400 ఎకరాల సేకరణ పెండింగ్‌
తోటపల్లి కాలువల నుంచి పెద్ద ఎత్తున పిల్ల కాలువలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 400 ఎకరాలను సేకరించాల్సి ఉంది. కానీ నేటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రెవెన్యూ అధికారులు మాత్రం ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని చెబుతున్నా నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇంకా పిల్ల కాలువలకు భూ సేకరణ పూర్తి కాలేదు. ఈ ఏడాది కూడా బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల్లోని రైతులకు తోటపల్లి సాగునీరు అందలేదు. 

ముందుకు కదలని వెంగళరాయ విస్తరణ
జిల్లాలో వెంగళరాయ సాగర్‌ప్రాజెక్టుకు 24వేల పైచిలుకు ఎకరాల ఆయకట్టున్నా జలాశయ సామర్థ్యాన్ని బట్టి మరో 8వేల ఎకరాలకు సాగునీరందించవచ్చని గతంలో ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దాని ప్రకారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గొల్లపల్లిలో రూ.5కోట్లతో కొన్నేళ్ల క్రితం అదనపు ఆయకట్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు వరుసగా అంచనాలు పెరుగుతూ రూ.12.67 కోట్లకు చేరింది. ఈ పనులను చిత్తూరుకు చెందిన ఆర్‌ ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేపట్టింది. కేవలం 13 నెలల్లోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా పనులు సాగుతూనే ఉన్నాయి. నేటికి కేవలం 20 శాతం పనులు అయ్యాయని అధికారులు చెబుతున్నా అంత కూడా లేదని స్థానికులు అంటున్నారు.

తారకరామకు అడ్డంకులెన్నో...
తారకరామతీర్ధసాగర్‌ ప్రాజెక్టు మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే 15శాతం పనులు జరిగాయి. అటు తరువాత ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికి స్పిల్‌వే రెగ్యులేటర్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన కాలువ పనుల్లో ముఖ్యమైన టన్నెల్‌ సమస్య అడుగైనా కదలడం లేదు. జలాశయం పనులు కొద్దిగా జరిగాయి. 500ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఆర్‌అండ్‌ఆర్‌ పనులు కదల్లేదు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఇక ఎన్నో ఏళ్లుగా జంఝావతి సమస్య అలాగే ఉంది. దీనినే ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. వెంగళరాయ, పెద్దగెడ్డ, ఆండ్ర, పెదంకలాలం, వట్టిగెడ్డ వంటి ప్రాజెక్టులు అధునికీకరణకు రూ.178కోట్లు జైకా నిధులు మంజూరైనా టెండర్లు ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి చొరవతో ఈ ప్రాజెక్టులకు మహర్ద శ పట్టనుందనడంలోఎంలాంటి సందేహం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement