సాక్షి, అమరావతి: పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి అధికారులు సమాయత్తం కావాలని, భూమి లభ్యత లేనిచోట కొనుగోలు చేయాలని సూచించారు. ఇంటి పట్టా ఇవ్వడమే కాదు, స్థలం ఎక్కడుందో లబ్ధిదారులకు స్పష్టం చూపించాలన్నారు. ఉగాది రోజున ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్ ఒక పండుగ లాగ చేయాలన్న ఆకాంక్షను సీఎం జగన్ వెలిబుచ్చారు. అధికారులు విశ్వసనీయత కాపాడుకోవాలని.. ఏ విధానమైనా అందరికీ ఒకేలా ఉండాలని తర, తమ భేదం వద్దని పేర్కొన్నారు.
ప్రతి జిల్లాకు ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు వెబ్ పోర్టల్‌కు అనుసంధానం చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఇందులో అందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పనుల వివరాలను కూడా వెబ్ పోర్టల్‌లో ఉంచాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ గోడలకు అతికించాలని, ఎవరెవరికీ లబ్ధి జరుగుతుందో గ్రామస్తులకు తెలియాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పంచాయితీల స్థాయిలో తయారు కావాలని దీనివల్ల పాదర్శకత పెరుగుతుందన్నారు. జాబితాలో ఎవరు ఉండాలి, ఉండకూడదన్న దానిపై అవగాహన ఉంటుందని తెలిపారు. అధికారులకు వలంటీర్లు కళ్లు, చెవులుగా ఉంటారని.. గ్రామ సచివాలయం కూడా అక్కడే ఉంటుందని చెప్పారు. విధులను ఇష్టంతో నిర్వర్తించాలని, తమదైన ముద్ర వేసేలా పని చేయాలని కలెక్టర్లకు ప్రేరణ ఇచ్చారు. (చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment