రేపు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
* చిత్తూరులో ఆస్పత్రి ప్రారంభం
* పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ
* అధికారికంగా విడుదల కాని టూర్ షెడ్యూల్
చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చిత్తూరు నగరానికి రానున్నారు. దీనికి సంబంధించి అధికారిక షెడ్యుల్ విడుదల కాకపోయినా జిల్లా యంత్రాంగం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ సిద్దార్థజైన్, ట్రైనీ కలెక్టర్ శ్రుతి ఓజా, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తదితరులు మంగళవారం రాత్రి చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థలాన్ని పరిశీలించారు.
సీఎం పర్యటనపై టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. గురువారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్‌లో మురకంబట్టులోని సీతమ్స్ కళాశాల వద్దకు చేరుకుంటారు. మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు జ్ఞాపకార్థం నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం కట్టమంచిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన టాయ్‌లెట్లు ప్రారంభిస్తారు. అనంతరం హై రోడ్డు మీదుగా పీసీఆర్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు.
ఓవర్ బ్రిడ్జి నుంచి ఠాణా వరకు ఉన్న రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్‌గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. కొంగారెడ్డిపల్లె కూరగాయల మార్కెట్ వద్ద మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభిస్తారు. పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చిత్తూరులో రూ 5.కోట్లతో నిర్మించనున్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు, రూ.2 కోట్లతో నిర్మించనున్న సహకార భవనం, బీసీల భవనం, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ట్రైనింగ్ సెమినార్ భవ నాలకు శంకుస్థాపనలు చేస్తారు. బహిరంగ సమావేశం అనంతరం మెసానికల్ మైదానానికి చేరుకుని హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమవుతారు.
అధికారులతో జేసీ సమావేశం
చిత్తూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జేసీ భరత్‌గుప్త మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సీఎం పర్యటన విధులను వివిధ శాఖలకు కేటాయించారు.