చేయూత.. విశ్వసనీయత | CM YS Jagan Comments In second installment for MSMEs is above Rs 512 crore program | Sakshi
Sakshi News home page

చేయూత.. విశ్వసనీయత

Published Tue, Jun 30 2020 3:34 AM | Last Updated on Tue, Jun 30 2020 8:07 AM

CM YS Jagan Comments In second installment for MSMEs is above Rs 512 crore program - Sakshi

రీస్టార్‌ ప్యాకేజీ రెండో విడతగా రూ. 512.35 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఎంఎస్‌ఎంఈ రంగానికి గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రాయితీలను చెల్లిస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం మే నెలలో రూ.450 కోట్లు మొదటి విడతగా, ఇవాళ రూ.512.35 కోట్లు రెండో దఫా రీస్టార్ట్‌ ప్యాకేజీలో ఇస్తున్నాం.  

చిన్న పరిశ్రమలు బాగుంటేనే రాష్ట్రాభివృద్ధిలో వేగం ఉంటుందని భావించి ఈ ఏడాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. వచ్చే ఏడాది స్పిన్నింగ్‌ మిల్లులకు కూడా చేయూత ఇస్తూ.. దాదాపు రూ.1,000 కోట్ల బకాయిలు చెల్లిస్తాం.  

ప్రభుత్వం మాట మీద నిలబడితేనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. ఆ దిశగా ప్రభుత్వం పూర్తి చేయూత ఇస్తుంది. పారిశ్రామిక రంగానికి అండగా నిలుస్తుంది. దేవుడి దయ, అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేయాలని ఆశిస్తున్నా.
- వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి విశ్వసనీయతను తీసుకువచ్చి, పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందు వచ్చేలా చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మాట చెబితే దానిపై నమ్మకం ఏర్పడేలా చేస్తానన్నారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉండటంతో పాటు చేయూత ఇస్తుందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు రాయితీల రూపంలో బకాయి పడిన మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం చెల్లించేందుకు రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించింది. అందులో భాగంగా మే నెలలో తొలి విడతగా రూ.450 కోట్లు చెల్లించింది. రెండో విడతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రూ.512.35 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలలో ఉన్న లబ్ధిదారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  
పారిశ్రామికవేత్తలతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

పరిశ్రమలకు ఊతమిస్తేనే ఉద్యోగాలు, ఉపాధి 
► రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగంలో మొత్తం 97,428 యూనిట్లు ఉన్నాయి. ఇందులో 72,531 సూక్ష్మ, 24,252 చిన్న, 645 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వాటి ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 
► చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం తోడుగా ఉంటేనే అవి మనుగడ సాగిస్తాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి, చివరకు మారుమూల గ్రామాలలో కూడా చిన్న చిన్న పరిశ్రమల ద్వారానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
► ఐటీఐ, డిప్లొమా చదివిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.  

ప్రభుత్వం చేయూత 
► గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు రాయితీల రూపంలో రూ.800 కోట్లకు పైగా బకాయి పెట్టంది. అవన్నీ పూర్తిగా తీర్చడంతో పాటు, కోవిడ్‌–19, లాక్‌డౌన్‌ వల్ల ఆ పరిశ్రమలకు వెసులుబాటు కల్పించేందుకు దాదాపు రూ.188 కోట్ల మూడు నెలల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలు మాఫీ చేశాం.  
► రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఎస్‌ఎఫ్‌సీ) ద్వారా రూ.200 కోట్ల వరకు పరిశ్రమలకు రుణాల కోసం వెసులుబాటు కల్పించాం. ఆయా పరిశ్రమలకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అతి తక్కువ వడ్డీ (6 నుంచి 8 శాతం)తో వర్కింగ్‌ క్యాపిటల్‌గా రుణం మంజూరు చేశాం. రుణాల చెల్లింపులపై 6 నెలల మారటోరియమ్‌తో పాటు, మూడేళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించాం. 

కొనుగోళ్లలోనూ ప్రాధాన్యం 
► ప్రభుత్వానికి ఏటా అవసరమైన దాదాపు 360 రకాల వస్తువులు, ఇతర సామగ్రిలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి తీసుకోవాలని నిర్ణయించాం.  
► వీటిలో 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన కంపెనీలు, మరో 3 శాతం మహిళలకు చెందిన యూనిట్ల నుంచి సేకరించాలని దిశా నిర్దేశం చేశాం. వీటికి 45 రోజుల్లోనే బిల్లులు చెల్లించాలని ఆదేశించాం.  

ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా.. 
► గత ప్రభుత్వం పరిశ్రమలకు దాదాపు రూ.4 వేల కోట్ల బకాయి పెట్టింది. వాటిని సెక్టార్‌ వారీగా చెల్లిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈలకు సహాయం చేశాం. చిన్న చిన్న పరిశ్రమలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. తద్వారా రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే గత ప్రభుత్వ బకాయిలు రూ.827 కోట్లు తీర్చడమే కాకుండా.. మొత్తం రూ.1,168 కోట్లతో కార్యక్రమం చేపట్టాం. 
► వచ్చే ఏడాది స్పిన్నింగ్‌ మిల్లులకు చేయూత ఇస్తాం. వాటికి కూడా దాదాపు రూ.1,000 కోట్లు బకాయిలున్నాయి. వాటిని చెల్లిస్తాం. ఆ విధంగా ఏటా ఒక రంగానికి చేయూతనిస్తాం. 
► ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. 

పీపీఈ కిట్ల ఆవిష్కరణ 
ఏపీ మెడ్‌ టెక్‌ జోన్‌ (ఏఎంటీజడ్‌)లో కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ కోసం తయారు చేసిన వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ కిట్లు), ఎన్‌–95 మాస్కులు, ల్యాబొరేటరీ పరీక్ష ఉపకరణాలను సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.   

ఎంఎస్‌ఎంఈల బాగోగులు జేసీ చూడాలి  
ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి బాగోగులు చూడ్డానికి ఒక జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)కు బాధ్యతలు అప్పగించాలని చెప్పాం. పనుల కోసం అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి పారిశ్రామిక వేత్తలకు ఉండకూడదు. అలా అయితే వారు నిరుత్సాహానికి గురవుతారు. అందుకనే జెసీలు దృష్టి పెట్టేలా జిల్లా కలెక్టర్లు చూడాలి. వారికి చేయూత నిచ్చేలా ఉండాలి. అప్పుడే నలుగురికి ఉద్యోగాలు వస్తాయి.  

కరోనా కష్టకాలంలో మీరు గట్టెక్కించారు 
‘బకాయిలు వస్తాయనుకోలేదు.. చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం చేశారు.. ప్రధానితో చిన్న పరిశ్రమల గురించి మాట్లాడిన తొలి సీఎం మీరే.. కరోనా సంక్షోభంలో దేవుడిలా సాయం అందించారు.. అడగకుండానే ఆదుకున్నారు.. మీ మేలు మరవలేం’ అని రాయితీ బకాయి సొమ్ము పొందిన ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి సోమవారం వారు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

గడ్డు పరిస్థితి నుంచి బయట పడుతున్నాం.. 
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన మాకు.. మీరు ఇచ్చిన ఇన్సెంటీవ్‌లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గడ్డు పరిస్థితి నుంచి బయట పడుతున్నాం. తొలి విడత ఇచ్చిన సొమ్మును వర్కింగ్‌ కేపిటల్, టర్మ్‌ లోన్‌కు వినియోగించాం. ఇప్పుడు రెండో విడత ఇచ్చిన సొమ్ముతో మరింతగా మేలు జరుగుతుంది. మీరు కేంద్రంతో జరిపిన సంప్రదింపుల వల్లే ప్రస్తుతం సరుకు రవాణా సవ్యంగా సాగుతోంది. మీ చొరవ వల్లే ఉత్పత్తి పెరిగింది. మరింత మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. మీరు బాగుంటే.. కోట్లాది మంది బాగుంటారు.   
– మామిడి వాసుదేవరావు, బల్క్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్, విజయనగరం జిల్లా  

మాలాంటి వారికి మీరే స్ఫూర్తి 
కష్టాల నుంచి ఎలా బయటకు రావాలో.. మాలాంటి వారికి మీరే స్ఫూర్తి. పొరుగు రాష్ట్రాల్లో వున్న నా మిత్రులకు కూడా మా సీఎంగారు ఇంత గొప్పగా చేస్తున్నారని గర్వంగా చెబుతున్నాను. నేను 2016లో సొంతగా పరిశ్రమను స్థాపించాను. నాతో పాటు మరో 40 మందికి ఉపాధి కల్పించాను. అయితే పరిశ్రమకు సంబంధించిన ఇన్సెంటివ్స్‌ను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇక అది రాదనుకున్నాం. మీ చొరవ వల్ల నాకు రూ.20 లక్షలు ఇన్సెంటివ్స్‌ అందింది.   
    – తేజేష్‌ రెడ్డి, పీవీసీ పైప్స్, నెల్లూరు జిల్లా  

ఎక్స్‌లెంట్‌ పాలన.. 
కోవిడ్‌ సమయంలో ప్రధాన మంత్రితో జరిగిన సమావేశంలో చిన్న పరిశ్రమలను ఆదుకోవాలని మా గురించి మాట్లాడిన తొలి సీఎం మీరే. 2016 నుంచి చిన్న పరిశ్రమలకు గడ్డుగాలం మొదలైంది. ఈఎంఐల కోసం బాగా ఇబ్బంది పడ్డాను. చాలా మంది పరిశ్రమను మూసేయమన్నారు. ఇప్పుడు మీరిస్తున్న ప్రోత్సాహంతో నిలదొక్కుకుంటున్నానని గర్వంగా చెబుతున్నాను. మా వద్ద పని చేసేవారందరికీ మీ వల్ల ఎంతో మేలు జరిగింది. కమిట్‌ మెంట్, సిన్సియారిటీతో ఎక్స్‌లెంట్‌గా పాలన సాగిస్తున్నారు.  
    – జయకుమారి, శ్రీ వెంకటసాయి పవన్‌ పాలిమర్స్, అనంతపురం జిల్లా  

మాట నిలబెట్టుకున్న సీఎం
చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండవ విడత ఎంఎస్‌ఎంఈ బకాయిలను విడుదల చేయడం పట్ల పారిశ్రామికవేత్తలందరికీ ఆనందంగా ఉంది. సీఎంకు కృతజ్ఞతలు. కష్ట కాలంలో గత ప్రభుత్వ బకాయిలు చెల్లించడంతో పాటు పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ఒక జాయింట్‌ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించడాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి వారం సమావేశాలు నిర్వహించడం ద్వారా ఎంఎస్‌ఎంఈ రంగం వేగంగా విస్తరించే అవకాశముంది. 
    – వాసిరెడ్డి మురళీకృష్ణ, అధ్యక్షులు, ఫ్యాప్సియా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement