![CM YS Jagan comments in a review on employment guarantee works - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/30/NREGS.jpg.webp?itok=KiLj-JN3)
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్‌కు సంబంధించి రూ.1,124 కోట్లు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురంలో ఆ నిధులు ఎక్కువ ఖర్చు కావాల్సి ఉంది. ఉపాధి హామీ పనులకు సంబంధించి అన్ని బిల్లులను అక్టోబర్ మొదటి వారంలో క్లియర్ చేస్తాం.
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారానికి రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలని సీఎం వైఎస్ జగన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకోసం సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, బల్క్ మిల్క్ యూనిట్లు, ప్రహరీల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇవన్నీ విజయవంతంగా చేపడితే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులకు అనుమతి ఇస్తామని చెప్పారు. స్పందనలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఉపాధి హామీ పనులపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► రాష్ట్రంలో 7,529 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు సకాలంలో ఏర్పాటు చేయాలి. లక్ష్యం ప్రకారం పనులు పూర్తి చేయాలి.
► వచ్చే ఏడాది మార్చి 31 నాటికి సచివాలయాల భవనాలు పూర్తి కావాలన్నది లక్ష్యం. తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో పనులు మందకొడిగా సాగుతున్నాయి.
► మొత్తం 10,408 ఆర్బీకే భవనాలు మంజూరు కాగా, వాటిలో 10,383 భవనాలు ఏర్పాటయ్యాయి. ఇంకా 25 పెండింగ్‌లో ఉన్నాయి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు సంబం«ధించి 1,269 భవనాలు బేస్‌మెంట్ లెవెల్ (బీఎల్) దాటలేదు. తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఈ పనిలో వెనకబడి ఉన్నాయి.
► వీటన్నింటినీ వెంటనే ఉపాధి పథకం కింద పూర్తి చేయండి. గ్రామ ఇంజనీరింగ్ సహాయకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. మెజర్‌మెంట్స్ రికార్డింగ్ కోసం వారి సేవలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఏఈఈలు, డీఈలు చొరవ చూపాలి. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగాలు.. వారికి పని కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment