హస్తిన బయల్దేరి వెళ్లిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, టీజీ.వెంకటేష్, ఉత్తంకుమార్‌రెడ్డి, ఏరాసు, చీఫ్ విప్ గండ్ర, ఎమ్మెల్సీ షబ్బీల్ అలీ తదితరులు ఈరోజు ఉదయం హస్తినకు బయలుదేరారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగే జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరవనున్నారు. మన రాష్ట్రం తరుఫున సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారుల బృందం వెళ్తోంది.
ఈ సందర్బంగా మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణను కేంద్రం ప్రకటిస్తుందని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. ఇక ఢిల్లీ వెళ్లినా.. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి అధిష్ఠానం పిలిచి అడిగితే తప్ప.. తనకు తానుగా ఏ విషయం చెప్పేదిలేదని కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ సమగ్రతా మండలి సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం సీఎం హైదరాబాద్ చేరుకోనున్నారు.