ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారు : సీఎం జగన్‌ | CM Jagan Mohan Reddy Review Meeting On Sand Mining Policy | Sakshi
Sakshi News home page

చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టండి : సీఎం జగన్‌

Published Wed, Sep 11 2019 1:56 PM | Last Updated on Wed, Sep 11 2019 3:56 PM

CM Jagan Mohan Reddy Review Meeting On Sand Mining Policy - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక విధానంపై సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ‘ఇసుక’లో అవినీతిని అడ్డుకోవడం వల్ల అది సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక స్టాక్‌యార్డు పాయింట్లు పెంచాలని, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గగానే రీచ్‌ల నుంచి ఇసుక వీలైనంత త్వరగా స్టాక్‌ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను అరికట్టడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాలని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని వెల్లడించారు.

ఏ స్ధాయిలో కూడా అవినీతి ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక రవాణా విషయంలో ఇబ్బందులు అధిగమించామా అని అధికారులను ప్రశ్నించారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అందుకనుగుణంగా నిర్మాణాదారులు ప్లాన్‌ చేసుకుంటారని చెప్పారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫుటేజీని మానిటరింగ్‌ చేసే వ్యవస్ధ కూడా ఉండాలని అన్నారు. బల్క్‌ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు.

ముఖ్యమంత్రికి అధికారుల వివరణ..
‘వర్షాలు, వరదల కారణంగా ఇసుకను తవ్వడానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రీచ్‌ల నుంచి  ఇసుకను తీసుకురాలేకపోతున్నాం. కేవలం 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నాం. నదుల పక్కన తవ్విన ఇసుక కూడా వరదల కారణంగా కొట్టుకుపోయింది. లంక భూములు కూడా మునిగిపోయాయి. ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నాం.

మార్కెట్‌లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయి. నూతన ఇసుక విధానం (సెప్టెంబర్‌ 5) మొదలైనప్పటి నుంచి మొదటి మూడురోజులు పరిశీలిస్తే.. రోజుకు 10 నుంచి 12 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక డిమాండ్‌ ఉంది. సిమెంట్‌ కొనుగోళ్ల ఆధారంగా ఇసుక డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటున్నాం. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు లేవు’అని అధికారులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement