బుధవారం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించి లబ్ధి దారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు
సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని, వైఎస్సార్ చేయూత ద్వారా నాలుగేళ్లూ కచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని ముఖ్యమంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున నగదును ముఖ్యమంత్రి జమ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల మ«ధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందించనున్నారు. ఇందుకోసం ఏటా రూ.4,687 కోట్లు వ్యయం కానుంది. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ..
మీ ఇబ్బందులను పాదయాత్రలో చూశా..
–ప్రతి అక్కచెల్లెమ్మకు మేలు చేసే వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించడాన్ని ఒక అన్నగా, తమ్ముడిగా నా అదృష్టంగా భావిస్తున్నా. 45 – 60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వ పథకాలు ఏవీ లేవని నా పాదయాత్ర సమయంలో గమనించా. గతంలో కార్పొరేషన్ల ద్వారా గ్రామంలో ఒకరికో ఇద్దరికో మాత్రమే అరకొరగా రుణాలు ఇచ్చేవారు. అది కూడా లంచం ఇస్తేనే సాయం అందేది.
వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు చెక్ అందజేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆ రోజు... వెటకారం చేశారు
– నాడు అక్క చెల్లెమ్మల ఇబ్బందులను గమనించి వారికి పెన్షన్ రూపంలో డబ్బులు ఇద్దామనుకున్నా. 45 ఏళ్లకే పెన్షన్ ఏమిటని అప్పుడు చాలామంది వెటకారం చేశారు. అక్కచెల్లెమ్మలకు పెన్షన్ రూపంలో ఏటా రూ.12 వేలకు బదులుగా అంతకంటే ఎక్కువగా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ పథకాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చి అధికారంలోకి వచ్చాక రెండో ఏడాది నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నా. ఈ సాయాన్ని బ్యాంకులు ఇతర రుణాల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. ఈమేరకు బ్యాంకులకు ఆదేశాలిచ్చాం.
ఈ సాయంపై ఏ ఆంక్షలూ లేవు
– వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం అందచేసే డబ్బులను దేనికి వాడుకోవాలన్నది పూర్తిగా అక్క చెల్లెమ్మల ఇష్టం. ఇదే చేయాలని ఎలాంటి ఆంక్షలూ లేవు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కష్టాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల చేతిలో ఈ డబ్బులు పెడితే వారికి మేలు జరుగుతుందని భావించి నాలుగు అడుగులు ముందుకు వేశాం.
ఇంకా ఎవరైనా మిగిలిపోతే?
–ఇవాళ 22,28,909 మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. ఇంకా ఎవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులకు వచ్చే నెలలో పథకాన్ని వర్తింపచేస్తాం.
పలు సంస్థలతో ఎంవోయూ
– అక్క చెల్లెమ్మలు వ్యాపార రంగంలో రాణించేలా ప్రోత్సహించేందుకు దిగ్గజ కంపెనీలు అముల్, రిలయన్స్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్తాన్ యూని లీవర్ తదితర సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. వలంటీర్ల ద్వారా 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నాం. మెప్మా, సెర్ప్ ప్రతినిధులు మిమ్మల్ని కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా సహకరిస్తారు. అక్క చెల్లెమ్మలు ఒక వేళ పాల వ్యాపారం చేయాలనుకుంటే అముల్ సంస్థ పూర్తి సహకారం అందిస్తుంది. గేదెలు కొనివ్వడంతో పాటు పాలు కూడా కొనుగోలు చేస్తుంది.
– మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎం.శంకరనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment