ఇంగ్లిష్‌ విలాసం కాదు.. అవసరం | CM YS Jagan Comments at The Hindu Excellence in Education Seminar | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ విలాసం కాదు.. అవసరం

Published Thu, Feb 6 2020 3:57 AM | Last Updated on Thu, Feb 6 2020 8:26 AM

CM YS Jagan Comments at The Hindu Excellence in Education Seminar - Sakshi

ఈ రాష్ట్ర సీఎంగా.. ఓ తండ్రి స్థానంలో ఉన్న నేను నా పిల్లలను ఏ స్కూల్లో చదివించాలనుకుంటాను? తెలుగు మీడియానికి పంపుతానా? మీరు పంపుతారా? ఇక్కడున్న ప్రముఖులను అడుగుతున్నా? మనం ఎవరైనా మన పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించాలనుకుంటామా? అలాంటప్పుడు అట్టడుగు వర్గాల వారి పిల్లలను తెలుగు మీడియంలోనే చదివించాలని ఎలా అడుగుతాం? అది సమంజసమేనా? 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

గతంలో తెలుగు సబ్జెక్టును ఆప్షనల్‌గా మాత్రమే ఉంచారు. కానీ మేము దాన్ని తప్పనిసరి చేశాం. మా దగ్గరకు వచ్చి అడిగే వాళ్లందరికీ నేను చెబుతున్నదేమంటే ఇంగ్లిష్‌ మీడియంతో పాటు తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి చేస్తున్నామని పునరుద్ఘాటిస్తున్నా.

నేడు మనం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఒకటో తరగతిలో చేరుతున్న ఒక విద్యార్థి డిగ్రీకి వచ్చే సరికి 20 ఏళ్లు అవుతుంది. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి? అప్పటికి కనీసం డ్రైవర్ల అవసరం కూడా ఉండదు అని మాట్లాడుకుంటున్నాం. దీన్ని బట్టి మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించాలి. ఇక్కడ నేనో ప్రాథమిక ప్రశ్న అడుగుతున్నా.. ఇలాంటి అత్యాధునిక కాలంలో ఉంటూ ఇంగ్లిష్‌ మీడియం వద్దని అనగలమా? 

సాక్షి, అమరావతి: ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన ఇవాళ అవసరమే కానీ విలాసం కాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్‌ మీడియంపై విమర్శలు చేస్తూ, తనపై రాళ్లు వేస్తున్న వారి పిల్లలు, మనుమలు ఎక్కడ చదువుతున్నారో చెప్పాలని నిలదీశారు. విజయవాడలో బుధవారం ‘ది హిందూ’ గ్రూపు నిర్వహించిన ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధనను వ్యతిరేకిస్తున్న వారు తొలుత వారి పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి మాట్లాడితే బాగుంటుందని చురక అంటించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..

77 శాతం మంది ఇంటర్‌ తర్వాత మానేస్తున్నారు
‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ కాంక్లేవ్‌లో ది హిందూ గ్రూపు చైర్మన్‌ ఎన్‌ రామ్, ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ అంటే అర్థం ఏమిటంటే.. మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో చూసుకోవడం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉంది. ఇది దేశీయ సగటు 27 శాతం కంటే ఎక్కువ. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) విషయాన్ని చూద్దాం. 18 నుంచి 23 ఏళ్ల వయసు పిల్లలు కాలేజీల్లో చేరే శాతాన్ని జీఈఆర్‌ అంటారు. తరుచూ మనం బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనాలతో పోల్చుకుంటూ ఉంటాం. రష్యాలో 81 శాతం మంది, చైనా, బ్రెజిల్‌ దేశాల్లో 50 శాతం మంది పిల్లలు కళాశాలల్లో చేరుతుంటే మన దేశంలో అది కేవలం 23 శాతంగా ఉంది. అంటే మన దేశంలో 77 శాతం మంది పిల్లలు ఇంటర్‌ తర్వాత కాలేజీలకు వెళ్లడం లేదు. ఇది వాస్తవం. (చదవండి: భావి తరాల బాగుకే వికేంద్రీకరణ)

ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లిష్‌ అవసరం
ఇంగ్లిష్‌ విషయానికి వస్తే కొన్ని చేదు వాస్తవాలు కనిపిస్తాయి. నేడు అందరూ కంప్యూటర్‌ వాడుతున్నారు. సెల్‌ఫోన్, స్మార్ట్‌ ఫోన్, ఐపాడ్‌ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నా మౌలిక ప్రశ్న ఏమిటంటే.. వీటిని వాడేందుకు మనం ఏ భాష వినియోగిస్తున్నాం? ఇంటర్నెట్‌లో వాడే భాషేమిటి? ఇంగ్లిష్‌ మాత్రమే. ఇవాళ ఇంగ్లిష్‌ అనేది విలాసం కాదు.. అవసరం. మన పిల్లలకు మంచి ఉద్యోగం కావాలన్నా, మంచి జీతం కావాలన్నా వాళ్లు ఈ ప్రపంచంతో పోటీపడాలి. ప్రస్తుత పరిస్థితి ఇది. 20 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే ప్రపంచం నేడు ఎలా ఉంది? 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతోంది? అనేది చూడాలి. రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఇంగ్లిష్‌ మీడియం కావాల్సిన అవసరం లేదా?

ప్రజలు కోరుకుంటున్నారు కనుకే ఇంగ్లిష్‌ మీడియం
ఇంగ్లిష్‌ మీడియం చదువులు చాలా ఖరీదుగా ఉన్నాయి. 98.5 శాతం ప్రైవేటు స్కూళ్లు కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే నడుస్తున్నాయి. వాటిల్లో తెలుగు మీడియం ఎందుకు లేదు? ఎందుకంటే ప్రజలు అదే (ఇంగ్లిష్‌ మీడియం) ఆకాంక్షిస్తున్నారు కనుక. వారు పేదరికం నుంచి బయట పడాలనుకుంటున్నారు కనుక. నిరుపేదల జీవన శైలి మారాలంటే, వారికి సరైన విద్య అందించడం ఒక్కటే మార్గం అని నేను బలంగా విశ్వసిస్తున్నా. అదే పోటీ ప్రపంచంలో వారు వారి కాళ్లపై నిలబడేలా చేస్తుంది. భవిష్యత్తులో ఒక డ్రైవర్, ఒక గార్డెనర్‌ సైతం వచ్చి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు అందరూ ఇంగ్లిష్‌ మాట్లాడాల్సిందే కదా!

4 కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో మార్పులు 
కేవలం ఆంగ్ల మాధ్యమాన్నొక్కటే మేము తీసుకు రావడం లేదు. విద్యా వ్యవస్థలోనే సమూలమైన మార్పును తీసుకువస్తున్నాం. ఇందుకు నాలుగు కార్యక్రమాలను చేపట్టాం. వాటిలో మొదటిది.. పేదలకు అత్యంత ఖరీదైన ఇంగ్లిష్‌ మీడియం చదువులను ప్రభుత్వ సూళ్లలో ఉచితంగా (జీరో కాస్ట్‌) అందిస్తున్నాం. దీనితో పాటు తెలుగును నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తున్నాం. ఈ ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి, తర్వాత ఏడాదికో తరగతి చొప్పున నాలుగేళ్లలో 10వ తరగతి వరకూ పెంచుకుంటూ వెళ్తాం. ఆ నాలుగేళ్ల తర్వాత పదో తరగతి పిల్లలు తమ పరీక్షలను ఇంగ్లిష్‌లో రాసేలా చూస్తాం. ఈ నాలుగేళ్ల కాలంలో ఎదురయ్యే సమస్య లేమిటో మాకు తెలుసు. మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ నాలుగేళ్లలో వాటిని పరిష్కరించుకుంటూ వెళతాం. బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తాం. టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వడంలో భాగంగా పేరున్న సంస్థలతో ఇంటరాక్షన్‌ కార్యక్రమాలు చేపడతాం. 

రెండోది నాడు–నేడు
ఇంగ్లిష్‌ మీడియంతో పాటు నాడు– నేడు ద్వారా రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ వేళ ఆ స్కూళ్లు ఎలా ఉన్నాయో మూడేళ్ల తర్వాత ఎలా ఉంటాయో చూపించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఏడాదికి 15 వేల స్కూళ్ల చొప్పున మూడేళ్లలో విడతల వారీగా స్కూళ్ల రూపు రేఖలు మార్చబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా స్కూళ్లలో కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగు నీరు, ప్రహరీ, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌ బోర్డులు, పెయింటింగ్, ఫినిషింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ వంటివి విధిగా ఉండేలా చర్యలు చేపట్టాం. ఈ విధంగా 9 రకాల పనులు చేసి ఆ స్కూళ్ల స్థితిగతులను మార్చ బోతున్నాం. ఈ ఏడాది 15,750 స్కూళ్లను ఎంపిక చేశాం. 

మూడోది పౌష్టికాహారం
పాఠశాలల నాణ్యత ప్రమాణాల పెంపులో భాగంగా చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం. నేను నా పాదయాత్రలో పిల్లలకు పెడుతున్న భోజనం ఎంత దారుణంగా ఉందో కళ్లారా చూశా. ఇప్పుడు ఆ భోజనాన్ని పూర్తిగా మార్చడమే కాకుండా ఆయాలకు మంచి గౌరవ వేతనం ఇస్తున్నాం. భోజన నాణ్యత పెంచుతూ పిల్లల్ని ఆకట్టుకునేలా రోజుకో రకమైన మెనూ అమలు చేస్తున్నాం. పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం.

నాలుగో కార్యక్రమం అమ్మఒడి
పిల్లల తల్లులను మోటివేట్‌ చేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 42.32 లక్షల మంది తల్లులకు, తద్వారా 81.77 లక్షల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలిగేలా అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. పిల్లలను బడికి పంపించే తల్లులకు ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు ఇస్తున్నాం. ఈ పథకంలో లబ్ధి కోసం ఈ ఏడాది ఎలాంటి నిబంధనలు లేకపోయినా వచ్చే ఏడాది నుంచి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి. ప్రతి పిల్లవాడు స్కూల్‌కు పోవాలి. చక్కగా ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ఇది తోడ్పడుతుంది. ఆ విధంగా 12వ తరగతి వరకు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం. 

పాఠ్యప్రణాళికలోనూ మార్పులు
ప్రస్తుతం 23 శాతం మంది పిల్లలు మాత్రమే ఉన్నత చదువుల కోసం కళాశాలల్లో చేరుతున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా పాఠ్య ప్రణాళికలోనూ మార్పులు చేస్తున్నాం. ఇక నుంచి డిగ్రీ నాలుగేళ్లు ఉంటుంది. ఇంజనీరింగ్‌ ఐదేళ్లు ఉంటుంది. అన్ని డిగ్రీ కోర్సులు ‘ఆనర్స్‌’గా మారతాయి. చివరి ఏడాది తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌షిప్‌ ఉంటుంది. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేలా పాఠ్య ప్రణాళికలో మార్పులు తెస్తున్నాం. 

మంచి చేస్తుంటే రాళ్లు వేస్తున్నారు..
విద్యార్థులకు, సమాజానికి ఎంతో అవసరం అయిన ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తూ, విమర్శిస్తూ, రాళ్లేయాలని చూస్తున్నారు. మీరు.. మీ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తూ.. పేదింటి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు?  ఒకవేళ మీరు మీ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తుంటే మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టొద్దు’ అని సీఎం జగన్‌ అన్నారు. 

ఉన్నత చదువుల కోసం అప్పులపాలు కానివ్వం
పిల్లల ఉన్నత చదువుల కోసమని తల్లిదండ్రులు అప్పుల పాలు కావాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. దీని ద్వారా విద్య పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. ఇదొక్కటే కాకుండా విద్యార్థుల వసతి, భోజన అవసరాల కోసం ఏటా రూ.20 వేలు ఇవ్వబోతున్నాం. ఏటా ఫిబ్రవరిలో రూ.10 వేలు, ఆ తర్వాత జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు ఇస్తాం. ఈ పథకాలే విద్యా దీవెన, వసతి దీవెన. నాణ్యమైన విద్య అనేది పిల్లలకు మనమిచ్చే ఒక ఆస్తి. ఆ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. విద్య వల్ల దారిద్య్రం పోతుంది.

పేద కుటుంబాలు కూడా ఎంతో వృద్ధిలోకి వస్తాయి. వీటన్నింటి ద్వారా విద్యా రంగంతో పాటు, పేద కుటుంబాలలో కూడా మార్పులు తీసుకువస్తున్నాం. విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచేందుకు మేము చేస్తున్న కృషి ఇది. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారి జీవనం మెరుగు పడేందుకు ఈ ప్రభుత్వం తెస్తున్న విద్యా సంస్కరణలు ఎంతో సాయపడతాయి. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఆ దేవుని ఆశీస్సులతో పాటు, ప్రజల దీవెనలు, భావసారూప్యతగల వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. మా ఈ కార్యక్రమానికి ది హిందూ లాంటి పత్రికలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.

టీచర్లకు శిక్షణ పరిస్థితి ఏమిటి? : ఎన్‌ రామ్‌
‘మీరు చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మరి టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం విషయంలో ఏం చేయబో తున్నారు?’ అన్న ది హిందూ గ్రూపు చైర్మన్‌ ఎన్‌ రామ్‌ ప్రశ్నకు వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. వేదికపై ఉన్న మా విద్యా శాఖ మంత్రి సురేష్‌ సమాధానం ఇస్తారన్నారు. ‘మా మంత్రి రెవెన్యూ సర్వీస్‌లో పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. సామాజిక మార్పును కోరుకుంటున్నారు. అందుకే ఆయన్ను విద్యా శాఖ మంత్రిని చేశాం. మేము ఆశిస్తున్న మార్పును ఆయనే ముందుండి నడిపిస్తారు.

ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించి టీచర్ల ట్రైనింగ్‌ కోసం ఓ కరిక్యులమ్‌ తయారు చేశాం. ప్రాథమికంగా జిల్లాకు 20 మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం. వారు మిగతా వాళ్లకు శిక్షణ ఇస్తారు.   ఒకపక్క టీచర్లకు ట్రైనింగ్‌ కరిక్యులమ్‌తో పాటు మరో వైపు విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సును ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి వెట్రి శెల్వన్‌ అనే యువ ఐఏఎస్‌ ఆఫీసర్‌ను ఇంచార్జ్‌గా నియమించాం. ఈ అంశాలకు సంబంధించి అన్ని విషయాలను ఆమె వివరిస్తారు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి నిర్ణయం విప్లవాత్మకం 
నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక ముందడుగు అని ది హిందూ గ్రూపు చైర్మన్‌ ఎన్‌ రామ్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టబోతున్న వైఎస్‌ జగన్‌ డైనమిక్‌ సీఎం అని అభివర్ణించారు. సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధనే కాకుండా మొత్తం విద్యా వ్యవస్థలో సంస్కరణలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. 3,648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలను, బాధలను కళ్లారా చూశారని, ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలను తీరుస్తుండటం అభినందనీయం అన్నారు.

పాదయాత్ర ద్వారా ప్రభుత్వ స్కూళ్ల దుస్థితిని, అక్షరాస్యత శాతాన్ని చూసిన తర్వాత గ్రామీణ, ప్రభుత్వ స్కూళ్లను సంస్కరించి బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవాలనే సంకల్పంతో విద్యా సంస్కరణలకు నడుంకట్టారని ప్రశంసించారు. ప్రైవేట్‌ స్కూళ్లలో మాదిరి సర్కారీ స్కూళ్లలోనూ ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధనను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని కొనియాడారు. తమిళనాడు, కేరళలో ఇంగ్లిష్‌ మీడియం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా లేదని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అభినందించారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. ఇంగ్లిష్‌లో విద్యా బోధనను పలువురు విమర్శిస్తున్నప్పటికీ వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.  

రాష్ట్రంలో టీచర్‌ ట్రైనింగ్‌ వర్సిటీ : మంత్రి సురేష్‌
రాష్ట్రంలో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధన నేపథ్యంలో టీచర్‌ ట్రైనింగ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీచర్లు, విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేందుకు ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటున్నామని చెప్పారు. విద్యావేత్తల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాలకు చెందిన రిసోర్స్‌పర్సన్లు హాజరయ్యారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement