నచ్చాలి.. మెచ్చాలి.. | CM YS Jagan Comments in High Level Review Meeting | Sakshi
Sakshi News home page

నచ్చాలి.. మెచ్చాలి..

Published Sat, Jan 25 2020 3:40 AM | Last Updated on Sat, Jan 25 2020 11:21 AM

CM YS Jagan Comments in High Level Review - Sakshi

సాధ్యమైనంత వరకు నివాస స్థలాల కోసం అసైన్డ్‌ భూములను తీసుకోవద్దు. వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి భూములను తీసుకోవాల్సి వస్తే.. అసైనీలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి. ఎవరికీ ఇబ్బంది కలిగించొద్దు. ఈ విషయాన్ని అధికారులు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అన్ని విధాలా అనుకూలమైన, నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలన్నది బృహత్తర కార్యక్రమమని, దీనిని తంతుగా మార్చవద్దని సీఎం నొక్కి చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా నివాస స్థల పట్టాల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇళ్ల పట్టాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రజాసాధికార సర్వే (పీఎస్‌ఎస్‌) ప్రామాణికం కాదని, గ్రామ సచివాలయ, క్షేత్ర స్థాయి సిబ్బంది సర్వేనే కొలబద్ద అని స్పష్టం చేశారు. అర్హులు ఎంత మంది ఉన్నా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. 
ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

యజ్ఞంలా భావించాలి 
పేదలకు నివాస స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం యజ్ఞంగా భావిస్తోందని, అందువల్ల ఏ ఒక్కరూ ఈ మహా క్రతువును తంతుగా భావించవద్దని సీఎం ఉద్బోధించారు. అందువల్ల అన్ని విధాలా అనుకూలంగా, ఆవాస యోగ్యంగా ఉండే ప్రాంతాలను ఇళ్ల స్థలాల పంపిణీకి ఎంపిక చేయాలని సూచించారు. ఈ ప్రాథమిక విషయాన్ని ఎవరూ మరచి పోవద్దన్నారు. ఉపయోగం లేని చోట నివాస స్థల పట్టాలు ఇవ్వడంలో అర్థముండదని నొక్కి చెప్పారు. పట్టాలు ఇస్తున్న స్థలాలు సంతృప్తి కలిగించేలా, ఆవాస యోగ్యంగా ఉండాలన్న అంశాలను అధికారులు స్థలాలను ఎంపిక చేసే సమయంలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు. 

1 నుంచి గ్రామాల్లో సీఎం పర్యటన 
- ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నేను గ్రామాల్లో పర్యటిస్తా. ఈ సమయంలో ర్యాండమ్‌గా కొన్ని పల్లెలకు వెళ్లి పరిశీలిస్తా. లబ్ధిదారుల ఎంపిక, పథకాలు అమలు జరుగుతున్న తీరును స్వయంగా వాకబు చేసి తెలుసుకుంటా. ఎక్కడైనా పొరపాట్లు జరిగినట్లు తేలితే కచ్చితంగా అధికారులను బాధ్యులను చేస్తా. 
ఇళ్ల పట్టాలు ఇవ్వగానే ఇళ్లు కట్టడానికి లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో అధికారులు హడావుడిగా వ్యవహరించరాదు. ఈ మేరకు అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. 
- ఇళ్ల పట్టాల కోసం సడలించిన అర్హత నిబంధనలను గ్రామ సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలి. జాబితాలో పేర్లు లేని అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇది అవసరం. 
ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసిన స్థలాలకు లబ్ధిదారులు ఆమోదం తెలిపిన తర్వాతే ప్లాటింగ్‌ చేయాలి. లేకపోతే ఇందు కోసం వెచ్చించిన సొమ్ము వృధా అవుతుంది. 
- ఇళ్ల పట్టాల కోసం కేటాయించిన స్థలాల్లో మొక్కలు పెంచాలి. 
- మంగళగిరి, తాడేపల్లి మున్సిపాల్టీల్లో లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. పేదలకు కట్టించే ఇళ్ల డిజైన్‌ బాగుండాలి. ఇందుకు ప్రతిపాదనలు తయారు చేయాలి. ఇంటి స్థలం లేని వారు ఇక ఉండరాదు. 
- అభ్యంతరకర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే ప్రత్యామ్నాయం చూపాలి. వారికి ఇళ్ల పట్టాలు ఎక్కడ ఇస్తున్నామో చెప్పాలి. వారికి ఇళ్లు కట్టి అప్పగించిన తర్వాతే అభ్యంతరకర ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని కోరాలి. 
- ఇళ్ల పట్టాల కోసం అధికారులు గుర్తించిన స్థలాల వివరాలను గ్రామ సచివాలయాల్లో  ప్రదర్శించాలి. స్థానికుల అభిప్రాయాలను స్వీకరించాలి.
- ప్రజలను సంతోష పరిచేలా మన కార్యక్రమాలు ఉండాలి. అందుకు బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టలేదు. ‘అమ్మఒడి’ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో అతిపెద్ద కార్యక్రమం ఇది. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement