సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు తొలిదశలో మూడు లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజు (ఏప్రిల్ 2) ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ ద్వారా కూలీలకు పనులు కల్పించడం చాలా ముఖ్యమని, జూన్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు కల్పించటాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్ కాలేజీలన్నింటికీ ఈ నెల 30వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకాన్ని జూన్ 8న, ‘వైఎస్సార్ వాహన మిత్ర’ జూన్ 15న, ‘వైఎస్సార్ చేయూత’ జూన్ 22న అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ చేపట్టి మార్పులు చేర్పులు చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వతేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ ఏపీ పాల ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూన్ 1వ తేదీన పేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సిందేనని, ఈలోగా మిగతా పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధమై రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ‘స్పందన’లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..
వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్
మధ్య తరగతి ప్రజలకు (ఎంఐజీ) ఇళ్ల స్థలాలు...
పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు తొలిదశలో 3 లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజు (ఏప్రిల్ 2న) ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వివాదాలు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం 17 వేల ఎకరాల భూమి కావాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణ చేపట్టి మూడు కేటగిరీల్లో 133.33 గజాలు, 146.66 గజాలు, 194.44 గజాలలో ప్లాట్లు అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు కేటాయించాలి. వాటిలో భూగర్భ కేబుల్, విద్యుత్ వ్యవస్థ, వీధి దీపాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నీటి సరఫరా, వాటర్ డ్రెయిన్ల నిర్మాణం లాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి.
14 టీచింగ్ ఆస్పత్రులకు 30న...
రాష్ట్రంలో కొత్తగా 16 బోధనాస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే పులివెందుల, పాడేరు ఆస్పత్రులకు భూమి పూజ జరిగింది. మిగిలిన 14 టీచింగ్ ఆస్పత్రులకు ఈనెల 30న ఒకేసారి శిలాఫలకాలు ఆవిష్కరించబోతున్నాం. ఆ మేరకు ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయండి.
ఉపాధి హామీ పనులు
కోవిడ్‌తో సహజీవనం తప్పదు. అదే సమయంలో అన్ని కార్యక్రమాలు యథావిథిగా జరగాలి. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మంజూరయ్యాయి. వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరాలంటే ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో 7.41 కోట్ల పని దినాల కల్పన మాత్రమే జరిగింది. నిజానికి ఈ నెలలో మన టార్గెట్ 10.46 కోట్ల పని దినాలు. జూన్ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాల్సి ఉంది.
జూన్ 1న ఇళ్ల నిర్మాణం మొదలు..
ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణం జూన్ 1న ప్రారంభం అవుతుంది. ఆ ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (బూస్టప్) మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. స్టీల్, సిమెంట్ వినియోగం పెరుగుతుంది. మరోవైపు ఉపాధి దొరుకుతుంది. వీటన్నింటి వల్ల ఎకానమీ బూస్టప్ అవుతుంది. మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌజింగ్ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డుల మ్యాపింగ్ లాంటివి చాలా చోట్ల పూర్తి కావాల్సి ఉంది. వచ్చే స్పందన కార్యక్రమం నాటికి అవన్నీ పూర్తి చేయాలి. ఆ మేరకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మోడల్ హౌస్ తప్పనిసరి..
ఎక్కడ ఇళ్ల నిర్మాణం చేయాలన్నా నీటి వసతి తప్పనిసరి. అన్ని లేఅవుట్లలో నీటి కనెక్షన్లు ఉండేలా చూడండి. తొలిదశలో 9,024 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం తలపెట్టగా వాటిలో 8,798 లేఅవుట్లలో నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది. డిస్కమ్‌లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే నీటి సదుపాయం కల్పించాలి. ఆ పనులన్నీ ఈనెల 31లోగా పూర్తి చేయాలి. కలెక్టర్లు క్రమం తప్పకుండా ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ, డిస్కమ్ అధికారులతో సమీక్షించాలి. ఇప్పటికే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన 3.84 లక్షల ఇళ్ల నిర్మాణాలు వెంటనే మొదలు పెట్టవచ్చు. ప్రతి లేఅవుట్‌లో తప్పనిసరిగా మోడల్ హౌస్ నిర్మించాలి. తొలిదశలో 9,024 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం మొదలు పెడుతున్నా ఇప్పటి వరకు కేవలం 5,148 లేఅవుట్లలో మాత్రమే మోడల్ హౌస్‌లు కట్టారు. మిగిలిన వాటిలో కూడా వెంటనే పనులు పూర్తి చేయాలి. అప్పుడే మనకు నిర్మాణ వ్యయం కూడా తెలుస్తుంది. అన్ని లేఅవుట్లలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ కేబుళ్లు, నీటి సరఫరా వ్యవస్థ, ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి పనులు చేయాలి. ఆ మేరకు అన్నింటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వచ్చే నెల 20 కల్లా సిద్ధం చేసి పంపాలి. ఇక జూన్ 1న పనులు మొదలవుతాయి కాబట్టి అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా చూడండి.
90 రోజుల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు
మొత్తం 28,81,962 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా అన్నింటినీ ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులున్న 3,77,122 ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,53,852 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 40,990 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి. ఇప్పటికే గుర్తించిన అర్హులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంపై దృష్టి పెట్టండి. వారిలో 17,945 మందిని ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 2,964 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది. మిగిలిన 1,32,943 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. దీనిపై దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చొరవ చూపండి.
ఇళ్ల నిర్మాణం..
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వాటిలో పట్టణ ప్రాంతాల్లో 15.10 లక్షల ఇళ్లుండగా మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం.
టిడ్కో ఇళ్లు:
రాష్ట్రంలో 2,62,216 టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా వాటిలో 2,14,450 ఇళ్లకు సేల్ అగ్రిమెంట్ల పంపిణీ జరిగింది. ఇంకా 47,766 ఇళ్లకు సంబంధించి సేల్ అగ్రిమెంట్ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. వాటిలో అనర్హులకు కేటాయించిన ఇళ్లతో పాటు సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల నిల్చిపోయిన ఇళ్లు ఉన్నాయి. కలెక్టర్లు చొరవ చూపి వీలైనంత త్వరగా వాటన్నింటిని పరిష్కరించాలి.
ఖరీఫ్‌కు సన్నద్ధత:
ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నందున రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇచ్చే విత్తనాలు మొదలు ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉండాలి. అది మనం (ప్రభుత్వం) ఇచ్చే అష్యూరెన్స్. కల్తీ లేని సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ సీజన్‌లో 8.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీతో రైతులకు ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 1.35 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ జరిగింది. జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి కావాలి.
వ్యవసాయ సలహా కమిటీలు..
అన్ని ఆర్బీకేల పరిధిలో వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు కావాలి. ఇప్పటి వరకు 10,498 ఆర్బీకేలకు సంబంధించి, 8,650 మాత్రమే ఆ కమిటీలు సమావేశమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ఆ కమిటీలు చురుగ్గా పని చేయాలి. కమిటీలు రైతులకు క్రాప్ ప్లానింగ్ ఇవ్వాలి.
ఎరువులపై దృష్టి పెట్టాలి..
ఈ ఖరీఫ్‌లో 20.2 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని అంచనా. ఆ మేరకు కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్లు నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆ పని చేయాలి. జాయింట్ కలెక్టర్లు తరచూ పర్యటించాలి. ఈ–క్రాపింగ్ ఎలా జరుగుతుందన్నది సమీక్షించాలి. ఎందుకంటే రైతుకు ఏ మేలు చేయాలన్నా ఈ–క్రాపింగ్ తప్పనిసరి.
రూ.1.45 లక్షల కోట్ల రుణాలు..
జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలను కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీకి సంబంధించి పంట రుణాలు, ఇతర రుణాలన్నీ కలిపి మొత్తం రూ.1,44,927 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం. కౌలు రైతులకు కూడా ఈ ఖరీఫ్‌లో పంటల సాగు హక్కుల కార్డు (సీసీఆర్‌సీ)లు ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. ఆర్బీకేల ద్వారా తమకు న్యాయం జరగలేదని ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయవద్దు. కాబట్టి కలెక్టర్లు ప్రతి రోజూ ఆర్బీకేలపై దృష్టి పెట్టాలి.
రైతు సంతోషంగా ఉంటేనే..:
రైతు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం బాగా పని చేస్తోందని అర్ధం. రైతులు, వ్యవసాయాన్ని మనం బాగా చూసుకుంటే దాదాపు 62 శాతం ప్రజలకు మేలు చేసిన వాళ్లమవుతాం. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి.
ఆక్వా గిట్టుబాటు ధరలు తగ్గకూడదు..
ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించాం. మార్కెట్‌లో అంతకన్నా ధరలు తగ్గితే కలెక్టర్లు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఏ వ్యాపారీ రైతులను మోసం చేసే పరిస్థితి రాకూడదు. పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధర రావాలి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తప్పనిసరిగా రైతులకు దక్కాలి. రైతులు నష్టపోకుండా కలెక్టర్లు చొరవ చూపాలి.
ఈనెల, వచ్చే నెలలో పథకాలు, కార్యక్రమాలు
ఈనెల 31న పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ మొదలు కానుంది. జూన్ 8న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). జూన్ 15న వైఎస్సార్ వాహనమిత్ర. జూన్ 22న వైఎస్సార్ చేయూత (45 ఏళ్లకు పైబడిన మహిళలకు సాయం). అర్హులైన ఏ ఒక్కరికీ పథకం మిస్ కాకూడదు. కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి.
► దివంగత వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8 నాటికి ఆర్బీకేల నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కానీ చాలా పనులు జరగాల్సి ఉంది. మొత్తం 10,408 ఆర్బీకే భవనాల నిర్మాణం మొదలు పెడితే దాదాపు సగం మాత్రమే దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగిలిన వాటిలో కొన్ని బేస్‌మెంట్, మరికొన్ని శ్లాబ్ లెవెల్‌లోనే ఉన్నాయి. వాటిపై కూడా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు (గ్రామీణ), ఏఎంసీయూ, బీఎంసీయూ, అంగన్‌వాడీ కేంద్రాలు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌ల భవనాల నిర్మాణాలను నిర్ధారించుకున్న సమయంలోగా పూర్తి చేయడంపై కలెక్టర్లు దృష్టి సారించాలి.
► సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ)ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment