నేను విన్నాను.. నేను చేశాను : సీఎం జగన్‌ | CM Jagan Launches YSR Vahana Mitra At Eluru | Sakshi
Sakshi News home page

నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను.. నేను చేశాను..

Published Sat, Oct 5 2019 4:58 AM | Last Updated on Sat, Oct 5 2019 10:25 AM

 CM Jagan Launches YSR Vahana Mitra At Eluru - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించారు. ఈ పథకం కింద 1,73,531 మందికి లబ్ధి చేకూరనుంది.

ముఖ్యమంత్రికి గజమాలతో సత్కారం..
ఉదయం ఏలూరు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ తొలుత ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ప్రారంభించారు. తమకు ఆర్థికంగా చేయూతనిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ను ఆటోడ్రైవర్లు పుష్పగుచ్ఛాలు, గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘2018 మే 14న పాదయాత్రలో ఆటో కార్మికులకు హామీ ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని అమలు చేశాం. వారి కష్టాలను స్వయంగా చూసి ఈ పథకాన్ని రూపొందించాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే....

ఆ మాటలను మరచిపోలేను..
‘‘నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలందరికీ ఇదే ఏలూరులో 2018 మే 14వ తేదీన నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చా. రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లందరికీ ఇక్కడ ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేయగలుగుతున్నామంటే దేవుడి దయ, మీ చల్లని దీవెనల వల్లేనని సగర్వంగా ఈ వేదిక నుంచి  చెబుతున్నా. ఆ రోజు ఇదే ఏలూరులో ఆటో డ్రైవర్ల కోసం ప్రకటన చేశాం. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటూ బతుకు బండి ఈడుస్తున్న అన్నదమ్ముల కష్టాలు చూశా. నా దగ్గరకు వచ్చి చెప్పుకున్న రోజును బహుశా ఎప్పటికీ మరిచిపోలేనేమో.

ఏలూరు సభకు హాజరైన మహిళలు, ఆటో, డ్రైవర్లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు

అన్నా ఆటో తోలుకుంటున్నాం. రోజుకు రూ.300 – రూ.500కి మించి రాదన్నా.. వచ్చే ఆ మూడు వందలు, ఐదు వందల రూపాయలతో బతకడమే కష్టమైతే అది చాలదన్నట్లుగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల పేరుతో ప్రతిరోజు రూ.50 ఫైన్‌ వేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని ఒకసారి చూడండి అన్నా అని చెప్పిన మాటలను మరిచిపోలేను.ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రావాలంటే ఇన్సూరెన్సు కట్టాలి. ఇన్సూరెన్స్‌ కట్టాలంటే  రూ.7,500 – రూ.8,000 దాకా అవుతున్నాయని ఆ రోజు చెప్పారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రావాలంటే బండికి రిపేర్‌ కూడా చేయించాలి. రిపేరు చేయించాలంటే రూ.1,500 –  రూ.2,000 వరకు అవుతుంది. రోడ్డు ట్యాక్స్‌ కడితే గానీ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వరు. ఇవన్నీ ఒకేసారి కట్టాలంటే కనీసం రూ.10 వేలు పైచిలుకు అవుతాయన్నా... ఎక్కడి నుంచి తేగలుగుతామన్నా....? రోజంతా  కష్టపడి ఆటో తోలినా కనీసం రూ.500 కూడా రాని పరిస్ధితి. ఆటో, ట్యాక్సీ నడుపుకొంటూ బతుకు బండి ఈడ్చడం ఎలా అన్నా? అనే మాటలను ఎప్పటికీ మరిచిపోలేను.

ఏటా అందజేస్తాం..
ఈరోజు మీ తమ్ముడిలా, మీ అన్నలా, మీ కుటుంబ సభ్యుడిలా  మీ అందరి తరఫున ఒకటే చెబుతున్నా. ‘‘నేను చూశాను... నేను విన్నాను.. నేను ఉన్నాను..’’ అని చెప్పిన మాటకు కట్టుబడి ఈ ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు నెలలు తిరగకముందే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ బ్యాంకు ఖాతాల్లోకి బటన్‌ నొక్కిన వెంటనే కేవలం రెండు గంటల్లోనే డబ్బులు జమ అయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పేందుకు గర్వపడుతున్నా.  ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటూ బతుకు బండి ఈడుస్తున్న ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు నేను మాట ఇస్తున్నా.  ప్రతి  సంవత్సరం రూ.10 వేలు చొప్పున ఈ ఐదు సంవత్సరాల్లో  రూ.50 వేలు మీ అకౌంట్ల్లలో వేస్తానని సగర్వంగా చెబుతున్నా..

వివక్ష, అవినీతికి తావులేకుండా అమలు..
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి 1,75,352 మంది దరఖాస్తు చేసుకుంటే  1,73,102 మందికి ఈ పథకం పూర్తిగా ఈరోజే  అమలులోకి వస్తుంది. 79 వేల మంది బీసీలు, 40 వేల మంది ఎస్సీలు,  6 వేలమంది ఎస్టీలు, 17,500 మంది మైనార్టీలు, 20 వేల మంది కాపులు, 397 మంది బ్రాహ్మణులు, 10 వేల మందికి పైగా ఈబీసీలకు ఈ పథకంతో లబ్ధి చేకూరింది. ఎక్కడా వివక్ష లేదు. అవినీతి లేదు. పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌ విధానం అనుసరించాం. మీ పేరుతో లైసెన్స్‌ కలిగి ఉండి మీ పేరుతోగానీ, మీ కుటుంబ సభ్యుల పేరుతోగానీ ఆటో ఉంటే చాలు.

వైఎస్సార్‌ వాహన మిత్ర ప్రారంభం సందర్భంగా కృతజ్ఞతగా సీఎం వైఎస్‌ జగన్‌తో చేతులు కలిపిన ఆటో డ్రైవర్లు

తెల్ల రేషన్‌కార్డు దారుడైతే చాలు. నేరుగా ఈ పథకం  అమలవుతుందని ఆదేశాలు ఇచ్చాం. గ్రామ వలంటీర్లు మీ ఇంటికి వచ్చారు. మీ చెయ్యి పట్టుకుని  నడిపించారు. పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా 1.73 లక్షల మందికిపైగా మేలు జరిగింది. ఇటువంటి రాష్ట్రానికి జగన్‌ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నానని  గర్వంగా చెబుతున్నా. ఇంత గొప్ప కార్యక్రమాన్ని లంచాలు, వివక్షతకు తావులేకుండా విజయవంతం చేసిన వలంటీర్లు, అధికారులు, కలెక్టర్లు, రవాణా శాఖ మంత్రి పేర్ని నానిని అభినందిస్తున్నా.

ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పట్టపగలే కళ్లార్పకుండా ప్రభుత్వంపై బండలు వేస్తున్న పరిస్థితిని ఇవాళ మీరంతా చూస్తున్నారు. అక్టోబర్‌ 2న  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సి వస్తోంది. ఆరోజు గాంధీ జయంతి నాడు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా ప్రతి పేదవాడికి మంచి జరగాలని గ్రామ సచివాలయాలను ఆవిష్కరించాం. 2 వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. వాటిల్లో కొత్తగా 10 నుంచి 12 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. వలంటీర్ల వ్యవస్ధను తెచ్చి లంచాలకు తావులేకుండా ప్రతి పేద వాడి ఇంటికే ప్రభుత్వ పధకాన్ని చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మహాత్ముడు కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ మద్యంపై  యుద్ధాన్ని కూడా ఆ రోజే ప్రకటించాం.

ఇలా అబద్ధాలాడటం సబబేనా?
గత ప్రభుత్వం ఉన్నప్పుడు 43 వేల బెల్టుషాపులుండేవి. ఏ గ్రామంలోనైనా తాగడానికి మినరల్‌  వాటర్‌  ఉంటుందో లేదో తెలియదు గానీ ప్రతి ఊరిలో, వీధి చివరన, గుడిపక్కన, బడి పక్కన మద్యం షాపు మాత్రం కచ్చితంగా దర్శనమిచ్చేది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త మద్యం పాలసీని తెచ్చాం. 43 వేల  బెల్టుషాపులను ఎక్కడా కనిపించకుండా చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 4,500  షాపులుంటే  20 శాతం షాపులు  తగ్గించి 3,450 షాపులకు కుదించాం. గతంలో మందు షాపు పక్కన పర్మిట్‌ రూం ఏర్పాటు చేయడంతో విచ్చలవిడిగా  తాగేవారు. మహిళలు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. ఎక్కడా పర్మిట్‌ రూం అనేది లేకుండా పూర్తిగా రద్దు చేయమని ఆదేశించి కొత్త పాలసీని తెచ్చాం.

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు. 

ప్రతి అడుగులో మంచి చేయడానికి తాపత్రయపడుతుంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు గాంధీ జయంతి నాడు మందుషాపులు తెరిచిపెట్టింది ఈ ప్రభుత్వం అని అభాండాలు వేస్తారు. గాంధీ జయంతి రోజు మందు షాపు తెరిచి ఉందా? అని మీ అందరిని అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది అంటారు. 40 ఏళ్లు ఇండస్ట్రీ అంటారు. మరి ఈ మాదిరిగా పట్టపగలే అబద్ధాలు ఆడటం సబబేనా? ఇటువంటి రాజకీయాలు చూసినప్పుడు మనసుకు బాధ కలిగినా మీ ముఖాల్లో చిరునవ్వు చూసినప్పుడు సంతృప్తి కలుగుతుందని సగర్వంగా చెబుతున్నా. కచ్చితంగా దేవుడి ఆశీస్సులతో, మీ చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పరిపాలన దేవుడు నాతో చేయించాలని కోరుకుంటున్నా’’

బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించిన సీఎం
వైఎస్సార్‌ వాహనమిత్ర డబ్బులు లబ్ధిదారులైన డ్రైవర్ల ఖాతాల్లోకి చేరేలా ముఖ్యమంత్రి జగన్‌ వేదికపైనే కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అక్టోబర్‌ 10 నుంచి ప్రారంభించే వైఎస్సార్‌ కంటి వెలుగు పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు పేర్ని వెంట్రామయ్య(నాని), తానేటి వనిత, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, కనుమూరు రఘురామ కృష్ణంరాజు, మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ కంటి వెలుగు పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  

మంచి చేయాలన్నదే మా తపన..
ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల అగచాట్లు ఏమిటి? వారికి ఎలా మేలు చేయాలనే ఆలోచన బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదేమో? అది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే, ఇక్కడ జరిగిందని సగర్వంగా చెబుతున్నా. ప్రతి పేదవాడికి మంచి చేయాలని ఆరాటం, తపనతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రతి పథకం అర్హులందరికీ అందాలని ఆదేశిస్తున్నాం. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, ప్రాంతాలు చూడకూడదు, చివరికి పార్టీలు కూడా చూడకూడదని ఆదేశాలు ఇచ్చాం.

ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే....
పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు 30 వరకు అవకాశం ‘‘పొరపాటునో లేక దరఖాస్తు చేసుకోవడం తెలియక ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్‌ 30వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. ఎవరైనా  మిగిలిపోయి ఉంటే అప్లికేషన్‌ పెట్టుకోండి. ఇప్పుడు గ్రామ సచివాలయం కూడా మీకు అందుబాటులో ఉంది. వలంటీర్లు కూడా సాయం చేస్తారు. వీరికి నవంబర్‌ నెలలో డబ్బులు ఇచ్చేస్తామని కూడా ఇదే  వేదిక మీద హామీ ఇస్తున్నా’’
– సీఎం వైఎస్‌ జగన్‌

‘‘ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటూ బతుకు బండిఈడుస్తున్న అన్నదమ్ములు నా దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకున్న రోజును బహుశా ఎప్పటికీ మరిచిపోలేనేమో. రోజంతా  కష్టపడి ఆటో తోలినా కనీసం రూ.500 కూడా రాని పరిస్ధితి. ఆటో, ట్యాక్సీ నడుపుకొంటూ బతుకు బండి ఈడ్చడం ఎలా అన్నా? అనే మాటలను ఎప్పటికి మరిచిపోలేను’’         
– సీఎం వైఎస్‌ జగన్‌

వేదికపై ఆటో డ్రైవర్ల ఆనందం
ఏలూరు (మెట్రో): వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకు ఆటో డ్రైవర్లు ఆరాటపడ్డారు. దీన్ని గమనించిన ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) వారిలో ముగ్గురిని వేదికపైకి ఆహ్వానించడంతో ఆనందం వ్యక్తం చేశారు.

తండ్రి వాహనం ఇచ్చారు.. కుమారుడు భరోసా ఇచ్చారు
‘‘గతంలో అద్దెకు ఆటో తీసుకుని నడిపా. స్వయం ఉపాధి పథకం ద్వారా ఆటోను కొనుగోలు చేసుకునేందుకు దివంగత రాజశేఖరరెడ్డి ఆర్థిక సహాయం చేస్తే.. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వాహనమిత్ర పథకం ద్వారా సాయం అందించారు. జగనన్న రోడ్‌టాక్స్‌ లేకుండా చేసి మా జీవితాల్లో వెలుగులు నింపారు. జీవితాంతం జగనన్న కుటుంబానికి రుణపడి ఉంటాం’’     
 – విజయకుమార్, తాడేపల్లిగూడెం

ఎంతో ఆనందంగా ఉంది...
‘‘అందరికీ న్యాయం చేసిన జగన్‌ అన్నకు పాదాభివందనం చేస్తున్నాం. ఆయనకు రుణపడి ఉంటాం. ఈ ఆర్ధిక సహాయం ద్వారా కలిగే మేలు ఎప్పటికీ మరువలేం. భవిష్యత్‌పై జగన్‌ అన్న మాకు భరోసా కలిగించారు’’   
 – సూరిబాబు, ఏలూరు

మాకు వాహన మిత్ర పండుగ రోజు..
‘‘గతంలో ఏ ప్రభుత్వాలూ మమ్మల్ని గుర్తించలేదు. ముస్లింలు రంజాన్, క్రైస్తవులు క్రిస్టమస్, హిందువులు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకొంటారో మేం ఈ రోజు వాహనమిత్ర పండుగ చేసుకుంటాం. మా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు’’     
– లీలాకృష్ణ, ఏలూరు

ఆర్థికంగా నిలదొక్కుకుంటాం
వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు అందజేస్తున్న రూ.10 వేలతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వాహన రిపేర్లు, ఇతర ఖర్చులకు కావాలంటే అప్పు చేయాల్సివచ్చేది. కానీ ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయంతో మాకు అండ దొరికింది.
– నారాయణ స్వామి, ఆటో డ్రైవర్, అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement