
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు బుధవారం కలిశారు. ప్రకాశం జిల్లా పెద్దపవని బాలయోగి పాఠశాల చెందిన పదో తరగతి విద్యార్థిని సీహెచ్ మహేశ్వరి, విశాఖకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వర్షిణికి ముఖ్యమంత్రి అభినందలు తెలిపారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలపై గత ఏడాది నీతి అయోగ్, బెటర్ ఇండియా సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో 1600 ప్రాజెక్టులు ప్రదర్శనకు రాగా, ఏపీ నుంచి భారత్ తరఫున రష్యాకు ఎంపికైన విద్యార్థుల్లో వీరిద్దరూ ఉన్నారు. ప్రొటోటైప్స్ ఆన్ క్యాటిల్ డిమేజి అలర్ట్ సిస్టమ్, మల్టిపర్పస్ అగ్రికల్చర్ రోబోను ఈ విద‍్యార్థులు రూపొందించారు.
డీప్ టెక్నాలజీ లెర్నింగ్, ఇన్నోవేషన్ శిబిరంలో భాగంగా రష్యాలో పదిరోజుల పాటు ఇన్నోవేటింగ్ టెక్నాలజీపై మహేశ్వరి, వర్షిణి శిక్షణ పొందారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి తమ ప్రాజెక్ట్‌లను వివరించారు. రష్యా పర్యటను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులను ముఖ‍్యమంత్రి అభినందించి సన్మానించారు. వారిద్దరికీ చెరో లక్ష రూపాయల ఇన్సెంటివ్ చెక్‌లను అందచేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్, మంత్రి కన్నబాబు, కల్నల్ వి.రాములు (సెక్రటరీ, ఏపీ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్స్) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment