పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : నేటినుంచి ఇతర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తించనుంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్‌లోని మెడ్‌కవర్ ఆసుపత్రుల డాక్టర్లు, అక్కడి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చికిత్సల విధానంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను కోరారు. ఎంతో విశ్వాసం, నమ్మకంతో చికిత్సకోసం ఏపీ వారు అక్కడకు వచ్చారని, వారు కోలుకునేంతవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ ముందుగా హైదరాబాద్ మెడ్‌కవర్ ఆసుపత్రి వైద్యుడు కృష్ణప్రసాద్‌తో మాట్లాడారు. అనంతరం డాక్టర్ కృష్ణప్రసాద్ స్పందిస్తూ.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చిన కార్యక్రమమన్నారు. అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపుతో రాష్ట్రానికి చెందిన పేదలు ఈ ఉదయం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో నిర్ణయించిన ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చు. సుమారు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి 716 జబ్బులకు ఈ మూడు నగరాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment