వృద్ధిరేటులో ఏపీ టాప్‌లో నిలవడం సంతోషకరం.. దేశం కంటే అధికంగా నమోదైంది. పారదర్శక విధానాలే మూల కారణం.. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి.
– ‘స్పందన’పై సమీక్షలో సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు రూ.3,000 కోట్లు కేటాయించామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రాధాన్యత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమే కాకుండా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సూచించిన ప్రాధాన్యత పనులు, ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, ఉపాధి హామీ పనులు, స్పందన వినతుల పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
కలెక్టర్లూ పాల్గొనాలి..
గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో కనీసం రెండు రోజులు పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రజల నుంచి అందే వినతుల ఆధారంగా ప్రాధాన్యత పనులను గుర్తించి వాటిపై సంబంధిత ఎమ్మెల్యే విజ్ఞాపనలు పంపుతున్నారు. ఈ ప్రాధాన్యత పనులను పూర్తి చేసేందుకు ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించాం. వీటిని చేపట్టేలా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది.
వేగంగా పనులు చేపట్టడమే కాకుండా వాటిని అంతే వేగంతో పూర్తి చేయాలి. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దాదాపు 15 వేల సచివాలయాల పరిధిలో ప్రాధాన్యతా పనుల కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలి. దీనివల్ల అనుకున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి, సమన్వయ పరచడానికి ఆస్కారం కలుగుతుంది. కలెక్టర్లు విధిగా ప్రతి నెలా ఆరు సచివాలయాలను సందర్శించాలి. ఈ కార్యక్రమాలను నేనే నేరుగా పర్యవేక్షిస్తా.
ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఉపాధి పనుల్లో మంచి ప్రగతి
ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించింది. పనితీరు బాగుంది. ఉపాధి హామీలో మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ వేగం కొనసాగాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోంది. రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్న అన్నమయ్య, విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉపాధి పనులపై దృష్టి పెట్టాలి. పనుల్లో నాణ్యత పెరగాలి.
గ్రామాల రూపురేఖలను మార్చేస్తాయి..
సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఇవి గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వేగంగా, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ సచివాలయాల భవనాలు త్వరగా పూర్తి చేయడంపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. ఆర్బీకేల భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయడంపైనా కలెక్టర్లు దృష్టి సారించాలి. వీటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను అక్టోబరు 31 నాటి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవాలి.
డిసెంబరు నాటికి 4,500 గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ చేరుతుంది. మంజూరు చేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు గ్రామాల్లో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉంటాయి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలను సమూలంగా మారుస్తాయి. ప్రతి సచివాలయాన్నీ ఒక యూనిట్‌గా తీసుకుని పనులు పూర్తి చేయాలి. కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారుల వరకూ కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలి.
రహదారులకు భూసేకరణపై దృష్టి
రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 99 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. 3,079 కిలోమీటర్ల మేర రూ.29,249 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయి. అంతర్ రాష్ట్ర సరిహద్దుల అనుసంధానం కోసం మరో 7 ప్రాజెక్టులు కూడా చేపడుతున్నాం. డీపీఆర్ స్థాయిలో మరో 45 ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తంగా 151 ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.92 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి.
స్పందన.. ఎవరెవరు ఎప్పుడంటే..?
స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యం. ఎలా పరిష్కరిస్తున్నారన్న దానిపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలి. సంబంధిత సిబ్బంది ఆ సమయంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన నిర్వహించాలి. సంబంధిత అధికారులంతా పాల్గొనాలి. కలెక్టర్లు దీన్ని కచ్చితంగా అమలు చేసేలా చూడాలి. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ప్రతి గురువారం చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో స్పందనపై సమీక్షించాలి. అదే సమయంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్‌డీజీ) పైనా సమీక్ష చేపట్టాలి. లక్ష్యాలను చేరుకునేలా నిరంతరం పర్యవేక్షించాలి. స్పందన కార్యక్రమాన్ని నేనే నేరుగా పర్యవేక్షిస్తా.
ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి
2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.43 శాతంగా నమోదు కావడం సంతోషకరం. ఇది దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది. కీలక రంగాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ ఉండాలి. పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా. కలెక్టర్లందరికీ అభినందనలు. మీ అందరి కృషి ఫలితమే దీనికి కారణం. కీలక రంగాలపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ వృద్ధి నిలకడగా కొనసాగాలి. ఎంఎస్‌ఎంఈ రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. ఆ రంగం నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని సక్రమంగా పరిష్కరించాలి. ప్రతి పథకం ఎస్‌డీజీతో ముడిపడి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలి. వాటిని సక్రమంగా పర్యవేక్షిస్తే ఎస్‌డీజీ యధావిధిగా పెరుగుతుంది.
ఈ స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణం, సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్లానింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment